2478* వ రోజు.......           06-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడదగునా?

బుధవారం (6-7-22) నాటి శ్రమదాన సన్నివేశాలు - @2478*

            రెండు నాళ్ల అనివార్య విరామం తరువాత నేటి వేకువ 4.20 కే ప్రారంభమై, సుమారు 7.00 దాక పొడిగింపబడిన 31+7 మంది దర్శనీయ ఆదర్శనీయ అభివందనీయ - వేల, లక్షల గ్రామాలకు అనుసరణీయ సొంత ఊరి మెరుగుదల కృషి అది! ఊరి ఉత్తర భాగంలో సందర్శకులకు మౌన సందేశమిస్తున్న మానవ జాతిపిత విగ్రహ పరిసరాలే వారి శ్రమదాన సాక్ష్యాలు!

            ప్రధానంగా 3 చోట్లు కార్యకర్తల శ్రమతో శుభ్ర సుందరీకృతమయ్యాయి! విగ్రహం పడమర భాగం, దక్షిణపు పచ్చిక బయలు, వెనుక వైపున చిట్టడవిగా మారిన ఖాళీ స్థలం ఇవే ఇంత చల్లని వేళలోనూ కార్యకర్తల చెమటలను చవి చూశాయి!

            నేను కాక - ఇంకెవరైనా వ్రాయవలసి వస్తే - బహుశా ఇంతకన్న తేలిక మాటల్లో - ఆలంకారికంగా కాక సూటిగా అలవోకగా - టూకీగా తేల్చి ఉందురు! వాళ్లైనా నాలాగా ఈ స్వచ్చ కర్మిష్టుల కత్తి విన్యాసాలనీ, దంతెల రాపిడులనీ, దగ్గరగా ఒళ్లు గగుర్పొడిచేలా చూస్తే, ఈ శ్రమదాన పవిత్రతను మననం చేసుకొంటే ఏ కల్పనలూ లేని యదార్థాలే ఐనా ఏ కాస్తో వర్ణనాత్మకంగా వ్రాయకపోరు!

             పాతిక వేల మంది పౌరుల బాధ్యతల్ని మోస్తున్న స్వార్ధం వాసన లేని స్వచ్చ సైనికుల పట్ల ఈ పాటి చిన్న సహానుభూతి ఉండటం భావుకులకు న్యాయమే!

            ఐదారు రోజులుగా పడుతున్న వానలకు చిత్తడిగా మారిన చోట - ముసురు వల్ల ముప్పేటగా పిచ్చి - ముళ్ల తీగలు పెనవేసుకుపోయిన కొన్నిటిని ఓర్పుగా, నేర్పుగా నరికి దంతెలతో లాగి, పోగులు చేసి, డిప్పలకెత్తి ట్రాక్టరులో నింపి చెత్త కేంద్రానికి తరలించడం కష్టమైన పనికాదంటారా?

            ఎండల ధాటికి సగం ఎండిన పచ్చిక నడుమ పెరిగిన కలుపును 15 మంది శ్రమదాతలు తమ ఇంటి పెరడు కన్నా శ్రద్ధగా, తొలగిస్తున్న వైనం ఎంతగా భావుక హృదయానందకర మంటారు?

            ఇక కొందరు కార్యకర్తలైతే, స్మృతి వనం నడవాకు రెండు ప్రక్కల ఉన్న కంచె తీగల కల్లుకొన్న - ఎండిన పిచ్చి తీగల్ని సైతం తొలగిస్తూ - ఏపుగా పెరిగే గడ్డిని పెరుకుతూ శ్రమించడం గమనించండి!

            పడమటి వైపు పెద్ద బరువైన తుప్పు పట్టిన ఇనుప గేటును తెరిచే ప్రయత్నంలో ఒక చురుకైన కార్యకర్త కాలిపైన అది విరిగి పడడం, కాలు ఉబ్బడం, 10 - 15 నిముషాల విశ్రాంతి తరువాత అతగాడు మళ్ళీ శ్రమదానానికి పూనుకోవడం మరొక విశేషం!

            అన్నిటికన్న పెద్ద విశేషం - నడకుదురు గ్రామ మూలాలు గల, ప్రస్తుతం బజవాడ బెంజి సర్కిల్ దగ్గర భర్త శ్రీకాంత్ గారితో కలిసి డయాబెటాలజీ ఆస్పత్రి నిర్వహిస్తున్న ఒక డాక్టరమ్మ డా. సునీత, B.B.A చదువుతున్న ఆమె కుమార్తె లక్లీన్, మరో నలుగురు చల్లపల్లి స్వచ్చోద్యమాన్నొక పరిశోధక విషయంగా చిత్రీకరించడం! చల్లపల్లిలో ఇంత సుదీర్ఘకాల శ్రమదానోద్యమ ప్రస్థానం అజ్ఞాతంగా ఉండరాదనీ, బైటి ప్రపంచానికీ, వేలాది ఊళ్ళకీ మరింత ప్రేరకం కావాలనే సదుద్దేశం వాళ్లది!

            ఊరిలో స్వచ్చంద శ్రమ సమయ దాతలు చెక్కిన శ్మశానం వంటి మరికొన్ని హరిత శిల్పాలనూ, జిల్లాలకూ, రాష్ట్రానికీ ఆదర్శప్రాయమైన గంగులవారిపాలెం వీధి ముగ్ధ మనోహర దృశ్యాలనూ చిత్రీకరించడం కోసం ఈ ఐదారుగురి బృందం మరి కొన్ని గంటలు చల్లపల్లిలోనే ఉండబోతున్నది!

            శ్రమదానానంతరం నందేటి శ్రీను నిర్దేశంతో స్వచ్ఛ శుభ్ర సౌందర్య నినాదాలూ, ఉత్తేజకర గానాలు, మాలెంపాటి వాని 2,000/- , కోడూరు వాని 520/- స్వచ్చోద్యమ ఆర్థిక సహకారాలు, వగైరాలు!

            రేపటి మన శ్రమానందం కూడా ఇదే చోట - విజయవాడ బాటలోనే ఉండగలదు!

          ఈ ఊరుకు లోటేమిటి?

స్వచ్చోద్యమ చల్లపల్లి కసలు లోటు ఏముందని!

తొలుత జనుల స్వచ్ఛ స్పృహ దోబూ చనిపిస్తున్నా

ప్రభుతల ఆర్థిక సాయం అంతంతగ ఉంటున్నా

స్వయం కృషితొ స్వచ్ఛ శుభ్ర - సుందరమై పోతున్నది!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  06.07.2022.