2456* వ రోజు....           06-Jun-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

గ్రామ భద్రతా చర్యల్లో రెస్క్యూ టీం నిమగ్నత! @2456*

            సోమవారం (6.6.22) వేకువ ఈ కార్యకర్తలు చేసింది - రెండు పంచాయతీల్లోని రెండు ఊళ్లలోని ప్రజోపయోగ కార్యాలు! గంగులవారి పాలెం వీధిలోని తుది నివాస గృహాల దగ్గర త్వరలో దెబ్బతినబోతున్న రోడ్డు పడమర భాగమొకటీ, రామానగరంలోని చండ్ర పెద్దబ్బాయి గారి ఇంటి ఎదుటి మర్రి చెట్టు తొలగింపు రెండోదీ!

            ఇప్పటికే గంగులవారిపాలెం బాటలో డ్రైనేజి వైపు దగ్గర గుంట దగ్గర వాహనాలకు ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. అసలా డ్రైను గొట్టం పూడేపోయింది. ఈ కార్యకర్తలు తవ్వితే గాని బైటపడలేదు. ఉభయ పంచాయతీలు గాని, రోడ్ల శాఖ గాని స్పందించనప్పుడు - ఇదుగో ఈ రెస్క్యూ టీం తమకు చాతనైన పద్ధతిలో ఆ బాధ్యత స్వీకరించింది!

            ఆ పైపును మార్చాలి, గుంటను పూడ్చాలి, డ్రైను సక్రమంగా నడవాలి, మరి ఈ పనులకు వీళ్ళు రేపటి వేకువ సైతం శ్రమించాలి.

            రామానగరంలోని పెద్దబ్బాయి గారి వీధి మొదట్లో ఒక ప్రహరీకి మొలిచి పెరిగి, వృక్షంగా ఎదిగిన మర్రి. అది గోడను బ్రద్దలు కొట్టక ముందే ఈ వేకువ అరగంటకు పైగా శ్రమించిన కార్యకర్తలు ఆ చెట్టునే దుంప నాశనం చేశారు! ఒక ట్రాక్టరుపై నిలబడి - కత్తులు రంపం వాడితే గాని సదరు చెట్టు అదృశ్యమై, గోడకు రక్షణ లభించ లేదు!

            నేటి ఉభయ గ్రామ రక్షణకు పూనుకొన్న ఈ నలుగురైదుగురి కష్టాన్ని, కనీసం ఆ వీధుల సమీప నివాసులైనా గుర్తించారా? అభిమానించారా? రేపో మాపో అనుసరిస్తారా? పరోపకార పారీణతలోని, సామాజిక బాధ్యత నెరవేర్చడంలోని సంతృప్తిని అనుభవిస్తారా?

 

       సమర్పిస్తున్నాం ప్రణామం 35

స్వార్థంతో పెనవేసో స్వార్థ రహిత పథంగానొ...

ఎలాగైన గడప వచ్చు ఈ మానుష జన్మంతా!

ఒక్క గంట కనీసం మన ఊరి కొరకు వెచ్చిస్తే

మనకు, తోటి మనుషులకూ మంచి జరుగ వచ్చునే"..

అను సందేశం చాటిన అందరికీ ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ  సుందర చల్లపల్లి కార్యకర్త

  06.06.2022.