1912* వ రోజు....           05-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1912* వ నాటి శ్రమదాన సందేశం.

నేటి ఉషోదయానకి ముందే 4.00 నుండి 6.16 నిముషాల దాక త్రిముఖంగా సాగిన స్వచ్చంద శ్రమ విరాళంలో పాల్గొన్న స్వచ్చ కార్యకర్తలు 27 మంది. దీనికి సమాంతరంగా ఆరేడుగురు ట్రస్టు ఉద్యోగుల గ్రామహిత చర్యలు.

 

నేటి స్వచ్చ – సుందర కృషిలో ముఖ్యాంశం కస్తూర్బాయి స్మారక భవనాల శిధిలాలో జరిగిన పరిశుభ్రతా ప్రయత్నమే. ఎందరెందరో విసిరిన రకరకాల వ్యర్ధాలతో, పరిసర ప్రస్తుత నిర్మాణాల తుక్కులతో, గోడల మధ్య – 70 సెంట్ల ప్రాంగణంలోని పిచ్చి చెట్లతో కీ కారణ్యంగా – వికారంగా కనిపించిన ఈ ఆవరణ రెండు గంటల పాటు 20 మంది పట్టిన పంతంతో 6.30 తరువాత పరిశుభ్రంగా మారింది. అందుకే – “స్వచ్చంద కృషితో నాస్తి దుర్భిక్షమ్ ఎన్నో అపోహాల – పుకార్ల పూర్వకంగా ఈ శిధిల భవనాల స్వచ్చ సుందరీకరణం ఇది ఐదవమారు!

 

గ్రామరక్షక దళం ఈ రోజు కూడ పాగోలులోని యార్లగడ్డ శివప్రసాదు గారి నూతన గృహ నిర్మాణ రద్దును ట్రాక్టర్ లో నింపి, తెచ్చి బస్ ప్రాంగణపు తారుబాటను పటిష్టపరిచారు.

 

సుందరీకరణ బృందం RTC ప్రాంగణంలో గత వారం రోజులు తమ పట్టు వదలని కృషిని కొనసాగించారు. కాకపోతే – ఈరోజు 6.30 కు తమ పనిని ముగించి, సమీక్షా సమావేశానికి వచ్చారు!

 

ఏడెనిమిది రహదార్ల వెంట ఉన్న వేలాది చెట్లకు నీరు పెట్టే పనిని, రహదారి వనాల నిర్వహణను, ట్రస్టు కార్మికులు కొనసాగిస్తూనే ఉన్నారు.

 

గ్రామంతర ప్రయాణ రీత్యా మన ఇద్దరు వైద్యులు ఈరోజు 6.00 కు ముందే తమ స్వచ్చ బాధ్యతలు ముగించి, నిష్క్రమించగా – 6.35 నిముషాల సమయంలో జరిగిన సమీక్షా సమావేశాన్ని ముమ్మరు ప్రకటించిన స్వచ్చ – సుందర సంకల్ప నినాదాలతో కాంపౌందర్ వక్కలగడ్డ వేంకటేశ్వరరావు ముగించారు. నేటి  2 గంటల తమ శ్రమదాన ఫలితం పట్ల అంతా సంతృప్తిని ప్రకటించారు.

 

రేపటి మన శ్రమదాన వేదిక కస్తూర్బా స్మారక ఆసుపత్రి శిధిల భవన ప్రాంగణమే! 

         బాధ్యతలని భావిస్తాం....

“ఇది తలమానికిమంటూ – ఇదొక గర్వకారణమని

స్వచ్చ సైన్య చల్లపల్లి సాటి లేని మేటి అని .....”

కీర్తించను, ఘోషించను – కేవలమవి బాధ్యతలే!

సమాజ ఋణం తీర్చుటలో స్వచ్చ సైన్య ప్రయత్నమే!!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 05/02/2020

చల్లపల్లి.