1910* వ రోజు....           03-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1910* వ నాటి గ్రామ రహదారి బాధ్యతలు.

 

నిన్నటి సమిష్టి నిర్ణయాన్ననుసరించి ఈ సోమవారం వేకువ 4.04 – 6.18 నిముషాల నడుమ చల్లపల్లి ప్రధాన కూడలి కేంద్రంగా ఉభయ దిశలా సాగిన 26 మంది స్వచ్చంద శ్రమదానంతో ½ కిలో మీటరు మేర వీధులు స్వచ్చ-శుభ్ర-సుందరములైపోయినవి.

 

ఈ నాటి స్వచ్చ సైనికుల అందరి ఆయుధం చీపురే! అటు నాగాయలంక దారిలోని ఇంధన కేంద్రం(పెట్రోలు బంకు) నుండి సంత వీధి దాక సాగిన శ్రమదాన వేడుక విజయవంతమైంది.

 

మూడు రోడ్ల కూడలి, బందరు దారిలోని పెట్రోలు నిలయం, చిన్న కార్ల నిలుపుదల ప్రాంతం, వివిధ బ్యాంకుల ఏ. టి. యం. ల స్థలం ఉభయ దేవాలయాల, తోపుడు బళ్ల, పూల దుకాణాల, చిరు తిళ్ల అంగళ్ల, కాయగూరల కొట్ల రకరకాల వ్యర్ధాల లో ఈ కార్యకర్తల సేకరణకు “కాదేదీ ఊడ్పుకనర్హం!” తమ వృత్తులు వేరైనా స్వచ్చ చల్లపల్లి కార్యకర్తల ప్రవృత్తి అనివార్యంగా సొంత ఊరి మెరుగదలే!

 

వీరిలో ఐదారుగురు “రెస్క్యూ” దళం పాగోలు గ్రామంలో యార్లగడ్డ శివ ప్రసాదు గారి భవన నిర్మాణ వ్యర్ధాలను ట్రాక్టర్ లో నింపి, తెచ్చి, R.T.C ప్రాంగణంలో తారు మార్గం ప్రక్క మట్టి కోసుకుపోయి, గుంటలు పడిన చోట పూడ్చి, సర్ది ఆ నిరంతర రద్దీ దారి రక్షణకు హామీ ఇచ్చారు!

 

సుందరీకరణ సభ్యులు తమ ప్రవృత్తిని ఈ రోజుకు ఆపి, వీధి శుభ్రతలలో పాలు పంచుకొన్నారు.

 

నిన్న సాయంత్రం ప్రాతూరి శంకర శాస్త్రి గారి మనుమని వివాహానంతర స్వీకరణ వేడుకలో పాల్గొని, అర్థరాత్రి తిరిగి వచ్చిన 50 మంది కార్యకర్తలలో ఈ ఉదయం 4.00 కు 26 మందే రాగలిగారు. సాంప్రదాయ బద్ధంగా శాస్త్రి గారికి పూర్తి తృప్తి కరంగా విజయవాడలో జరిగిన “ హరిత వేడుక” లో పలుమార్లు స్వచ్చోద్యమ చల్లపల్లి ప్రస్తావన వచ్చింది; గ్రామ, రాష్ట్ర స్వచ్చతకై జరగవలసిన- జరుగుతున్న కృషిని గూర్చిన చర్చలు జరిగాయి!

 

6.40 నిముషాలకు జరిగిన స్వచ్చంద కృషి సమీక్షలో- రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చల్లపల్లి లో జరుగుతున్న దురదృష్ట కర చర్య చర్చించబడింది! ఎంతో కష్టపడి పెంచిన, హరిత సౌందర్యం ప్రదర్శిస్తున్న లక్షలాది “ఆల్సేషియస్” వృక్షాలను కేవలం అపోహతో నరుకుతుండడం ఎంత బాధాకరం!

 

సరే! రేపటి మన శ్రమదాన నిర్వహణ కోసం కీర్తి హాస్పటల్ దగ్గర కలుసుకొందాం.

 

          ఇదొక సామాజిక ప్రయోగం.

ఒక నిరంతర దీర్ఘ పయనం ఊరి మేలుకు ఒక ప్రయత్నం

ఒక సమీకృత శుభ్ర సుందర-మొక సమన్విత స్వచ్చగీతం

ఒక విలాసం-ఒక సుగంధం-ఒక్క సామాజిక ప్రయోగం

చల్లపల్లి ని నిజంగానే స్వచ్చ సైన్యం సంస్కరిస్తుందా!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 03/02/2020

చల్లపల్లి.