2485* వ రోజు.....           17-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

2485* (ఆదివారం) నాటి శ్రమదాన ఆదర్శం!

            17.7.22 ఉషః సమయ విశేషమేమంటే - 35 మంది కార్యకర్తలు స్వగ్రామం బాగుదల కోసం గంటన్నరకు పైగా పడిన శ్రమ, ప్రదర్శించిన స్ఫూర్తి, పొందిన సంతృప్తి! 6వ నంబరు పంటకాలువ ఉత్తరం గట్టు, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ వెలుపలి మురుగు కాలువ బాగుచేత! నలుగురైదుగురు సుందరీకర్తలు బెజవాడ రోడ్డు పడమర దిక్కును అద్దంలాగా, శిల్పంలాగా మలచడం దీనికి అదనం!

            రోజూ వచ్చి, పాల్గొనే శ్రమదాన వ్యసనపరులు కాక ధ్యాన మండలి నడక సంఘం - సకుటుంబంగా ఊరి సర్పంచి, RTC వగైరాల వారి చేరికతోను, కత్తులకు సరైన పని దొరికినందుకు సంతసించే దంతెలకు బాగా పనిచెప్పే ఉత్సాహవంతులతోనూ నారాయణరావు నగర్‌కు వెళ్లే కాల్వ గట్టు రోడ్డులో మంచి సందడే నెలకొన్నది.

            ముళ్లూ, పాత గుడ్దలూ, ఎండుటాకులూ ముళ్ల మొక్కలూ, పిచ్చి మేడి చెట్ల పొదలూ, వీటన్నిటి నడుమ తగు పాళ్లలో పాత చెప్పులూ సారా సిసాలూ ప్లాస్టిక్ సంచులూ సీసాలూ నిండిన డ్రైనును క్షుణ్ణంగా శుభ్రపరుస్తూ శ్రమించిన స్వచ్ఛసైనికులకు ఆ మాత్రం ఛలోక్తులూ, కూనిరాగాలూ, హాస్య ప్రసంగాలూ సందర్భోచితాలే!

            35 మంది గుంపులో ఎనిమిదేళ్ల దుబాయి బాలుడు మొదలు 84 ఏళ్ల బాల వృద్ధుడు దాక ఎవరికి తోచిన ప్రయత్నం వాళ్ళు చేశారు. తీరా – 6.00 సమయానికి ఇందరు ఏరిన, నరికిన, ఊడ్చిన, దంతెలతో రోడ్డు పైకి లాగి పోగేసిన తుక్కులన్నీ కలిపి రెండు ట్రాక్టర్లకు సరిపడా లెక్క తేలింది. ఐతే ఒకళ్ళకిద్దరు లోడింగ్ నిపుణులు ట్రక్కులో నిలిచి, సర్దుతూ అణగ త్రొక్కుతూ నలుగురందించిన చెత్తను ఒక్క ట్రక్కుకే పరిమితం చేశారు.

            “ఆఁ- చేశారులే మహా! నిన్నా నేడూ 60 మంది కాలువకటుప్రక్క 30 మొక్కలు నాటడమూ ఈ దరి డ్రైను 100 గజాలు బాగు చేయడమూ - ఇంతోటి దానికి ఆమైకులూ, లైట్లూ, పాటలూ, సింగినాదాలూ....అని ఎవ్వరైనా వాచాలురు అనుకుంటే - అంటే అన వచ్చు గాక! లోకోః భిన్న రుచిఃఅనే సామెతను గుర్తుచేసుకొందాం!

            ఈ రోజు కాస్త ఆలస్యంగా వచ్చిన ఒక భారీ కార్యకర్త ఒక పెద్దాయన ప్రశ్నకు బదులుగా –“ఏంచేసేది చెప్పండి! కొంచెం ఆలస్యమయిందని నేనిక్కడికి రావడం మానేస్తే - ఈ సందడి, ఇంతమంది చేసే మంచి పనిలోని సంతృప్తీ దక్కక - రాత్రికి హాయిగా నిద్ర పట్టదు మరి...అన్న మాటల్నే మనం అర్ధం చేసుకుందాం!

            6.20 తర్వాత - నేటి పని ముగింపు వేళ తన ఊరి స్వచ్చోద్యమ సందేశాన్ని ముమ్మారు స్పష్టంగా నినదించిన వ్యక్తి శ్రీమద్రాయపాటి రాధాకృష్ణుల వారు! గుడివాడ, నంద్యాల వంటి చోట్ల చల్లపల్లితో సమానంగానో మిన్నగానో ఉన్న శ్మశానాల చరిత్రను వివరించింది DRK వైద్యుల వారు! వారి సమాచారానికి మరింత మెరుగులు దిద్దిన స్వచ్ఛ సుందరీకర్త శ్రీమతి పద్మావతి! క్రమం తప్పని నెలవారీ చందా – 5,000/- సమర్పించినది ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రుల వారు! రెండు పాటల్ని శ్రావ్యంగా ఆలపించి, చప్పట్లు కొట్టించినది నందేటి వారు!

            బుధవారం వేకువ సైతం మనం కలుసుకొని పురోగమించివలసిన చోటు ఈ 6 వ నెంబరు కాల్వ వంతెనే!

 

              వినయ వినమిత మనిషి ఆతడు

అహా! ఇది కడు అద్భుతంబని త్యాగమని ఆదర్శమని

కార్యకర్తా జబ్బ చరచడు – “గ్రామ మందున పుట్టి పెరిగిన

ఋణం తీర్చే - పౌర బాధ్యత నిర్వహించే క్రమం ఇదిఅని

వినయ వినమిత సమాధానం విన్నవించే మనిషి ఆతడు|

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  17.07.2022.

క్రమం తప్పని నెలవారీ చందా – 5,000/- సమర్పించినది ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రుల వారు!