2461* వ రోజు....           11-Jun-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

30 మంది x 110 నిముషాల శ్రమ = 200 గజాల రహదారి పారిశుద్ధ్యం - @2461*

            స్వచ్చ - సుందర చల్లపల్లి నివాసులకూ, సుదీర్ఘ సమయ శ్రమదాతలకూ పై ఈక్వేషన్లు చప్పున అర్థమౌతాయి గాని, క్రొత్త వాళ్లకు కాస్త వివరణ అవసరమే! ఈ శనివారం వేకువ గంటా ఏభై నిముషాలు తమ ఊరి బాధ్యతలు నెరవేర్చింది 30 మంది కార్యకర్తలనీ, స్వచ్చ శుభ్ర సుందరీకృత ప్రాంతం బెజవాడ రహదారిలో పెట్రోలు బంకు, కోమలానగర్‌లో మూడో వీధి నడుమ ప్రాంతమనీ తాత్పర్యం!

            ఇంకా విడమరిచి చెప్పాలంటే - అక్కడి దుకాణదారులు గాని, వీధి అంగళ్ల చిరుతిళ్ల బడ్డీ కొట్ల - త్రోపుడు బళ్ల చిరు వ్యాపారులు గాని ససేమిరా పాల్గొనలేదు కోమలానగర్ లో ఒక గృహస్దుడు తప్ప!

            ఈ ఊళ్లో సగం మందికి పైగా స్వచ్చంద శ్రమదానం పిలుపు కెలాగూ స్పందించరు. కొందరేమో స్పందించి స్పందించీ అలసిపోయి విరమించారు. ఇక RTC బస్సు ప్రయాణికులో, సొంతవాహనచారులో అదాటుగా స్వచ్చ కార్యకర్తలు - అందులోనూ బాగా తెలిసిన డాక్టర్ల బడిపంతుళ్ల - గృహిణులు మోహాల్నీ, చేతుల్లో చీపుళ్లతో/ గొర్రులతోను, దుమ్ము - ధూళి దూసరిత వస్త్రాలతోనూ, అదీ ఈ మురుగు కాల్వల దగ్గర చూస్తే సన్నివేశం చటుక్కున బోధపడక పోవచ్చు!

            కాసేపటి తర్వాతే - తాపీగా - అవసరమైతే ఆరాతీసి గ్రహిస్తారు - వీళ్లందరివి వెర్రిమొర్రి ఓవర్ యాక్షన్లేవీ కాదనీ- తాము నమ్మిన ఆదర్మాన్ని- అంటే సామాజిక బాధ్యతను వీళ్లు సుదీర్ఘ కాలంగా ఆచరణలో ఋజువు చేస్తున్నారనీ!

ఐతే ఎప్పుడైనా మానవ స్వభావమేమంటే - ఎదుటివాళ్లకి సలహాలివ్వడం వేఱు, ఎదుటి వారి త్యాగాన్ని గుర్తించడం, మెచ్చడం వేఱు - స్వయంగా తాము దాన్ని చిత్తశుద్ధితో ఆచరించడం మాత్రం చాలా చాలా కష్టం! అది కష్టసాధ్యమే కాకుంటే ప్రతి రోజూ ఇలా శ్రమదానంలో పాల్గొనే చల్లపల్లి గ్రామీణులు వందల సంఖ్యలో ఉండాలి మరి!

            నేటి 30 మంది స్వచ్చ కార్యకర్తల కృషిదేముంది - అది యధా ప్రకారంగానే డ్రైను కుంటి నడకని సరిచేయడం, రోడ్డునూ మార్జిన్లనూ దుమ్ము ధూళి రహితం చేయడం, గోనె సంచీడు ప్లాస్టిక్ సంచుల్ని, సీసాల్నిమద్యం ఖాళీ గాజుసీసాల్ని ఏరడం, కొన్ని చెమటలు క్రక్కడం, మరికొన్ని సీసాల మంచి నీళ్లు త్రాగడం, గోకుడుపారల్తో ఇసుక- దుమ్ము చెక్కి రహదారిని విశాల పరచడం వగైరాలన్నీ షరా మామూలే!

            6.20కి కాఫీ ఆస్వాదన ముగిసి, తాతినేని నర్సరీ వేంకట రమణ వినిపించిన త్రివిధ గ్రామ  మెరుగుదల సంకల్ప నినాదాలను పునరుద్ఘాటించి, డాక్టర్. DRK గారు చేసిన నేటి శ్రమదాన సమీక్షను విని, నేటి తమ బాధ్యతను ముగించారు. మాటల్లో -  చేతల్లో మంచి - మర్యాద మప్పితాల మీద ఆసక్తికరమైన చర్చ కూడ నడిచింది!

                    చిరకాలంగా స్వచ్చ చల్లపల్లికి అంకితుడైన కోడూరు వేంకటేశ్వరరావు గారి క్రమం తప్పని 520/- విరాళం మనకోసం మనంమేనేజింగ్ ట్రస్టీకి కృతజ్ఞతాపూర్వకంగా అందినది..

            రేపటి - ఆదివారపు వేకువ సైతం మన బాధ్యతా నిర్వహణ ఈ  బెజవాడ రహదారిలోనే -అందుకుగాను, మనం కలుసుకోదగిన  చోటు విజయా కాన్వెంటు ఎదుటనే!

 

       సమర్పిస్తున్నాం ప్రణామం 140

ప్రజా భిమతమూ ముఖ్యమే అది సజావుగ కొనసాగనప్పుడు

ఏదిహితమో- అహిత మేదో ఎంతకూ గమనించనప్పుడు

ఇలా-ఇంత సుదీర్ఘ ఉద్యమ కలాపం అవసరం పడుతది

అంత సంయమనాన్ని చూపిన కార్యకర్తల కొక ప్రణామం!

- నల్లూరి రామారావు,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ  సుందర చల్లపల్లి కార్యకర్త

  11.06.2022.

చిరకాలంగా స్వచ్చ చల్లపల్లికి అంకితుడైన కోడూరు వేంకటేశ్వరరావు గారి క్రమం తప్పని 520/- విరాళం ‘మనకోసం మనం’ మేనేజింగ్ ట్రస్టీకి కృతజ్ఞతాపూర్వకంగా అందినది..