2460* వ రోజు....           10-Jun-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

ఇరువదిన్నొక్క మంది శ్రమతో కోమలానగర్ వీధి శుభ్రతా పరిపూర్తి - @2460*

            ఔను! వాళ్ళు అది సాధించి చూపారు! ఈ శుక్రవారం (10.06.2022) వేకువ 4.18 - 6.06 నడుమ గత మూడు వారాలుగా - అప్పుడప్పుడు ఒకోరోజు విరామమో - మరో చోటికి శ్రమదానం తరలింపో జరిగినా - మిగిలిన రోజుల్లో 2535 - 40 మంది చొప్పున - అందులో కొద్ది రోజులు స్థానికుల ప్రమేయం సైతం ఉండి, ఏ వెయ్యి పని గంటల కృషో జరిగి, కోమలా నగర్ వీధి - వీధినీ - అందలి డజను ఖాళీ జాగాలతో బాటు పరిశుభ్ర పరచి అందగించి చూపారు!

            నేటి వేకువ సమయమైతే వీరి శ్రమ వైభవం కనీసం 3 వీధుల్లో విస్తరించింది! ఒక నాటి నూనె మిల్లు, ఈనాటి గోడౌనుకు కుడి ఎడమల, వెనుక బజారుల్లో నెలకొన్న శ్రమదాన విశేషాలివి:

- మిల్లుకు ఉత్తరపు వీధిలోని రెండు ప్రక్కల పిచ్చి, ముళ్ల- అవాంఛిత మొక్కల తొలగింపు, డ్రైనులోని ప్లాస్టిక్ సంచుల- సీసాల ఏరివేత;

- నూనె మిల్లు వెనుక వీధిలో కూల్చేసిన ఇంటి సామాన్లూ, పాత కారూ అడ్డు నిలిచి, ట్రాక్టరు ప్రవేశించలేనందున, రెండు వీధుల్లో ఊడ్చిన, పీకిన, ప్రోగేసిన వ్యర్థాలను డిప్పల కెత్తి దూరంగా నిలిపిన ట్రాక్టరులో నింపడం.

- 5.40 తర్వాత కోమలా నగర్ వీధి పారిశుద్ధ్యపు పని మిగిలి పోతుందేమోనని అందరిలో పని వేగం పెరగడమూ, అది వేసవో వర్ష ఋతువో ఆ రెండిటి సంధికాలమో.... తెలీని ఉక్క పోతతో ప్రతి కార్యకర్త బట్టలు చెమటకు తడిసి నానిపోవడమూ!

            తక్కిన దృశ్యాలట్లా ఉంచి, నూనె మర దక్షిణపు మొండి బజారులో డజను మంది కార్యకర్తలు వ్యర్థాలను ఊడుస్తూ - ఖాళీ సీసాలను ఏరుతూ - కశ్మలాలను డిప్పల్లో కెత్తి, దూరంగా ఉన్న ట్రాక్టరు వద్దకు పరుగులతో చేరుస్తూ ట్రాక్టర్ లో నింపుతున్న నేటి శ్రమదానం పరాకాష్ట నొక్కమారు వాట్సాప్ మాధ్యమంలో చూడండి!

            నేటి పారిశుద్ధ్య కృషితో చూడ ముచ్చటగా ఉన్న మూడు చిన్న వీధుల్ని పరిశీలించండి! (ఈ విన్నపం స్వచ్చ -సుందర చల్లపల్లిలోని కోమలానగర్ లోని అదృష్టవంతులైన గ్రామస్తులకే!)

            తమ ఆత్మ సంతృప్తిదాయకమైన  గ్రామ బాధ్యత ముగించాక - కాఫీ పానీయ కాలక్షేపం  తరువాత - విజయవాడ మార్గంలో ప్రయాణికులతో సహా సదరు వార్డు నివాసులకు ఆలోచనాత్మకంగా ముమ్మారు స్వగ్రామ స్వచ్చ - శుభ్ర - సుందరోద్యమ నినాదాలను వినిపించినది - B.D.R. ప్రసాద్ గారు. ఈ స్వచ్చోద్యమ గతాన్ని - వర్తమానాన్ని - భవితవ్యాన్ని సమీక్షించి, సూచనలు చేసిన వారు డాక్టరు దాసరి రామకృష్ణ ప్రసాదు గారు.

            రేపటి వేకువ సైతం మనం మరొక మారు కలిసి, శుభ్ర పరచదగింది బెజవాడ బాటలోనే! పెట్రోలు బంకు 6 వ నంబరు కాలువ నడిమి భాగమే!

 

    సమర్పిస్తున్నాం ప్రణామం 139

ఎవ్వరెవరొ - ఎక్కడెక్కడొ పుట్టి పెరిగిన వ్యక్తులిందరు

ఇరుగు పొరుగూళ్లకూ చెందిన ఇందరిందరు కార్యకర్తలు

నీ సమున్నత చల్లపల్లికి నిత్య శ్రమదానాలు చేస్తే -

నీవు సైతం తరలి వస్తే నిండు మనసులతో ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ  సుందర చల్లపల్లి కార్యకర్త

  10.06.2022.