2463* వ రోజు.......           14-Jun-2022

ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

మంగళవారం నాటి రెస్క్యూ టీం సన్మానీయ కృషి – 2463*

          సోమ - మంగళవారాలనగా చల్లపల్లి గ్రామ స్వచ్చ - రక్షణ - సుందరీకరణపరంగా స్వచ్ఛ కార్యకర్తల్లోనే కొందరి ప్రత్యేక వారాలు! మిగిలిన వాళ్లతో కలిసి, ఇతర పనులు చేపడుతూనే - 5-6-7-8 మంది ఆ రెండు రోజుల తమ ప్రణాళికను అమలు చేస్తుంటారు.

          రోడ్ల గుంటలో - కరెంటు తీగల నందుకోబోతున్న చెట్ల కొమ్మలో, గాలి - దుమ్ము దెబ్బలకు విరిగి - ప్రయాణికులకు ఇబ్బంది కల్గించే – చల్లపల్లి పరిధిలోని ఏవైనా సరే - వాళ్ల దృష్టిలోనే పడతాయి - వాళ్లకే కనిపిస్తాయి! ఎవరి ప్రారబ్దాలు వాళ్లవి గదా!

          ఈ వేకువ వాళ్లని రా - రమ్మని పిలిచిన అలాంటి అవసరాలు రెండు – ఒకటి – గంగులవారిపాలెం రోడ్డులోనే డ్రైను ప్రక్క తాడి చెట్టు, రెండోది ఈ వీధి చివరలోనే - బైపాస్ రోడ్డు దగ్గర పెట్టిన మార్గ సూచికా ఫలకం!

          తాడిచెట్టేమో గతంలోనే చచ్చినది. అది ఎండలకు ఎండి, వానలకు బొగిలి - నేటి రేపో, రేపటి మాపో విరిగి - కరెంటు తీగల మీద పడనున్నదని రూఢి పరుచుకొని, దాన్ని చాకచక్యంగా ముక్కలు కోసిన పని మొదిటిది. రెండోది – మార్గ సూచిక/ హెచ్చరిక బోర్డు గాలికి ప్రక్కకు ఒరిగితే - దాన్ని సరిచేసిన పని!

          నేటి వేకువ గంటన్నరకు పైగా ఈ పనిలో శ్రమించినది ఐదుగురు కార్యకర్తలు! పని  విరమణ సమయంలో గ్రామ స్వచ్చ – శుభ్ర – సౌందర్య సాధనా సంకల్పాన్ని ముమ్మారు నినదించినది – వారిలోని నందేటి శ్రీనివాస్!

          రేపటి - అనగా బుధవారం వేకువ విస్తృత సంఖ్యలో కార్యకర్తలు కలిసి, శుభ్ర- సుందరీకరించుకోదగిన చోటు - విజయవాడ బాటలోని విజయా కాన్వెంటు పరిసర ప్రాంతాలే!

         సమర్పిస్తున్నాం ప్రణామం 142

బ్రతుకు బరువై - మనసు ఇరుకై – మానవత్వం జాడ కరువై

స్వార్ధ చింతన ప్రధమ సరుకై – సమాజ భావమె మృగ్యమై

డేకుతున్న సమాజ మందున దృఢంగా స్వచోద్యమంలో

నిలిచి గెలిచే వాళ్ళకే మా నిండు మనసులతో ప్రణామం!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  13.06.2022.