2486* వ రోజు........           19-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

2486* వ పనిదినాన రెస్క్యూ దళం వారి ఊరి బాధ్యతలు!

          మంగళవారం (19-7-22) నాటి ఉషః సమయపు పని దినం సంఖ్య 2486* ఐతే - పనికొచ్చే రోడ్ల మరమ్మత్తు పనులకు పూనుకొన్న కార్యకర్తలు ఆరుగురు. వారి శ్రమను గంటన్నర పాటు పొంది - కాస్త మెరుగుపడినది - సాగర్ టాకీస్ బైపాస్ వీధి! వారి కఠిన, కృషిని చూస్తూ, వేలు పెట్టక దాటిపోయిన గ్రామస్తులు డజన్ల మంది! తమ ఇళ్ల ఎదుటే - తమందరి కోసమే జరుగుతున్న ప్రయత్నంలో - మోహమాటానికైనా సహకరించిన అక్కడి గృహస్తులు సున్నా మంది!

          అసలీ రోడ్ల రక్షక కార్యకర్తలు ఈ దారి గుంటల పని గతవారమే చేయవలసి ఉండెను గానీ, ప్రకృతి సహకారం దొరకక - వాన ముసురు వల్ల నేటికి వాయిదా పడ్డది! రహదారి ఉద్యానాల స్తంభాల కాంక్రీటును చాల కష్టపడి స్వచ్ఛ కార్యకర్తలు, రెస్క్యూ దళమూ, ట్రస్టు కార్మిక మిత్రులూ పగల గొట్టి ఈ గుంటల కోసమే అక్కడ ఉంచుకొనగా - ఏ గ్రామస్తులోగాని - ఈ వాయిదాను సద్వినియోగించారు - తమ సొంత అవసరాల కోసం ఆ రద్దును వాడేశారు! (వాళ్ళ చురుకుదనాన్నీ, చొరవనూ అభినందించక చేసేదేముంది?)

          తమ గంటన్నర పనిని ముగించాక ఒక రక్తదాన ఛాంపియన్ కస్తూరి విజయ్ ముమ్మారు నినదించిన ఊరి స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య సంకల్పాన్ని మిగిలిన వాళ్ళు పునరుద్ఘాటించడంతో నేటి శ్రమదానానికి ముగింపు!

 

          అందరిదీ అవకాశమె

గ్రామ సమైక్యత చాటుట, చైతన్యంతో కదలుట,

ఊరుమ్మడి సౌఖ్యానికి ఉవ్వెత్తున యత్నించుట.....

అందరిదీ అవకాశమె - అందరి కత్యవసరమే

స్వచ్ఛ కార్యకర్తలకిది సొంత విషయమౌతుందా?

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  19.07.2022.