2464* వ రోజు.......           15-Jun-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

స్వచ్చోద్యమ సంతృప్తి పరంగా ఇది 2464* వ నాడు

 

          బుధవారం వేకువ 4.20 కే(15.06.2022) బెజవాడ రోడ్డు – విజయా కాన్వెంటు ప్రధాన ద్వారం దగ్గర స్వచ్చ కార్యకర్తల సంసిద్ధత! తదాదిగా గంటా 40 నిముషాలు- 25 మంది స్వయం ప్రేరణతో నిర్వహించిన వీధి శౌచం! అద్దాని వల్ల శుభ్ర- శోభితమైన ప్రభుత్వాసుపత్రి / నారాయణ రావు నగర ప్రథమ వీధి! కార్యకర్తలతో కలిసి శ్రమించని స్థానికులు!

- ఇదే స్థూలంగా నేటి శ్రమదాన సమాచారం!

 

          చల్లపల్లి స్వచ్చంద- సామూహిక శ్రమదానం తొలి ఆరు నెలల్లోనే కొద్ది మంది చింతనా పరులు-దార్శనికత ప్రదర్శించే వాళ్లు అనేవారు- “ స్వచ్చోద్యమ ప్రవర్తకుడైన ఈ డాక్టరు (DRK ప్రసాదు) గార్ని ఒక్క రోజు, ఒక్క నెల రావడాన్ని  మానేయమనండి- ఈ శ్రమదానం, ఈ కార్యకర్తలు వీధుల్లో పత్తా లేకుండా పోతారు...” అని !

 

          కాని, ఎందుకో గాని, వాళ్ళ అంచనాలు ఒక్కమారు కాదు – పెక్కు మార్లు తప్పి పోయాయి! ఇప్పటికి ఐదారేడుమార్లు ఆ వైద్యుడు దేశ- విదేశాల పర్యటనకో, సొంత పనులకో వెళ్లినా ఈ శ్రమదాన దృశ్యాలు ఆగనేలేదు! “ ఆ డాక్టరు గారి స్ఫూర్తి అంతగా పని చేస్తుందా” అనుకుందామంటే- ఆయనేమో “ ఏ రోజుకారోజు  ప్రతి ఒక్క కార్యకర్త శ్రమ విన్యాసమే నాకు తరగని స్ఫూర్తి” అంటుంటారు!

 

          మరి దీని భావమేమి తిరుమలేశ! అని ఆలోచిస్తే- అసలిక్కడున్నదీ-2464* రోజులుగా – 3 ½ /4 లక్షల పని గంటలుగా చల్లపల్లి బాధ్యతలు స్వీకరించినదీ కేవలం ఒక్క DRK కాదు – ప్రతి రోజు వేకువా 30/40/50 మంది DRK లు ఎండలు మండి పోతున్నా- మంచూ, చలీ వణికిస్తున్నా – వానలు ముంచుతున్నా- ఆరు గాలాలూ తాము నివశించే చల్లపల్లికి వాళ్ళ సేవలు ఆగనే లేదు!

 

          విజయా పాఠశాల ఎదుట- ముఖ్యంగా ఆసుపత్రి వీధి బారునా నేను ఈ వేకువ 45 నిముషాల పాటు ప్రతి కార్యకర్త పని దీక్షను గమనించాను! చీకట్లో- ముప్పావు గజం లోతు డ్రైనులో- మహిళా కార్యకర్తలు – సర్పంచమ్మతో సహా – దిగి, సీసాలు ఏరి, గడ్డి పీకి, డిప్పల కెత్తి శ్రమించడం ఎలా సాధ్యపడింది? ఎంత డబ్బిస్తే/ ఎన్ని బిరుదులిస్తే/ ఎంతగా పొగిడితే- ఈ పారిశుద్ధ్యం పనిని ఈ పాతిక మంది ఇంత శ్రద్ధగా ఎక్కడైనా చేస్తారా?? మరి అదే స్వచ్చ చల్లపల్లి ఉద్యమ ప్రత్యేకతంటే! ఇదొక స్వయం ప్రేరిత సామూహిక- సామాజిక- సద్వర్తన!

 

          6.15 పిదప – నేటి కృషి సమీక్షకు ముందుగా ఈ చల్లపల్లి గ్రామ స్వచ్చ-శుభ్ర –సౌందర్య సంకల్పాన్ని నినాదాలుగా ప్రకటించినదొక ఆరడుగుల ఆజాను బాహుడు – శివబాబు! బ్రహ్మ ముహూర్త కాలపు గ్రామ బాధ్యతా విశిష్టతను వివరించింది సైతం అతడే!

 

          రేపటి మన గ్రామ కర్తవ్యం దృష్ట్యా కలిసి, శ్రమించదగిన చోటు కూడ ఇదే బెజవాడ దారిలోని- ఇదే విజయా కాన్వెంటు దగ్గరే!   

         సమర్పిస్తున్నాం ప్రణామం 143

దేశాభిమానం నాకె కలదని వట్టి గొప్పలు చెప్పకుండా-

ఉపన్యసింపక- వాదులాడక- ప్రచారార్భటిలో మునుంగక

సొంత ఊరికి గట్టి మేల్ తలపెట్టి గెలిచిన కార్యకర్తలు

చల్లపల్లి స్వచ్చ సుందర జట్టుకే నా తొలి ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  15.06.2022.

 

విజయ కాన్వెంట్ వద్ద