2482* వ రోజు....           14-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

24x105 నిముషాలు - చల్లపల్లిలో శ్రమదానం 2482* వ నాడు

          ఈ గురువారం వేకువ (14.7.22) 4.18 కే మొదలై, 6.05 దాక శ్రద్ధగా సాగిన గ్రామ ప్రజాప్రయోజనకర కృషికి చెందిన ఒక నిష్పత్తి అది! ఇంకో ఈక్వేషన్ ఏమంటే - 25000: 24 - అంటే పాతిక వేలమంది గ్రామస్తుల కోసం పట్టుమని పాతిక మంది బృందం నిర్వాకం! అది జరిగిన చోటు బెజవాడ దారిలో ప్రభుత్వ పాఠశాల ఆవరణ! అందుకు సాక్ష్యం జాతిపిత విగ్రహం!

          సదరు విగ్రహానికి తూర్పు, దక్షిణ భాగాలు ఎగుడు దిగుడు దిబ్బలు; ఎత్తేదో, పల్లమేదో తెలియకుండా ఇటీవలి వర్షాలకు పెరిగిన గడ్డి దిబ్బులు పిచ్చి మొక్కలు - దిక్కుమాలిన ప్లాస్టిక్ తుక్కులు, అక్కడే మొన్న మొన్నటి దాక పిల్లల్ని కని, కాపురమున్న ఒక వరాహం! అచ్చోటనే మబ్బులు క్రమ్మిన - వాన తుంపరలు పడుతున్న చలి గాలి వీస్తున్న - చీకటి వేళ స్వచ్ఛంద శ్రమదాతల శుభ్ర - సుందరీకరణ ప్రయత్నం!

          ఈ బ్రహ్మ ముహూర్త సమయాన, ఇందరు విద్యావంతులైన స్త్రీ పురుషులు, రైతులు, ప్రస్తుత విశ్రాంత ఉద్యోగులు ఊరు ఉమ్మడి మేలే లక్ష్యంగా - స్ఫూర్తిమంతంగా పాటుబడడం చూస్తుంటే 50 - 60 ఏళ్ల నాడు దేశ స్వాతంత్ర్యం వచ్చిన క్రొత్తలో ఇతర గ్రామాల్లాగే మా ఊళ్ళో జరిగిన సన్నివేశాలు గుర్తుకొస్తున్నవి!

          దూరంగా ఉన్న పంట కాలువ నీటితో ఊరి చెరువును నింపడానికీ, గుడి గోపురాల నిర్మాణానికీ, ఊరిలో జరిగే పెళ్లీ పెరంటాల శుభ కార్యాలకీ చాల మంది కలిసి కట్టుగా ఉత్సాహంగా పని చేసిన దృశ్యాలవి! వ్యక్తి కేంద్రంగా మారిపోయిన నేటి స్వార్ధ ప్రపంచంలో కనీసం ఒక్క చల్లపల్లిలోనైనా అప్పటి ఆనవాళ్ళు చూపట్టడం ఎంత  మంచి సంగతి!

          స్వార్ధం దాక్కొన్న పనుల తత్త్వం వేఱుగా ఉంటుంది. తెలివిగా ప్రజల్ని నమ్మించి, వంచించి, చేసే దోపిడీ మరో రకంగా ఉంటుంది. ఒక మంచి లక్ష్యం కోసం ఒక చల్లపల్లి 'స్వచ్చ సైన్యం' ఎనిమిదేళ్లుగా పాటుబడడంలో ఉన్న వినోదం ఇలా సూటిగాను, నిష్కపటంగా, స్వార్ధ రహితంగా ఉంటుంది!

          100 నిముషాల శ్రమదానంతో పోగుబడి, ట్రాక్టర్ లో కెక్కి, చెత్త కేంద్రానికి పయనమైపోయిన బళ్ళ కొద్దీ వ్యర్ధాలను గమనించాను, కార్యకర్తలు ఏరిన రెండు పెద్ద గోనె సంచుల ప్లాస్టిక్ తుక్కుల్నీ చూశాను, ఆ తడి పొడి గడ్డి గాదాల్ని ఇద్దరు మోసి, ఒకరు ట్రాక్టర్లో నిలిచి, అక్కడ వారు కారుస్తున్న చెమటల్నీ గుర్తించాను! (ఐతే ఇలాంటివి చూసి, మెచ్చి రేపటి ఉషోదయ శ్రమదానంలో పాల్గొనవలసింది నా గ్రామ సహోదరులు!)

          నేటి శ్రమదాన సమీక్షా కాలంలో తన గ్రామ పురోభివృద్ధికర స్వచ్చ శుభ్ర సౌందర్య సంకల్పాన్ని ముమ్మారు నినదించిన మహిళా కార్యకర్త దేసు మాధురి. నాల్గు మంచి మాటలు చెప్పి, గ్రామ మెరుగుదల ప్రణాళికలను ఎప్పటిలాగే వివరించింది డాక్టరు దాసరి రామకృష్ణ!

          ఇంకా మిగిలిపోయిన ఈ పాఠశాల ఆవరణ బాధ్యతల కోసం రేపటి వేకువ మనం కలిసి శ్రమించవలసింది బెజవాడ రోడ్డులోని గాంధీ స్మృతి వనం దగ్గరే!       

    

        *సాధకులు ఆ యోధులే*

బాధ్యతెవ్వరు వహిస్తారో త్యాగ మెవ్వరి సహజగుణమో

ఎవరి ఎడద విశాలమగునో - ఎవరి సహన మపార మగునో

వారె నిలుతురు ఊరి మేలుకు, వారె గెలుతురు జనం మనసులు

స్వచ్ఛ - సుందర చల్లపల్లికి సాధకులు ఆ యోధులే!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  14.07.2022.