2483* వ రోజు.......           15-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

2483* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతులు

          శుక్రవారం (15.7.22) వేకువ బెజవాడ మార్గంలో - ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిన్నటి చోటికి ఎడంగా నీళ్ల టాంకు దరిదాపులో మళ్లీ 24 మంది నిర్వహించిన బాధ్యతలు విజయవంతమయ్యాయి. అదనంగా మరో 10 సెంట్లలో కాలుష్య విధ్వంసం జరిగిందన్న మాట! ఆ మేరకు స్వచ్చ కార్యకర్తలకు సంతృప్తి దక్కిందన్నమాట!

          గాంధీ ఆశయాల్ని మన సమాజం ఏనాడో అటకెక్కించింది. ఊరూరా తిరిగి స్వచ్ఛ - శుభ్రతల్ని విసుగూ - విరామం లేకుండా ఆచరణాత్మకంగా ప్రబోధించిన ఆ ధన్యుడి విగ్రహాలే మిగిలాయి! మాటల్లో కాక చేతల్లో ఎనిమిదేళ్లు ఈ చల్లపల్లి శ్రమదాన కర్తలు మాత్రం శక్తివంచన లేకుండా అతని ఆశయ సిద్ధి కోసం ప్రయత్నించడమే ఒక విశేషం! గత రెండు వారాలుగా - రోజూ 30 - 40 పనిగంటల చొప్పున ఆ మౌన సందేశకునికి, ఆ పరిసరాల్లో స్వచ్చ కార్యకర్తలు నిజమైన నివాళులర్పిస్తూనే ఉన్నారు.

          స్వచ్ఛంద శ్రమదాతల నేటి కర్మక్షేత్రం నీళ్లటాంకు తప్ప నిరుపయోగంగా మిగిలిన కట్టడాల నడుమ చిట్టడివి! అడ్డదిడ్డంగా పెరిగిన ముదనష్టపు ముళ్ల మొక్కలు, తాడి చెట్లు, అల్లుకున్న ముళ్ళ పిచ్చి తీగలు, రాలి పడ్డ కొబ్బరి మట్టలు, కాలు సమంగా ఆనని ఎగుడు దిగుడు నేల, రాళ్లు - రప్పలు, దట్టంగా పెరిగిన గడ్డి... ఇదీ సదరు చిట్టడివి దృశ్యం!

          క్రింద చెదలు పుట్టల్ని, పుట్టల్లో పెరిగిన తాడి చెట్టును, చెలరేగుతున్న తేనె టీగల్ని కాచుకొంటూనే నేటి 100 నిముషాల సమయ - శ్రమదానం సాగింది. మడ్డి కత్తులతో చెట్లు నరికిన వాళ్లూ, పైపుల అడ్డాల నడుమ - క్రింద తమ కాళ్లకు పాములో, కప్పలో, ఎలుకలో ఏవి తటస్థపడతాయో తెలియని చోట దంతెలతో వ్యర్ధాల్ని లాగే వాళ్ళు, వాటిని గుట్టలుగా పేర్చిన కార్యకర్తలూ, ఏమైతేనేం, ఎంత చెమట చిందిస్తేనేం, తామనుకొన్న స్వచ్చ శుభ్రతల్ని సాధించారు!

          ఎప్పటిలా కాక, సదరు వ్యర్ధాల రెండు పెద్ద గుట్టల్ని మాత్రం ఈ రోజు చెత్త కేంద్రానికి తరలించలేదు. తామను కొన్న బాధ్యతలు నెరవేర్చిన సంతోషంతో ఉన్న కార్యకర్తల 6.00 తరువాతి ఛాయా చిత్రాన్ని వాట్సప్ మాధ్యమంలో వీక్షించండి!

          కాఫీ సమయం ముగిశాక - జాతిపిత పాద పీఠం వద్ద అదే సంతృప్తితో ఒక పౌర శాస్త్రోపన్యాసకుడు - వేముల శ్రీనివాసుడు తన ఊరి స్వచ్చ పరిశుభ్ర సౌందర్య సాధనా సంకల్పాన్ని ముమ్మారు ఎలుగెత్తి నినదించడమూ, ఈ స్వచ్చోద్యమ ప్రవర్తకుడు డాక్టరు DRK గారు ఈ వర్ష ఋుతువు కనుగుణంగా ఏ రహదార్ల వెంట ఏ మొక్కలు ఏ విత్తనాలు నాటదగునో చర్చిండమూ జరిగాయి.

          ఇక మన రేపటి ఉషోదయ శ్రమదాన విశేషాల కోసం మన పునర్దర్శనం 6 వ నంబరు కాలువ వంతెన దగ్గరే!

 

          సాధకులు ఈ యోధులే!

కశ్మలాలను కౌగలించే - శ్మశానాలను సంస్కరించే - ఊరి మురుగు బహిష్కరించే

హరిత వనము లలంకరించే పూల తోటలు పరిమళించే - బద్ధకాలను పరిహసించే

జనుల కాహ్లాదములు పంచే - ముని తపస్సులు గుర్తు చేసే వినయ వినమిత వర్తనలతో

స్వచ్చ - సుందర చల్లపల్లికి సాధకులు ఈ యోధులే!

- నల్లూరి రామారావు,

   విశ్రాంత ఉపాధ్యాయుడు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

   15.07.2022.