2462* వ రోజు.......           12-Jun-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

ఆదివారం నాటి గ్రామ వీధుల స్వచ్ఛ - సుందరీకరణ - @ 2462*

          12.6.2022 వ నాడు కూడ మళ్ళీ కోమలా నగర్ దగ్గరి విజయవాడ రహదారే- ముప్పై ముగ్గురి శ్రమ త్యాగంతో- ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లే రోడ్డు కూడ కొంత బాగయి పోయింది! ఐతే ఇవాళటి 2 గంటల వీధి పారిశుద్ధ్య కృషిలో కొట్టొచ్చినట్లు కనిపించేది మాత్రం చండ్ర వికాస కేంద్రం దగ్గరి దాదాపు ఎండిన మురుగు కాల్వ, బెత్తెడెత్తున ఇసుక దుమ్ము పేరుకుపోయిన తారు రోడ్డు శుభ్రపడి అదేదో క్రొత్త రోడ్డనిపించడం!

          బెజవాడ రహదారి భాగాన్ని 2 గజాల మేర వెడల్పు చేయడమూ, అందుకు గాను గోకుడు పారల్తో మట్టి పెచ్చుల్ని గోకి, చీపుళ్ళతో ఊడ్చి, మార్జిన్ల ఎత్తు పల్లాల్ని పారలతో సమం చేసి అదేదో గుడి ప్రాంగణమన్నంత నిష్టగా సుందరీకరించినది చల్లపల్లి బ్యూటిఫికేషన్ బ్యాచ్ కాక ఇంకెవరు?

          ఇదే చోట - మురుగు కాల్వ అంచు మీద - ఎప్పటిదో గాని బురద తుక్కు గుట్ట ఎండి చట్టైపోతే ఇద్దరు గునపాలవారు, ఇద్దరు పార పనివారు ఎలా శ్రమించి, చదును చేశారో గమనించారా?

          విజయా కాన్వెంట్ ప్రక్క వీధి కూడలి దగ్గర ఒక వేగ నిరోధకం దాన్నానుకొనే ఒక పాక/టెంట్ హోటల్ అంత వ్యాపారం జరిగే టిఫిన్ సెంటర్ దగ్గర ఇంతకాలంగా ఇంత పెద్ద గంట పడితే అరగుంటకు పైగా చెమటలు చిందేలా శ్రమించి, రాతి ముక్కలతో, మట్టితో పూడ్చి, చదును చేసి, వాహనాలకు రక్షణాత్మకంగా మార్చినది నలుగురు స్వచ్ఛ కార్యకర్తలు కాదూ?

          కాన్వెంటు ఎదుటి మురుగు గుంటే అందలి చిక్కుపడి పెరిగి, పెన వేసుకొన్న తిక్క ముళ్ళ ఎండు మొక్కలే, ప్లాస్టిక్ దరిద్రాలే ఖాళీ మద్యం సీసాలే ఈ ఉదయం నలుగురైదుగురి ఓర్పును పరీక్షించాయి!

          నలుగురు మహిళలూ, ఒక కాంపౌండరూ ఉవ్వెత్తున లేచి, తమను క్రమ్మేస్తున్న దుమ్ము మేఘం నడుమనే ఎంత శ్రద్ధగా ఊడిస్తే 6.10 తరువాత ఈ రహదార్లింత శుభ్రంగా మారాయి?

          ఒక పాత సినిమా పాటలో ఒక పాత్ర

          చెపితే చాలా ఉంది వింటే ఎంతో ఉంది

          ఇనుకో సెపుతారా ఎంకట సామి.....!అని పాడినట్లుగా  -

          ఆదివారం స్వచ్చంద శ్రమదాతల వీధి పారిశుద్ధ్య కృషిని గురించి కూడ ఎంతైనా వివరించవచ్చు! ఊరి మెరుగుదల పట్ల వాళ్ల అంకిత భావానికి జోహార్లు!

          6.10 దాక అలా సాగిన కృషి పిదప విజయా కాన్వెంట్ ఆవరణలో యధావిధిగా ఈ నాటి శ్రమదాన ముగింపు సమావేశం. ఇక అందులో ఒక పల్నాటి సింహం తన గ్రామ స్వచ్చ పరిశుభ్ర సౌందర్య సంపాదక నినాదాలు ముమ్మార్లు గర్జించగా,

          నేటి కార్యకర్తల కృషి పట్ల తన ఆరాధననూ 10-00 కు గ్రామ కేంద్రం దగ్గర మొదలయ్యే రోడ్ల గుంటల మరమ్మత్తునూ డాక్టరు DRK గారు వివరిస్తే, స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆస్థాన గాయకుడు గస్తీ గది దగ్గరి మజ్జిగ పంపకాన్ని పాటలుగా వినిపిస్తే,

          గోళ్ళ వేంకటరత్నం వర్షాగమనం కోసం చిటికెల - చప్పట్ల మంత్రాలు ప్రయోగించగా.... 6.50 తదుపరి నేటి శ్రమదాన వేడుక ముగిసెను!

          బుధవారం వేకువ మన పునర్దర్శనమూ, శ్రమదానమూ విజయా కాన్వెంటు దగ్గరే మొదలుకాగలదు!

 

    సమర్పిస్తున్నాం ప్రణామం 141

వేల నాళ్ళుగ చల్లపల్లిలొ విస్తరించిన ప్రయోగానికి

దేశమంతట స్వచ్ఛ సంస్కృతి తేజరిల్లిన ప్రయత్నానికి

తక్షణ స్పందనగ వ్రాసిన - ధన్యవాదం సమర్పించిన

శతక మిదిగో చదువ నేర్చిన సహృదయతకే నా ప్రణామం!

- నల్లూరి రామారావు,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  12.06.2022.