2475* వ రోజు....           28-Jun-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

గ్రామ హరిత సంపదను పెంపొందిస్తూ 2475* వ నాటి కృషి!

          మంగళవారం (28-6-22) మధ్యాహ్నం 3.00 5.00 నడుమ ఆ కృషి జరిగింది. స్థలం బండ్రేవు కోడు మురుగు కాలువ ఉత్తర, తూర్పు గట్టులు – గంగులవారి పాలెం వీధి తొలి మలుపు మొదలు గౌడ వీధి వంతెన దాక - సుమారొక కిలోమీటరు బారునా!

          పాల్గొన్న కృషీవలురు 24 మంది! స్వచ్చ కార్యకర్తలతో బాటు పంచాయతీ సర్పంచి కృష్ణకుమారి, కార్య నిర్వహణాధికారి సుకుమార్, మండలాభివృద్ధి ఉన్నతాధికారి బాధ్యులు గంజి శ్రీనివాసరావు గారు, ఇంకొందరు గ్రామ ప్రముఖులు కూడ ఉన్నారు!

          సులభంగా, సుకరంగానే పూర్తి కాదగిన పనే ఇది. పదేసి గజాలకొక గోయి త్రవ్వడమూ, వరుస తప్పుకుండా గట్టు పొడవునా ఒక క్రమ పద్ధతిలో - 10 వేపలూ, 10 నేరేడులూ, 10 తురాయి మొక్కలూ నాటుతుండం స్వచ్ఛ కార్యకర్తల రోజు వారీ  శ్రమతో పోలిస్తే ఇదేమంత బరువు పని కాదు గాని, కాలువ త్రవ్విన మట్టంతా ఎగుడుదిగుడుగా ఉండడంతోను, రెండు రోజుల వానలకు బురదగా మారడంతోను పనిలో కొంత అలస్యం జరిగింది.

          మరి మొక్కలు నాటేందుకు ఇదే గదా అదను! బురద అనుకొంటే పదును తప్పవచ్చు! ఏడెనిమిదేళ్ళుగా స్వచ్చ సైనికులు ఈ ఊరిలోను, శ్మశానాలు, బస్ ప్రాంగణాలు, ఊరి బైట 7 రహదారుల్లోనూ ఎన్ని వేల చెట్లు, పూల మొక్కలు నాటారో - వాటిలో ప్రకృతి వైపరీత్యం వల్ల, మానవ వైపరీత్యం వల్ల - అంటే అపోహలు, బాధ్యతారాహిత్యాలతో ఎన్ని నష్టమైపోయినవో - లెక్కలు తీస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది!

          ఈ నాటి గ్రామ హరిత – సౌందర్య సంకల్ప నినాదాలను స్పష్టంగా వినిపించింది గౌరుశెట్టి నరసింహ నామధేయుడు! కార్యకర్తల క్రమం తప్పని కృషిని మెచ్చినదీ, ఆశీర్వదించినదీ గంజి శ్రీనివాస్ గారు! ఇప్పుడు నాటిన – రేపు నాటబోతున్న మొక్కల సంరక్షణా కర్తవ్యాన్ని కొంత మోయవలసింది స్థానిక అడవి పొలం రైతులు, గంగులవారిపాలెం వీధి నివాసులు! “వృక్షో రక్షతి రక్షితఃఅనే సూక్తిని సార్థకం చేయవలసినది చల్లపల్లి ప్రజలందరూ!

          రేపటి వేకువ మన ఊరి మెరుగుదల పని చోటు విజయవాడ బాటలోని గాంధీ స్మృతివనం!

      సమర్పిస్తున్నాం ప్రణామం – 54

వేల దినముల స్వచ్చ రీతుల కవితలల్లే సదవకాశం

శ్రమ వినోదం నడుమ బ్రతికే సావకాశం కలగజేసిన

సొంత ఊరికి మేలొనర్చిన – ఇంత కాలం త్రోవ చూపిన

స్వచ్చ సుందర కార్యకర్తల సంతతికి వినమిత ప్రణామం!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  28.06.2022.