2459* వ రోజు...........           09-Jun-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

సహనశీలమైన చల్లపల్లి స్వచ్చోద్యమం వయస్సు 2459* నాళ్లు!

            9-6-22 - గురువారం వేకువ సమయపు శ్రమదానం వయస్సైతే 110 నిముషాలు. సదరు ఆయుర్దాతలేమో 21 మంది. ముగ్గురు - నలుగురు బందరు రోడ్డెక్కి చీపుళ్ల ప్రయోగం చేసినా, ఎక్కువ మంది కష్టించింది మాత్రం సచివాలయ అసంపూర్ణ కట్టడం దగ్గరే! రెండు - మూడు రోజులు కార్యకర్తలతో బాటు శ్రమించిన చిన్న కార్ల డ్రైవరు మిత్రులెందుకో ఈ వేకువ కనిపించలేదు.

            అసలెందుకో గాని - దేశమంతటిలోనూ శ్రమకూ, దాని విలువకూ చోటు తగ్గిపోతూ వస్తున్నది. అనేక మంది బట్ట నలగని ఉద్యోగాలు, వ్యాపారాలు - అవి కుదరనప్పుడు అక్రమాలతో బ్రతుకు బండి లాగుతున్నారు ఏలే వాళ్లు సైతం శ్రమతో సంపదలు సృష్టించే దృక్పధాన్ని కాక, తాతల్నాటి ప్రజల సొత్తుల్ని వాళ్లకే దానధర్మాలు ప్రోత్సహిస్తున్నారు! ఏ పల్లెటూరు కార్మిక కర్షకులో తప్ప ఒళ్లు వంచి, శ్రమించి, సంపాదించి, తమ కాళ్ల మీద తాము నిలబడే వాళ్లిక ముందు కనిపించరేమో!

            చల్లపల్లి స్వచ్చంద శ్రమదానం అందుకు మినహాయింపు! పంచాయితీల శక్తి చాలనప్పుడు ప్రభుత్వాల ప్రజారోగ్య సంక్షేమ ప్రయత్నాలు విఫలమౌతున్నప్పుడు తమ గ్రామ సమాజ సంక్షేమానికి నడుం కట్టి ఎనిమిదేళ్లుగా స్వచ్చ కార్యకర్తల కృషి ప్రస్తుత కాలానికొక ఆవశ్యకం ఆదర్శం సముచితం!

            ఎప్పటిలాగే స్వచ్చ కార్యకర్తల ప్రణాళికా బద్ధ కృషి నేడు కూడా! సచివాలయం తూర్పు జాగాలో ఈ నాటి కష్టతరమైన శ్రమ విశేషమేమంటే, 1516 మంది గత మూడు రోజులుగా బాగు చేసిన చోటనే పారలు, గునపాలు, గోకుడు త్రవ్వుడు పారల్తో జానెడు లోతుగా త్రవ్వడమూ, నేల పొరల్లో దాగిన పాత గుడ్డ ముక్కలు, ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు, పాత చెప్పులు, సీసా పెంకులు డిప్పల కొద్దీ ఏరి, ట్రక్కులో నింపుకోవడమూ!

            త్వరలో నిర్మించి, పంచాయితీకి తద్వారా ప్రజలకు అంకితం చేయబోయే మరుగు దొడ్ల మూత్రశాలల ఒక రకమైన పునాది పనులన్న మాట ఇవి! ఈ పనుల్లో మునిగి ఇందరు శ్రమదాతలు బట్టలు చెమటతో తడుపుకొని, వంచిన నడుమెత్తక గంటన్నర పాటు పాటుబడడం పెద్ద విశేషమే!

            6.20 సమయంలో కాఫీ బదులు చల్లని మజ్జిగ సేవించి, ఆకుల దుర్గా ప్రసాదు మూడు మార్లు నినదించిన గ్రామ పరిశుభ్ర స్వచ్చ సౌందర్య సంకల్పాన్ని ఎలుగెత్తి ప్రకటించి, శ్రమ జీవనం పట్ల సహన ప్రశాంత బ్రతుకు శైలి పట్ల డాక్టరు DRK గారి సోదాహరణ ప్రసంగం విని, తమ గ్రామ బాధ్యతను రేపటికి వాయిదా వేసుకుని కార్యకర్తలు గృహోన్ముఖులయ్యారు! వీరిలో కొందరు గంగులవారిపాలెం గస్తీ గది దగ్గర 8.00 నుండి 22 వ దినం విజయవంతంగా జరిగే మజ్జిగ వితరణ దగ్గర హాజరౌతారు!

            రేపటి మన ఊరి మెరుగుదల ప్రయత్నం విజయవాడ రహదారిలోని పెట్రోల్ బంకు దాటిన తరువాతి కోమలా నగర్ బజారులో జరగాలి!

           

           సమర్పిస్తున్నాం ప్రణామం 38

అందరిది ఈ గ్రామ మని, ఆనందదాయకముగా మార్చే

సుదీర్ఘ శ్రమదానోత్సవం గని ఇందరొకటై పాటుపడగా

ఎందు కింతటి ఆభిజాత్యం? ఏల కలియుట కింత బిడియం?

స్వాగతిద్దాం సమర్పిద్దాం స్వచ్చ సుందర సత్ప్రణామం!

 

 - నల్లూరి రామారావు,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ  సుందర చల్లపల్లి కార్యకర్త

  09.06.2022.