2477* వ రోజు....           05-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడదగునా?

ఊరికి ఉపకారులు- గ్రామ రక్షక ముఠా వారి నేటి ప్రయత్నాలు - @2477*

            స్వచ్చ సైనికుల వీధి పరిరక్షణ కృషి ఖాతాలో మరొక శుభోదయం! ఈ మంగళ వారం (05.07.2022) నాటి వారి బాధ్యతలు నెరవేరిన ఊరి భాగాలు విజయవాడ మార్గంలోని శ్రీమంతు క్లబ్బు ఉత్తర వీధి, NTR పార్కు దగ్గరి మంచి నీళ్ల తయారీ కేంద్రం. పని సమయం వేకువ జామున 100 నిముషాలు, పని మంతులు 5+1 మంది!

            ఈ చల్లపల్లి మహా గ్రామంలో ఏ పౌరులైనా బాధ్యతలు నెరవేర్చాలే గాని, ఆరుగురు  రెస్క్యూ టీమేమిటి, 60 మంది స్వచ్చ కార్యకర్తలేమిటి, ప్రతి రోజూ కనీసం 100 మంది పూనుకొంటే గాని నెరవేరని స్వచ్చ సుందరీకరణ బాధ్యతలుంటాయి! ఇన్ని వేల రోజులుగా- ఈ 100-150 కార్యకర్తల కుటుంబం నుండి ప్రతి వేకువా 30-40-50 మంది పాల్గొనే అదృష్టం మాత్రమే ఈ ఊరికి దక్కింది! వేల లక్షల ఊళ్ళతో పోల్చినపుడు మాత్రం - ఇప్పటికిదే గొప్ప!

            లక్షలాది పని గంటల శ్రమతో ఈ కొద్ది మంది బాధ్యులు తమ ఊరిని ఈ మాత్రంగానైనా తీర్చిదిద్దుతున్నారంటే అందుకు వాళ్లని ఇంద్రుళ్ళూ చంద్రుళ్ళూ అని కూడ కీర్తించలేం! తమ ముంగిళ్లలో జరిగే స్వచ్చోద్యమాన్ని ఏమైనా సరే- పట్టించుకోని వాళ్లని తప్పు పట్టనూ లేం! ఒకే ఊరికి చెందినారెండు రకాల మనుషుల్లో రెండు విధాల జన్యువులు (జీన్స్) ఉంటాయని ఎలా చెప్పగలం ?

            గ్రామ సామాజికుల్లో సహజంగా ఉండదగిన పరస్పర సహకారమూ, తనతో బాటు ఇరుగుపొరుగు వారి సంక్షేమం కూడ పట్టించుకొనే తత్త్వమూ- ఇవి మాత్రమే ఈ స్వచ్చ సైనికుల ప్రత్యేక లక్షణాలు!

            అంచేతనే నేటి ఐదారుగురు కార్యకర్తలు గంటన్నరకు పైగా శ్రమించారు; శ్రీమంతు క్లబ్బు ప్రక్క రోడ్డు లో సిమెంటు స్తంభాలు పాతడానికి కావలసిన ఇసుకను, స్తంభాలనూ అక్కడికి చేర్చి, సిద్ధం చేశారు;

            నడకుదురు రోడ్డు దగ్గర సుజల కేంద్రం, ఎదుట నిత్యమూ రద్దీగా ఉండే వినిమయదారుల సౌకర్యార్థం-అక్కడి గుంటను ఎక్కడి నుండో సేకరించి పెట్టుకున్న మట్టి- రాతి ముక్కల్తో నింపి, సర్దడం వాట్సాప్ వీడియో లో గమనించండి !

            ఈ వేళకి తామనుకొన్న పనులు పూర్తి చేసిన సంతృప్తితో 6.15 సమయంలో అక్కడి జనం దృష్టినాకర్షిస్తూ –BSNL – గౌరుశెట్టి నరసింహా రావు ప్రవచించిన గ్రామ సంక్షేమ సంకల్ప నినాదాలను ప్రతిధ్వనించారు!

            రేపటి వేకువ మన పౌర బాధ్యతల కోసం విజయవాడ బాటలోని  గాంధీ విగ్రహం దగ్గరే మన కలయిక!

      సమర్పిస్తున్నాం ప్రణామం 56

గ్రామ వీధులన్నిటిలో కార్యకర్త శ్రమ నర్తన!

ట్రస్టు కార్మికుల కృషితో హరిత వర్ణ విజృంభణ!

సామాజిక సామూహిక స్వచ్చ శుభ్ర పరివర్తన!

స్వచ్చోద్యమ పరిణతికే సమర్పించు అభివందన!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  05.07.2022.