2457* వ రోజు.....           07-Jun-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

7-6-22 - మంగళవారం నాటి గ్రామహిత చర్యలు కూడ రెస్క్యూ టీం వాళ్ళవే 2457*

          యధాపూర్వంగానే గ్రామ రక్షకదళం నేటి వేకువ కూడ గంగులవారిపాలెం వీధి గస్తీ గదిదగ్గర ప్రత్యక్షం - తమ సరంజామాతో సహా! నిన్నటి తమ అసంపూర్ణ లక్ష్యం - ఈ వీధి చివరలో డ్రైనేజి తూమునూ, అక్కడి గుంటనూ సరిదిద్దే పని కోసం వెళ్లడమైతే వెళ్లారు - ఇంకొంచెం త్రవ్వి, రోడ్డు అడుగున తూర్పు నుండి పడమరగా - బాగా పల్లంలో ఉన్న ఆ పెద్ద తూమును కనిపెట్టినా, దానికి అతుకు వేయవలసిన సరైన ముక్క దొరకక ఆ పని అలాగే నిలిచిపోయింది.

          అందువల్ల ఈ టీము పెదకళ్లేపల్లి రోడ్డులో ఇటీవల పడిడ్రైనునూ, కొంత దాక రోడ్డునూ క్రమ్మేసిన ఒక పెద్ద చెట్టు దగ్గరకు చేరింది. అక్కడ చెట్టు కొమ్మల్ని కోసి బోదెను వేరు చేసి, అటు డ్రైనుకూ - ఇటు రోడ్డుపై వాహన చోదకులకూ మేలు చేసింది!

          ఇక అప్పుడు - వాళ్ల కళాత్మకత మేల్కొని, ఏడెనిమిది అడుగులున్న బోదెను ప్రస్తుతం ఈ ఊరి శిల్ప కళా వేదికగా ఉన్న గంగులవారిపాలెం వీధిలోకి తరలించాలనే, దాని ఆకృతిని అవసరానుగుణంగా మార్చి, రంగులద్ది, ఆస్పత్రి - జల నాట్యకేళీ ప్రాంతంలో సహజ సిద్ధమైన - ప్రాకృతిక వేదికగా రూపొందించాలనీ తట్టింది.

          సదరు బోదెను త్రాళ్లతో బంధించి, ట్రాక్టర్ తో అనుబంధించి, సుమారొకటిన్నర కిలోమీటర్ల దూరం ఈడ్చుకు రావడమూ, మధ్యలో ఊడిపోతే, సరిదిద్ది - అస్పత్రి ప్రక్క వీధిలో దించడమా - ఇదీ నేటి రెస్క్యూ దళ ఘనకార్యం!

          ఐతే ఈ ఘన కార్యాలు లోతుగా తర్కించని వాళ్లకు వెర్రి చేష్టలుగా అనిపిస్తాయేమో గాని వెనకటికొక భావ కవి తన కాల్సనిక కవిత్వాన్ని విమర్శించే వాళ్ళనుద్దేశించి :

          నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు?

          నా ఇచ్ఛయే గాక నాకేల వెరపు?...”

అని ధైర్యం చెప్పుకొన్నట్లే :

ఈ స్వచ్ఛ కార్యకర్తలు కూడ

          ఏ విమర్శలతోటి మాకేల జడుపు?

          మా స్వయం కృషిలోన మాకున్న ఒడుపు

          ఊరి సంక్షేమమే మాకాట విడుపు!...

అనుకుంటూ, ఏడెనిమిదేళ్ల నుండి తమ పద్ధతిలో తాము ప్రస్ధానిస్తూనే ఉన్నారు!

 

          కొండపల్లి సుఖవేణి గారి జ్ఞాపకార్ధం వారి కుమార్తె లక్ష్మీ కుమారి గారు మనకోసం మనం ట్రస్టుకు 10,000/- విరాళాన్ని అందజేశారు. వీరికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.   

         

      సమర్పిస్తున్నాం ప్రణామం 36

అందరికి అనగాహనున్నది ఐకమత్యం గెలుస్తున్నది

ఊరి దుస్థితి పిలుస్తున్నది ఉషస్సులు స్వాగతిస్తున్నవి

పరోపకార ప్రయత్నాలే పరమ సుఖమని తలచి చొరవను

చూపు ధన్యుల కెల్ల చేస్తా స్వచ్ఛ - సుందర ప్రణామంబులు!

 

- నల్లూరి రామారావు,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ  సుందర చల్లపల్లి కార్యకర్త

  07.06.2022.

కొండపల్లి సుఖవేణి గారి జ్ఞాపకార్ధం వారి కుమార్తె లక్ష్మీ కుమారి గారు ‘మనకోసం మనం’ ట్రస్టుకు 10,000/- విరాళాన్ని అందజేశారు. వీరికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.