2465* వ రోజు....           16-Jun-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

2465*వ పనిదినాన స్వచ్చోద్యమ విశేషాలు!

          విశేషాల్లో మొదటి సాధారణ రకం ఏమంటే - ఎప్పటిలాగే - నిన్నటి వలెనే – నిన్నటి చోటనే పాతికమంది స్వచ్చంద శ్రమదాతలు వేకువ సమయంలో –

1) విజయా కాన్వెంటు దక్షిణపు రోడ్డును సంస్కరించడమూ,

2) ఉత్తరంగా - ప్రభుత్వ పాఠశాల బైటా, కొంత లోపలా బాగుచేయడమూ!

అందుకు గాను గంటన్నర పాటు చెమటలు చిందించడమూ!

          ఇవి కాక ప్రత్యేకమైన కొన్ని విశేషాలేమంటే –

1) మూడు మురుగు కాల్వల్లో దిగి 12 మంది కార్యకర్తలు పుల్లా – పుడకా – ఎండాకుల - మద్యం, తదితర ప్లాస్టిక్ - గాజు సీసాల్ని ఎక్కడికక్కడ సమీకరించి, వింగడించి, డిప్పల్లో కెత్తి, ట్రాక్టర్ లో నింపడమూ,

2) ఇక అంతకన్నా పెద్ద విశేషం – ఒక రకంగా సాహసం – పిట్ట కొంచెమూ కూత ఘనమూ అన్నట్లు - ఆస్పత్రి నర్సు అమాంతం ట్రాక్టర్‌ పైకెక్కి, అంతమంది అందిస్తున్న చెత్త డిప్పల్ని, చెట్ల కొమ్మల్ని లాఘవంగా అందుకొని, ట్రక్కులో త్రొక్కి, క్రుక్కి సర్దడమే!

          ఆమె పేరు జ్యోతి – తన చురుకూ, చాకచక్యమూ, పని మెలకువా – అన్నీ బాగానే ఉన్నవి గాని, క్రింద నుండి చూస్తున్న నాకే భయమేసింది - ఎక్కడ పట్టు తప్పి బెసుకుతుందో అని!

          ఏ రోజుకారోజు – ఏదో ఒక సందర్భంలో - ఎవరో ఒకరి సాహసాన్ని ఇలా చూస్తూనే ఉన్నాను! ఈ కార్యకర్తల శ్రమ విన్యాసాల్ని చూస్తుంటే - శ్రీ శ్రీ వ్రాసి, తొలిసారి తెలుగు సినిమా పాటకు జాతీయ - అంతర్జాతీయ బహుమతి సాధించిన

          “తెలుగు వీర! లేవరా! దీక్ష బూని సాగరా!

          ఎవడు వాడు - ఎచటి వాడు - ఇటు వచ్చిన తెల్లవాడు -

          నీ కండ బలం, కొండ ఫలం - దోచుకొనే దొంగవాడు –

          తరిమి తరిమి కొట్టరా! తగిన శాస్తి చేయరా!.....

         అనే (అల్లూరి సీతారామ రాజు చిత్రంలో) పాట గుర్తు వచ్చి, దాన్ని కారకర్తలకు అన్వయిస్తూ...

          స్వచ్ఛ వీర! లేవరా! పార, పలుగు పట్టరా!

          ఎక్కడిదీ కాలుష్యం – ఎవరిది ఆ దౌర్బల్యం

          గ్రామస్తుల శ్వాస కోశ ధ్వంసన చణ శత్రుత్వం

          వాటి అంతు చూడరా! ఊరిని రక్షించరా!...”  

          అని క్రొత్తగా మళ్లీ ఇప్పుడు రాయాలని పిస్తుంది!

          హైస్కూలు ఎదుట, పింగళి వేంకయ్య విగ్రహం దగ్గరా, మౌనముద్రాంకితుడైన గాంధీ స్మృతివనం సమీపాన 10 మంది శ్రమించిన ప్రాంతమంతా 6.10 తరువాత ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో చూడండి!

          తనది కాని చల్లపల్లి కోసం 3 కిలోమీటర్లు ప్రయాణించి, శ్రమించే రైతు – మల్లంపాటి ప్రేమానందం నినదించిన గ్రామ స్వచ్చ - శుభ్ర – సౌందర్య సంకల్పంతో ఈ 6.30 కి నేటి పాతిక మంది కృషి పరి సమాప్తి!

          రేపటి వేకువ –

          1) వర్షం లేకుంటే బందరు రహదారిలోని 6 వ నంబరు కాల్వ దగ్గర గాని –

          2) ఉంటే – విజయవాడ బాటలోని ప్రభుత్వ పాఠశాల వద్ద గాని కలుసుకొందాం!

 

       సమర్పిస్తున్నాం ప్రణామం 144

జనాభాలే పెరిగిపోతూ – స్వచ్ఛ సంస్కృతి లుప్తమౌతూ

వసతులేమో మృగ్యమౌతూ - బ్రతుకు బరువై, తెరవు కరవై,

లక్ష్య హీనంగా చలించే లక్షలాది జనాల హితవుకు

ముందు కొచ్చిన - గెలిచి చూపిన ముఖ్యులందరికిదె ప్రణామం!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  16.06.2022.