2481* వ రోజు....           11-Jul-2022

 

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

చల్లపల్లి గ్రామ రక్షక దళం 2481*వ నాటి వీధి భద్రతా చర్యలు.

            సోమవారం (11.07.2022) వేకువ సైతం మళ్ళీ అదే వరస - అదే ప్రయత్నం! బెజవాడ - బైపాస్ దారుల కూడలి దగ్గర - బికనీర్ హోటల్ వద్ద ప్రారంభమై, గంటన్నరకు పైగా ఐదారుగురు కార్యకర్తల పూనికతో నారాయణరావు నగర్ మొదటి వీధి దాక, అటు సుజల కేంద్రం దాకా వారి శ్రమదానానికి సాక్ష్యమై నిలిచినవి.

            గత ఏడెనిమిదేళ్లుగా ఇటు పాతిక వేల జనాభా గల చల్లపల్లేమో సేవలందుకోవడానికీ, పాతిక - ముప్పై - నలభై మంది స్వచ్చ కార్యకర్తలేమో తమ బాధ్యతా పరి పూర్తికీ - వాళ్లకు తెలిసో - తెలీకో అలవాటు పడిపోయారు! అది వానలైనా - ఎండలైనా - మంచులైనా! మరి బద్ధకమూ, కర్తవ్యశూన్యతా, క్రియాశూన్యతా అలవాటైనంత తేలికగా సామాజిక చైతన్యమూ, త్యాగమూ, ఆచరణమూ అలవడవు గదా!

ఈ నాటి పని వివరాల్లోకి పోతే -

1. విజయవాడ రహదారిలో నడకుదురు రోడ్డు దగ్గరలో మళ్లీ ఒక పెద్ద గుంట మరొక మారు పూడింది. పూడ్చడంలో అక్కడి వందలాది మందిలో ఎవరైనా అక్కర కొచ్చారాఅని మాత్రం అడక్కండి! ఈ రెస్క్యూ టీం పూడ్చక పోతే ఎంత ఇబ్బందైనా పడుతూ ఆ గుంటల్లో దిగి ఎక్కుతూ అలవాటు పడతారు గాని, వాళ్ల నుండి తగిన సహకారం దొరకదు!

2. నారాయణరావు నగర్ ప్రథమ వీధి దగ్గర బైపాస్ రోడ్డులోనూ అలాంటిదే ఇంకొక గుంట కూడ కార్యకర్తలు పూడ్చారు!

            ఇంతకీ ఈ గుంటలు పూడ్చిన ట్రక్కు రాతి - మట్టి - రద్దు ఎక్కడిది? గతంలో మనకోసం మనంట్రస్టు ఎంతో శ్రమతో, వ్యయంతో బైపాస్ వీధి ఉద్యానాలను ఏర్పరిస్తే - మురుగు కాల్వను JCB లతో త్రవ్వించేందుకు కంచెల తొలగింపుతో పీకేసిన స్తంభాలకంటుకొన్న కాంక్రీటును కార్యకర్తలు తొలగించి, భద్రపరచి, తెచ్చిన రద్దు అది!

            ఈ గ్రామ భద్రతా దళం కృషి సరే - బండ్రేవు కోడు మురుగు కాల్వ గట్లను ఒంటి చేత్తో సుందరీకరిస్తున్న ఒక క్రొత్త ట్రస్టు ఉద్యోగినీ, 6 వ నంబరు కాల్వ గట్ల మీద, రహదారి బంగళా దగ్గరా మొక్కలు నాటుతున్న కొందరు ట్రస్టు కార్మిక సోదరుల్నీ వాట్సప్ చిత్రాల్లో చిత్తగించండి! ఇంతటి వాన ముసురులోనూ చల్లపల్లిలో రెపరెపలాడుతున్న స్వచ్ఛ - సుందరోద్యమ పతాకాన్ని స్వాగతించండి!

            నేటి ప్రాతః కాలపు పని ముగింపు వేళ గ్రామ స్వచ్చ - శుభ్ర - సౌందర్య సంకల్పాన్ని గట్టిగా నినదించినది గంధం బృందావన్ కుమార్.

            మంది శ్రేయమే మన క్షేమమని...

శ్రమానందమే సహజ సిద్ధమని - సాటి వారి సంతృప్తి ముఖ్యమని

మంది క్షేమమే మనకు శ్రేయమని - మనిషి సంతృప్తి కదే మూలమని

స్థిత ప్రజ్ఞతో - త్యాగ బుద్ధితో - చిరు హాసంతో - చిరంతనంగా

ప్రస్థానించే - పరాక్రమించే - స్వచ్చ - సౌందర్య కార్యకర్తలకు........

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  11.07.2022.