1911 * వ రోజు....           04-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1911* వ నాటి దృశ్యాలు.

ఈ ఉదయం 4.02 కూ 6.15 కూ మధ్య సమయంలో నెలకొన్న బాధ్యతా నిర్వహణలో పాలుపంచుకొన్న స్వచ్చోద్యమ కారులు 26 మంది. వీరు కాక ట్రస్టు సంబంధిత కార్మికులు నలుగురు, నీళ్ల టాంకు వారిద్దరు కూడ వేర్వేరు విధులు నిర్వర్తించారు. నిన్నటి నిర్ణయానుసారం ముందుగా SBI దగ్గర పనిముట్ల వాహనాలతో సహా ఆగి, దారి శుభ్రతకై ప్రయత్నించి, అంతకుముందు పడిన కొద్దిపాటి వానతో తారు దారి తడిసి, ఊడ్వడం కుదరక అందరూ బైపాస్ మార్గంలో పాత ప్రభుత్వాసుపత్రి దగ్గర కొత్త విధులకు పూనుకొన్నారు.

 

20 మంది కార్యకర్తలు అశోక్ నగర్ రెండవ వరుస మొదలుకొని, కస్తూర్బాయి ఆసుపత్రి శిథిల భవనాల దాక- దారిని, దాని ఇరు ప్రక్కలను శుభ్ర పరిచారు. కలుపును గడ్డిని, తామంతకుముందు నాటి పెంచుతున్న రహదారి వనాల చెట్ల కొమ్మలను పీకుతూ-సవరిస్తూ, దుమ్ము ఇసుకలను ఊడ్చి, వ్యర్ధాలన్నిటిని ట్రాక్టరులో నింపి, చెత్త కేంద్రానికి చేర్చారు. ఇందులోనే సగం మంది సూరి డాక్టరు వీధిలో కొంత భాగాన్ని కూడ బాగు చేశారు.

 

నాగాయలంక మార్గంలోని ఉద్యానాలను మనకోసం మనం ట్రస్టు తోట పని వారు యథాప్రకారం శ్రమించి, అందంగా రూపొందిస్తూనే ఉన్నారు. ఇద్దరు నీళ్ల టాంకు తో వరుస క్రమంలో మొక్కలకు నీరందిస్తూనే ఉన్నారు.

 

స్వచ్చ-సుందరీకరణ సభ్యులు RTC ప్రాంగణంలోని గోడలను చల్లపల్లికి ముఖ్య సంకేతమైన- ప్రాచీనమైన కోట బొమ్మతో అలంకరించే పనిలో మునిగి 7 గంటల వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.....

 

- “ఏమిటి ఈ సుదీర్ఘ వర్ణనలు “ అని విసుగు చెందకండి. స్వచ్చోద్యమ చల్లపల్లి దైనందిన కథాకథనాలు ఇలానే ఉంటాయి మరి. 1911 రోజుల సుదీర్ఘ- నిస్వార్థ-శ్రమైక జీవన సౌందర్య వర్ణన- ఇలా కాక ఇంకెలా ఉంటుంది?

 

6.40 కు నేటి స్వచ్చంద కృషి సమీక్షా సమావేశంలో పైడిపాముల కృష్ణ కుమారి – మధ్య మధ్యలో తన స్వచ్చ గ్రామహిత కృషికి గైరు హాజరుకు వివరణ పూర్వకంగా ముమ్మారు ప్రకటించిన స్వచ్చ-సుందర సంకల్ప నినాదాలతో మన నేటి శ్రమదాన వేడుక ముగిసింది.

 

ఐదేళ్ల నాటి తన శ్రీమతి మెండు నాగ చంద్ర గారి విషాద స్మృతి చిహ్నంగా మెండు శ్రీనివాస్ “ మనకోసం మనం” ట్రస్టుకు సమర్పించిన 1000/- విరాళం నేటి ఒక విశేషం.

 

రేపటి మన గ్రామ మెరుగుదల ప్రయత్నం కూడ కస్తూర్బాయి స్మారక పాత ప్రభుత్వాసుపత్రి దగ్గర ప్రారంభిద్దాం!

 

       గజ గజ చలి సమయంలో....

ఈ గజ గజ చలి వేకువ ఇంతమంది నవ చేతన

ఈ బ్రహ్మ ముహూర్తమందె ఎందుకింత తపన

మాతృభూమి ఋణ విముక్తి తాత్వికత జ్వలించెనా!

స్వార్ధానికి రూపు చెదరి త్యాగం వికసించెనా!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 04/02/2020

చల్లపల్లి.