2487* వ రోజు....           20-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

పంట కాలువ గట్టు కేంద్రంగా 2487* వ నాటి పారిశుద్ధ్యం:

          ఈ బుధవారం (20-7-22) నాటి ఆహ్లాదకర శుభోదయాన - బెజవాడ వైపు బాటలో - ఒకప్పటి వారుణి వాహినీ కేంద్రం ఉత్తరాన నారాయణరావు నగర్ రోడ్డులో నిర్వహించిన గ్రామ పారిశుద్ధ్య బాధ్యతలు 20 మందివి! తత్ఫలితంగా – 6.10 వేళ తరువాత కనిపించిన శుభ్ర - సౌందర్యం 50 – 60 గజాల బాట, దాని ప్రక్క ఎండిన మురుగు కాలువది. స్పందించి, పొందగలిగిన గ్రామస్తులుంటే - కావలసినంత సామాజిక స్ఫూర్తి!

          ఎన్ని వేల వేకువ సమయాల నుండో నాకు కనిపించేది మాత్రం ఒకే రమణీయ సన్నివేశం! పాతిక ముప్పై - నలభై మంది స్వచ్ఛంద శ్రమదాతలు తమ ఊరి జనాల చైతన్యం కోసం - ఆహ్లాదం నిమిత్తం - పచ్చదనాలు నింపుతూ, శ్మశానాలను అందగిస్తూ, బస్ ప్రాంగణాలను అలంకరిస్తూ, వేల కొద్దీ పూల మొక్కలు పెంచుతూ, రోడ్ల గుంటలు పూడుస్తూ, మరో 30 – 40 ఏళ్ల దాక ఊరి సౌకర్యాలను కాపాడే ప్రణాళికలు అల్లుతూ, పనిలో పనిగా రాష్ట్రవ్యాప్తంగా 30 - 40 ఊళ్ల ఆలోచనాపరుల్లో కొంగ్రొత్త భావనలు రగులు కొలుపుతూ చేస్తున్న విసుగూ - విరామం లేని ఒక బృహత్ ప్రయత్నం!

          ఐతే - నాకు తెలిసినంత వరకూ ఈ కార్యకర్తలేరోజుకారోజు తమ ప్రత్యేకతనో గొప్పదనాన్నో రాబోయే కీర్తినో కొలుచుకొంటూ, తలచుకొంటూ నాలుగు లక్షల పనిగంటలు శ్రమించలేదు! తాము పుట్టి పెరిగిన బుద్ధెరిగిన తమ గ్రామ సమాజానికి పడిన అప్పును కొంత తీర్చగలుగుతున్నామనే సంతృప్తి కోసమే వాళ్లిదంతా చేస్తున్నారు! తమ జీవితాల కొక లక్ష్యం, తమలో ఒక ఐకమత్యం, ఒక క్రమ శిక్షణ పాటిస్తున్నారు!

          ఎప్పటిలాగే ఈ తెలవారు సమయానికి 15 మంది శ్రమతో బాగుపడిన చోట పుట్టుకొచ్చిన వ్యర్ధాలొక పెద్ద ట్రక్కు నిండుగా! మద్యం గాజు బుడ్లూ, ప్లాస్టిక్ వస్తువులూ ఇంకొక గోనె సంచి పట్టనంతగా! ఈ మాత్రం పనికి కత్తులు వాడి, గొర్రుల్తో లాగి, గుంట - మెరకలు చదును చేసి, పొగుల్ని డిప్పల్తో ట్రాక్టరు కెత్తి, చెత్త కేంద్రానికి తరలించి .... వాళ్ళు సంతోషంగా కార్చిన చెమట మనం ఊహించుకోదగినంత!

          ఎనిమిదేళ్ళ దుబాయి కుర్రాడు వల్లభనేని అర్నవ్ తో సహా నలుగురైదుగురు సుందరీకర్తల కార్యరంగం బెజవాడ రహదారి! వాళ్ళ చేతుల్లో పడి మరింతగా సొగసులు సంతరించుకున్నవి ఐదారు చెట్లు! అక్కడి చెట్ల పాదుల్ని, రోడ్ల మార్జిన్లను క్షుణ్ణంగా సుందరీకరించక వాళ్ళెందుకు వదులుతారు?

          కాఫీ కాలక్షేపం తరువాత పంట కాలువ వంతెన పైనే 10 నిమిషాలు జరిగిన సమాలోచనా సమావేశం మనకోసం మనంట్రస్టు పర్యవేక్షకుడైన కస్తూరి శ్రీను గట్టిగా ప్రకటించిన త్రివిధ గ్రామ మెరుగుదల సంకల్ప నినాదాలతో మొదలై, డాక్టరు గారి ఊరి స్వచ్చ శుభ్ర సౌందర్య ప్రణాళికా చర్చతో ముగిసింది!

          రేపటి మన వేకువ కాల శ్రమదాన ప్రయత్నం కూడ ఇదే బెజవాడ దారిలోనే ఉండగలదు!

   

        వర్ధిల్లక తప్పదు!

ఒక సత్కర్మాచరణం ఒకో మారు ఒంటరిదే

ఒక బ్రూటల్ మెజారిటీ ఉచితానుచితము లెరుగదు

స్వచ్చ కార్యకర్త లిపుడు పరిమిత సంఖ్యాకులే

వారి బాట ఒక నాటికి వర్ధిల్లక తప్పదు!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  20.07.2022.