2484* వ రోజు.......           16-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

స్వచ్చ కార్యకర్తల శ్రమదానం వయసు - నేటికి 2484* రోజులు.

         ఔను! ఈ శనివారం (16-7-22) వేకువ -6 వ నంబరు పంటకాలువ కేంద్రంగా జరిగిన ఊరి శుభ్ర - సుందరీకరణం 2484* వ నాటిదే ! ముఖ్యంగా కాలువ ఉత్తరం గట్టు మీద పచ్చదనం లోపించి, బోసిపోతున్న కొంత భాగంలో పూల మొక్కలు నాటారు. అందు నిమిత్తం దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని నీటిని ఏ 20 - 30 బకెట్లతోనో మోశారు!

         సుమారు 30 కి పైగానే గద్ద గోరు అనబడే అడవి తంగేడు రంగు రంగుల పూల మొక్కల కోసం గోతులు త్రవ్వి, నాటిన పిదప పాదులు చేసి, నీరు పోసి, అప్పటికే కళావిహీనంగా మిగిలిన కొన్ని పాత మొక్కల పాదులు సవరించి, నీరందించి, సపర్యలు చేశారు.

         నేటి 25 మంది కష్టదాతల్లో ఎక్కువ మంది పై కార్యక్రమంలో ఉంటే – ఐదారుగురు విజయవాడ రోడ్డు ఊడ్చి, శుభ్రపరిచి ప్లాస్టిక్ కవర్లు, నీసాలు, మద్యం గాజు సీసాలు తొలగించే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో నా ఊరి పాతిక వేల మందిలో చాల మంది సుఖం నిద్రలోనో - సొంత పనుల్లోనో మునిగున్నారు!

         సరే! ఎవరి స్వేచ్చ వాళ్లది; ఎవరి నిద్రా సుఖ వాళ్లది; సామాజిక బాధ్యతానంతర సంతృప్తి కార్యకర్తలది! నేటి శ్రమదానం తర్వాత 25 నిముషాలు శ్మశానం, అక్కడ అడుగడుగునా తీర్చిదిద్దిన కట్టడాల - పూబాలల - ఎన్నోరకాల చెట్ల పచ్చదనాలను చూసి, 3 వీధులు తిరిగి చూసి వచ్చి, స్వచ్చ కారకర్తల శ్రమ ఫలితాన్ని నెమరు వేసుకొని పొందుతున్న ఆనందం నాది!

         పసందైన కాఫీల నాస్వాదించే సమయంలో ఒక నడి వయసు కార్యకర్త “నేటి పని దినాల సంఖ్య 2484 కు బదులు 8484 గా ఉంటే చూడాలని ఉన్నది” అంటే – కొందరు సమ్మతించారు! అనగా మరో పాతికేళ్ళ గ్రామ బాధ్యతలన్న మాట! ఇప్పుడున్న టీంలో అదెందరికి సాధ్యమో గాని, ఆ సంభాషణ స్వచ్చ సైనికుల శ్రమ సంసిద్ధతకూ, ఉత్సాహానికీ చిహ్నమను కోవచ్చు!

         6 వ నంబరు కాల్వ వంతెన మీద నేటి సమీక్షా సమావేశంలో చల్లపల్లి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య దీక్షను ముమ్మారు నినదించినవారు నూతక్కి శివబాబు - నేటి కృషి సమీక్షలో కొత్త విషయమేమంటే - ఇది అంతర్జాతీయ సర్పదినోత్సవ మట! పక్షుల, సరీ సృపాల, మానవేతర లక్షలాది ఇతర జీవుల అవసరం ఈ సజీవ ప్రపంచ సమతౌల్యానికెంత ఉన్నదో ఒకరిద్దరు విజ్ఞులు వివరించడం! పాములూ, ఎలుకలూ కేవలం మనుషుల చేతిలో చావడానికే పుట్టడం లేదనీ, వాటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలూ, ప్రకృతికి వాటి ఆవశ్యకతా మనం గుర్తించక తప్పదనేది ఒక మంచి విజ్ఞత!

         రేపటి మన శ్రమదాన కర్తవ్యం కోసం వేకువనే మనం గుమిగూడవలసిన చోటు విజయవాడ రోడ్డులోని 6 వ నంబరు కాల్వ వంతెన వద్ద.  

 

             సాధకులు ఈ యోధులే!

వాళ్ల లక్ష్యం – వాళ్ల గమ్యం - వాళ్ల ధ్యేయం - ఆశయం

వాళ్ల ధైర్యం – మనోస్వైర్ధ్యం ప్రజా రంజన పట్ల ప్రేమం

సొంత గ్రామం మెరుగుదలకై చొరవ చూపే లక్షణం

స్వచ్చ - సుందర చల్లపల్లికి సాధకులు ఈ యోధులే!

- నల్లూరి రామారావు,

   విశ్రాంత ఉపాధ్యాయుడు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

   16.07.2022.