2470* వ రోజు.......           22-Jun-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

మరొక మారు బెజవాడ రహదారి పారిశుద్ధ్యం - @2470*

            బుధవారం – (22-6-22) నాటి శుభోదయాన గూడ అదే చల్లని వేకువలో - 4.20 నుండి 6.05 దాక పాతిక మంది చేసిన వీధి శుభ్రతా కృషి! వాతావరణంలో మాత్రం వేడి తగ్గింది. స్వచ్ఛ కార్యకర్తలీ రోజు కశ్మలాల మీద కక్ష తీర్చుకొని సంతసించిన చోటు జిల్లా పరిషత్ ప్రభుత్వోన్నత పాఠశాల పరిసరాలు. ముఖ్యంగా బడి దగ్గర్నుండి 6 వ నంబరు పంట కాలువ పర్యంతమూ రహదారి, దాని తూర్పు దిక్కు మురుగు కాలువ!

            ఐతే ఈ పాతిక మంది స్వచ్చ సైనికుల 100 నిముషాలకు పైగా గ్రామ స్వచ్చ శుభ్ర - సుందరోద్యమం వారి గ్రహచారమో, ప్రారబ్ధమో, జన్మ - జన్మేతర ఋణమో గాని, ఈ ఊరి 25 వేల మందికి గాను పాతిక మందిదే ఆ అదృష్టం! మళ్లీ అందులో – హైదరాబాదుకు చెందిన మధుఅనే ఔత్సాహికురాలొకరు!

            చల్లపల్లి స్వచ్చోద్యమకారులొకరిద్దరి ప్రమేయంతోనూ సహకారంతోనూ జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఇటీవల - వాళ్లకు తోచిన పద్ధతిలో పట్టణ మెరుగుదల కృషి జరుగుతున్నట్లు తెలిసింది! ఎక్కడైతేనేం - ఎలాగైతేనేం - ప్రోద్భలమెవరిదైతేనేం - రాష్ట్రమంతటా దేశ వ్యాప్తంగా ఎగరవలసింది స్వచ్ఛ - సుందర జయపతాకం! మెరుగు పడదగింది సమస్త ప్రజాహ్లాదం, ఆరోగ్యం!

            22-6-22 - (2470*) వ నాటి చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానం యధాపూర్వం -  గ్రామస్తులకు సదుద్దేశ్యం - కార్యకర్తలకు సంతృప్తిదాయకం - ఎవరైనా సామాజిక పరిశీలకులుంటే గనుక వారికి ఆశ్చర్యకరం! పైపైన పలుమార్లు చూసే వాళ్లకిదొక రొడ్డ కొట్టుడనో - వ్యసనమనో - చర్విత చర్వణమనో - అనిపిస్తే అనిపించవచ్చు గాక! లోతుగా అధ్యయనం చేస్తే మాత్రం ఇదొక సమున్నతాశయమనీ, ఎప్పటికప్పుడు సృజనాత్మకమనీ, శ్రమైక జీవన సుమనోజ్ఞమనీ ఒప్పుకోవలసిన సంగతే!

            ఈ 150 గజాల రహదారి, లోతైన మురుగు కాలువ, కొన్ని తుప్పు పట్టి, కాలం చెల్లిన ట్రీ గార్డులూ, చెత్త తొలగి, ప్లాస్టిక్ తుక్కులు కనిపించని, మద్యం సీసాలు లేని, మొక్కల పాదులు తీర్చిదిద్దబడిన రమణీయ దృశ్యం చాలు - చల్లపల్లి శ్రమదానోద్యమ సాఫల్యతకు!

            స్వచ్ఛ కార్యకర్త ముత్యాల లక్ష్మి గారి కుమారుడు ముత్యాల నాగబాబు, వారి భార్య జ్యోతి గార్ల కుమారుని మొదటి జన్మదినోత్సవం సందర్భంగా 5,000/- రూపాయలను మనకోసం మనంట్రస్టుకు విరాళం అందించారు.

            కార్యక్రమ సమీక్షా సమయంలో స్వచ్ఛ కార్యకర్తలందరికీ

1) ముత్యాల చంటి - లక్ష్మి గార్ల,

2) కస్తూరి విజయ్ దంపతుల గృహ ప్రవేశ ఆహ్వానాలందినవి!

            రేపటి మన గ్రామ బాధ్యతల కోసం మరొక మారు జిల్లా పరిషత్ హైస్కూల్ దగ్గరే కలుసుకొందాం!

 

     సమర్పిస్తున్నాం ప్రణామం 149

నా దేశపు - నా గ్రామపు నలు మూలల కశ్మలాలు

అచ్చోసిన అంబోతులు పిచ్చెక్కిన మద గజాలు

ప్రజా రోగ్య విఘాతాలు - భవితకు పెను శాపాలను

ఎదుర్కొనే సాహసులకు ఇవిగో నా ప్రణామాలు!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  22.06.2022.

స్వచ్ఛ కార్యకర్త ముత్యాల లక్ష్మి గారి కుమారుడు ముత్యాల నాగబాబు, వారి భార్య జ్యోతి గార్ల కుమారుని మొదటి జన్మదినోత్సవం సందర్భంగా 5,000/- రూపాయలను ‘మనకోసం మనం’ ట్రస్టుకు విరాళం అందించారు.
కార్యక్రమ సమీక్షా సమయంలో స్వచ్ఛ కార్యకర్తలందరికీ 1) ముత్యాల చంటి - లక్ష్మి గార్ల, 2) కస్తూరి విజయ్ దంపతుల గృహ ప్రవేశ ఆహ్వానాలందినవి!