2476* వ రోజు.......           02-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

కొంత ఎడబాటు తర్వాత 2476* వ నాటి స్వచ్చ - సుందర చర్యలు.

          జులై మాసం – 2 వ తేదీ - ఆషాఢ ద్వితీయ దినం – వేకువ 4.22 సమయాన వీధి పారిశుద్ధ్యం డజను మందితో మొదలై, ఇంకో డజను మంది చేరికతో 6.00 దాటే దాక – (వారిలో ఐదుగురైతే సుందరీకరణం తప్ప సమయపాలన పట్టని వాళ్లు!) కొనసాగింది! నేటి బాగుపడిన చోటులు కూడ మౌనముద్రాంకిత గాంధీ స్మృతి వనం దగ్గరివే! – కోమలానగర్ లో చిన్నపాటి వీధీ, విజయ వాటికారహదారీ!

          స్వచ్చోద్యమ తత్త్వం బోధపడని కొందరి కనిపించ వచ్చు –“2476 రోజులుగా చల్లపల్లిలోనూ, వారం పది రోజులుగా ఈ 1 కిలోమీటరు రోడ్డు దరిదాపుల్లోనూ – ఓ పాతిక ముప్పై మంది ఏం ఊడ్చి, ఏ వ్యర్ధాల్ని ప్రోగేసి, ఏ మురుగు కాల్వల్ని ముందుకు నడిపి, ఏ చెట్ల కొమ్మ - రెమ్మలకి మర్యాదలు మప్పి, ఏ పంటకాల్వను మళ్ళీ మళ్ళీ శుభ్రపరిచి, ఏ కాస్త ఖాళీ కనిపించినా పూల మొక్కల్ని నాటి, పదే పదే సుందరీకరించడం కాస్త అతిగా ఉన్నది....అని!

          ఐతే - జరుగుతున్నది పాతిక వేల జనాభా ఉన్న, వందలాది రోడ్లున్న, ఆ రోడ్ల మార్జిన్లను కబ్జా చేసే తెలివైన వ్యక్తులున్న, పదేళ్ల క్రితం దాక పచ్చదనం లోపించిన, ఆహ్లాదం కరవైన, ఊరి ఉమ్మడి ప్రయోజనం దృష్టిలోపించిన, ఒకానొక పెద్ద గ్రామాభ్యుదయ సర్వతోముఖ శ్రమదానం అనేది గుర్తుంచుకోవాలి!

          8 - 9 ఏళ్ల క్రిందటి నిరంతరంగా మలవిసర్జనా వీధులు, జంతు కళేబరాల - డ్రైన్ల కంపులు, నరకాన్ని బ్రతికుండగానే చూపించిన శ్మశానాలు, వందల కొద్దీ రోడ్ల గుంటలు, కళావిహీనమైన పార్కులు, బస్ ప్రాంగణాలు, కాలువ గట్లు, గుంటలు, కర్మల భవనాలు ఇప్పుడెంతగా బాగుపడినవో, ఎందుకని ఇన్నేళ్ల తర్వాత కూడ గ్రామస్తులు విశేష సంఖ్యలో ఈ స్వచ్చోద్యమంలో వచ్చి చేరడం లేదో ఆలోచించాలి! స్వచ్చ – శుభ్ర - సుందరీకర్తలేమో 30 40 - 50 మందా? ఒక చారిత్రక గ్రామ పౌరులేమో పాతికవేల మందా?

          ఈ నాటి 24 మంది శ్రమదానాన్ని ప్రధానంగా రెండు చోట్లు పంచుకొన్నాయి – ఒకటోది నాళం వాసు గారి పొలం ప్రక్క రహదారి మార్జిను, రెండోది విజయా కాన్వెంటు ఎదుటి చిరు వీధి. సుందరీకర్తల పని గురించి చెప్పేదేముంది? ఒక వీధినో – మొండి గోడనో – ఎండు చెట్టునో - వాళ్లకప్పజెప్పితే అవి రోజురోజుకూ మెరుగులు దిద్దుకొని, ఊహించని అందాల నందిపుచ్చుకొని, ఆశ్చర్యకరంగా పరిణమిస్తాయి!

          15 మంది కత్తుల - దంతెల – చీపుళ్ల కఠిన శ్రమ ఫలితంగా ట్రాక్టర్ మెకానిక్ షెడ్డు ఉన్న - రెండు ప్రక్కలా ముళ్ల మొక్కలు, తీగలు అల్లుకొన్న - ప్లాస్టిక్ సంచుల - సీసాల ఉనికి చాటుతున్న - అక్కడి 20 కుటుంబాలు పట్టించుకోని - ఒక చిన్న వీధి 100 నిముషాల తర్వాత నిష్కల్మషమై పోయింది! వీధి చిన్నదే - వచ్చిన వ్యర్థాలు మాత్రం ట్రాక్టరుకు సరిపడా!

          నిమిలీకృత నేత్ర మౌని - జాతిపిత సాక్షిగా జరిగిన సమీక్షా సభలో ముందుగా కత్తి వీరుడు పసుపులేటి సత్యం ఊరి మెరుగుదల సంకల్ప నినాదాలూ, పిదప నందేటి వాని “బుల్లెట్టు బండి పాటా ప్రశంసార్హములైపోయాయి! నేడు నాటవలసిన 10 మొక్కలు మరో రోజుకు వాయిదా పడ్డాయి!

          రేపటి వేకువ సమయపు శ్రమదాన బాధ్యత కోసం మనం కలువదగిన చోటు కూడ బెజవాడ దారిలోని గాంధీ విగ్రహం దగ్గరే!

         

      సమర్పిస్తున్నాం ప్రణామం – 55

వేల నాళ్లుగ చల్లపల్లిలొ విస్తరించిన ప్రయోగానికి

దేశమంతట స్వచ్ఛ సంస్కృతి తేజరిల్లిన ప్రయత్నానికి

తక్షణ స్పందనగ వ్రాసిన - ధన్యవాదం సమర్పించిన

శతక మిదిగో – చదువ నేర్చిన సహృదయతకే నా ప్రణామం!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  02.07.2022.