2455* వ రోజు..........           05-Jun-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

 

ఆదివారం (05.06.2022) నాటి అధిక సంఖ్యాకుల ఊరి బాధ్యతలు- @ 2455*!

 

            స్థలం ఊళ్లో కెల్లా పొడవైన విశాలమైన బందరు రహదారి లో పెట్రోలు బంకు దగ్గరి నిర్మాణం లో ఉన్న సచివాలయం; సమయం 4.206.10 నడుమ; కర్తవ్య పరాయణులు 38 మంది- చిన్న కార్ల చోదకులతో సహా; తగు మాత్రంగా శ్రమదాన సందడిప్రోగులు పడ్డ చెత్తా చెదారాలైతే మోకాలి ఎత్తున! వాటిని ఎత్తి, లోడు చేస్తే- పెద్ద ట్రాక్టరు ట్రక్కు పట్టనంత!

 

            క్లుప్తంగా చెప్పాలంటే అదీ నేటి వేకువ చల్లపల్లి స్వచ్చంద శ్రమదాన చరిత్ర! ఇంకాస్త వివరాల్లో కెళితే ఈ కార్యకర్తలు కొందరి చేతుల్లో కత్తులు, కొందరివి డిప్పలు, నలుగురైదుగురి హస్త భూషణాలు గొర్రులు, మరి కొందరి వేమో చీపుళ్ల మీద హక్కులు! అందరిదీ ఒకే దీక్ష అదే దక్షత- లక్ష్యం ఉమ్మడిది- అదే మంటే- ఇంత శుభ్ర సుందరమైన బందరు రహదారి ప్రక్కన ఈ ఐదారు సెంట్ల స్థలమూ, దాని ముందరి చిన్న కార్ల స్టాండూ, గణేష్ ప్రెస్ వీధీ ఇంత నికృష్టంగా , కశ్మల మయంగా- కళాహీనంగా ఎందుకు మిగిలి పోవాలని!

 

            స్వచ్చ కార్యకర్తలెప్పుడూ ఏ రోజు కారోజు ప్రణాళికా బద్ధమైన తమ కృషి అంచనాలనందుకొంటూనే ఉన్నారు! ప్రతి వేకువా 40-50-60 పని గంటలు శ్రమిస్తూ- అందుకోగల గ్రామస్తులకు స్ఫూర్తి నందిస్తూనే ఉన్నారు! 2455* పని దినాలుగా ఊళ్లో ఏదో ఒక వీధిలోనో గ్రామ ప్రవేశక సప్త రహదార్ల మీదనో కర్మల భవనాల శ్మశానాల- మురుగు కాల్వల- పంట కాల్వల- రోడ్ల గుంట పూడికల శుభ్ర-సుందరీకరణలోనో శ్రమిస్తూనే ఉంటారు! మరి ఇక ఆ కృషిని అంది పుచ్చుకోవలసినదెవరు?

 

            ఈ వేకువ గంటకు పైగా ఇంత ఉక్కపోతలో- ఉచ్చ కంపులో- దుమ్ములో ఏ కార్యకర్త ఎంతగా పట్టుదలకు పోయిందీ నేను దగ్గరగా చూశాను! ఏ ఒక్కరి బట్టలైనా దుమ్ము కొట్టుకోక చెమటకు తడవక- క్రింద ఎగుడు దిగుడు స్థలం లో కాలు తొట్రు పడక- ఉన్నవేమో గమనించాను! ఐదారుగురి- ముఖ్యంగా సుందరీకర్తల నడుములు పావుగంట పాటు వంగి పైకెత్తని- పనిలో మునిగిన సుందర-సుమనోహర దృశ్యానికి పులకించాను!

 

            తమ సొంతానికి కానేకాని ఈ కృషి, ఇంత పట్టుదల గ్రామ సామాజిక- సామూహిక శ్రేయస్సుకని తెలుసుకొని ఆశ్చర్యపడ్డాను! ఐతే- వీళ్ల నాలుగు లక్షల పని గంటల కఠిన తపస్సు కు సైతం ఇంకా చల్లపల్లి జనంలో సగం మందినైన కదిలించని- కరిగించని దుస్థితికి మాత్రం నిరుత్సాహ పడలేదు !

 

            6.25 కు కాఫీల- సరదా కబుర్లు ముగిశాక- నందేటి శ్రీనివాసుని స్వచ్చోద్యమ ప్రేరణా భరిత గానం మొదలయింది. దానికి ముందే గోళ్ల వేంకట రత్నం కసిగా ముమ్మారు తన గ్రామ స్వచ్చ-శుభ్ర- సౌందర్య సంకల్ప నినాదాలు వినిపించారు! డాక్టరు DRK గారి సమీక్షా- సంతోష భరిత ముగింపు వాక్యాలతో 6.50 దాక నేటి శ్రమదాన వేడుక జరుగుతూనే ఉన్నది!

 

            బుధవారం వేకువ సైతం మన శ్రమ సంకల్పం ఈ బందరు మార్గం లోనే- ఈ పెట్రోలు బంకు- మూడు రోడ్ల కూడలిలోనే నెరవేర వలసి  ఉన్నది! 

 

    సమర్పిస్తున్నాం ప్రణామం 34

 

వేరెవ్వరి సుస్థితికో ఇంతటి ఆరాటమా!

తమకు గాని లబ్దికి ఇంతగా పాటుబడటమా!

ఇందరి ఉమ్మడి లక్ష్యం ఈ గ్రామం సౌఖ్యమా!

శెభాష్! కార్యకర్త లార! చేకొనుడీ ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ  సుందర చల్లపల్లి కార్యకర్త

  05.06.2022.