2458* వ రోజు........           08-Jun-2022

ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

ఊరి కాలుష్యం మీద ఎడతెగని పోరులో - 2458* వ నాడు.

            బుధవారం (8-6-22) వేకువ 4.16 సమయంలోని సదరు యుద్ధంలో విజృంభించిన వాళ్లు 2 డజన్ల మంది; రణ క్షేత్రం మాత్రం ప్రాతదే! బందరు జాతీయ రహదారిలోని పెట్రోలు బంకు - నిర్మాణం సగంలో ఆగిన సచివాలయం - చిన్న కార్ల నిలుపుదల చోటు! యుద్ధం ముగిసింది 6.06 నిముషాలకు!

            “మిగతా ఊరినంతా వదిలేసి, గత 3 రోజులుగా ఈ కాస్త ప్రదేశంలో స్వచ్ఛ కార్యకర్తలు ఏం సాధిస్తున్నట్లు? ఏ కశ్మల నిధి నిక్షేపాలు త్రవ్వి తీస్తున్నారు? “ఈ ఉచ్ఛ కంపులో - గుంట మెరకల్లో - దుర్భర ఉక్క పరిస్థితిలో వీళ్లకెందుకింత పట్టుదల? ఏ విస్తృత ప్రయోజన మాసించి ఇంతగా శ్రమించాలి?....” అని ఎవరికైనా లఘు - గురు శంకలు కలగడం సహజమే!

            ఎనిమిదేళ్ల చల్లపల్లి స్వచ్చోద్యమ మహాప్రస్థాన చరిత్రే దానికి సమాధానం! పాతిక ముప్పై వేల మంది ఉనికి గల ఊళ్లో తాము కేవలం 30 - 40 – 50 మందే నిత్య పారిశ్రామికులమనే గ్రహింపు గల స్వచ్చంద శ్రమదాతలు ఈ ఊర్లో ఎన్నెన్ని ఘనతలు సాధించారు? ఊరిని దర్శనీయంగా - ఆదర్శనీయంగా ఎలా మార్చగలిగారు? ఈ మాత్రం పచ్చదనం, ఆహ్లాదం, జనంలో పాక్షికంగానైనా పరివర్తనం వచ్చాయంటే ఈ స్వచ్చ సుందరోద్యమం ఫలితం కాదా?

            సచివాలయ ప్రాంగణంలో మూడవ నాడు, ఇంధన నిలయం వద్ద, చిన్న కార్ల స్టాండు, ‘గణేష్ముద్రణాలయం ప్రాంతమంతా రెండో మారు ఇందరు కార్యకర్తలు శ్రమిస్తేనే గదా ఈ మాత్రమైనా స్వచ్చ శుభ్ర పరిణామం? బందరు రోడ్డు చాలా బాగున్నదని పించినా, మిగిలిన ఈ 50 గజాల వ్యాసంలోనే మూడు రోజుల్లో మూడు ట్రక్కుల దిక్కుమాలిన వ్యర్ధాలు, గోనె సంచుల కొద్దీ ప్లాస్టిక్ సంచులు, సీసాలు, కప్పులు త్రవ్వే కొద్దీ వస్తుండడమే ఒక వింత!

            ఇంత ఛండాలపు మురుగు - ఉచ్చ దుర్గంధాల నడుమ మూన్నాళ్లుగా - 3X50 పనిగంటలుగా శ్రమించి, మరి కొన్నాళ్ల తరువాత మనకోసం మనంట్రస్టు తరపున శౌచాలయాలు, మూత్రశాలలు నిర్మించబోతున్న స్వచ్చ కార్యకర్తలకు రాన్రానూ ఈ గ్రామం ఎంతగా ఋణగ్రస్తమౌతున్నదో! పేరుకుపోతున్న ఈ సామాజిక ఋణం ఎప్పటికి తీరాలో మరి!

            5:30 సమయం తర్వాత అవరణలో స్వచ్ఛ సైనికుల పని వేగం పెరిగి, బైట చిన్న కారు డ్రైవర్ల చీపుళ్లతో లేస్తున్న ధూళి మేఘం క్రమ్మి నా బోటి వాళ్లను ఉక్కిరి - బిక్కిరి చేసేశాయి!

            6.30 కి అందుకు తగ్గట్లుగా భోగాది వాసు గారి స్వచ్ఛ - పరిశుభ్ర సౌందర్య సాదక నినాదాలు మారు మ్రోగాయి! మాలెంపాటి డాక్టరు గారి క్రమం తప్పని నెలవారీ – 2,000/- రూపాయలు మేనేజింగ్ ట్రస్టీ గారికి అందాయి!

            రేపటి మన శ్రమదానం కూడ ఈ బందరు మార్గంలోనే - నేటి ప్రాంతంలోనే ఉండబోతున్నది!

           

           సమర్పిస్తున్నాం ప్రణామం – 37

చెట్టు - పుట్టలు, మురుగు వాగులు, చెత్త నిండిన పంట కాల్వలు

కళాహీనములైన వీధులు, జీవరహితములైన బాటలు

స్వచ్చ సైన్యం పాదస్పర్శతో, హస్తవాసితొ కనుల పండుగ

లైన వింతటి మార్పు తెచ్చిన అందరికి మా శుభ ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ  సుందర చల్లపల్లి కార్యకర్త

  08.06.2022.