2488* వ రోజు....           21-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

బెజవాడ వైపు రోడ్డులో స్వచ్ఛ కార్యకర్తల కృషి - @2488*

          గురువారం వేకువ నుండి గంటన్నరకు పైగా 24 మంది ప్రమేయంతో పాత చిన్న కార్ల మరమ్మత్తు కేంద్రానికటూ – ఇటూగా శుభ్ర – సుందరీకరణం ఇంకొక 150 గజాల మేరకు పురోగమించింది! వచ్చే – వెళ్ళే వేగవంతమైన వాహనాలను కాచుకొని, జాగ్రత్తగా చేసిన పనులతో రెండు ప్రక్కల మురుగు కాల్వల్తో బాటు రహదారి ఇప్పుడు చూడ చక్కగా ఉన్నది.

          ఇంచుమించు నెల నాళ్ళ నుండీ ఇదే దారిలో వీరి శ్రమదానం సమర్పిత మౌతూనే ఉన్నది! ఈ రెండు కిలోమీటర్ల భాగంలోనే ఈ  పాతిక - ముపై - నలభై మంది ప్లాస్టిక్ తుక్కునూ, ఎంగిలాకుల్నీ. ఆహార వ్యర్ధాలనూ ఏరి తొలగిస్తూనే ఉన్నారు! మరో ప్రక్క కొందరు బాధ్యతారహితులు కూడ ఏమాత్రం తగ్గకుండా ఖాళీ మద్యం సీసాలను, పాల పాకెట్లను గ్లాసులు – సీసాలు – కప్పులు - ప్లేట్లను శక్తివంచన లేకుండా వేస్తూనే ఉన్నారు!

          ఏడేళ్ళ నాడు ఒక దాత సహకరిస్తే పెట్టిన చెట్లకు అమర్చిన గార్డుల అవసరం తీరి, వాటిని ఊడగొట్టే ప్రయత్నం చేసిన ఇద్దరు కార్యకర్తల్లో ఒకరి కాళ్ళ మీద అవి విరిగి పడడమూ, ఆపాటి నొప్పిని అతగాడే మాత్రం ఖాతరు చేయకపోవడమూ నేటి శ్రమదాన దృశ్యాల్లో ఒకటి!

          నరికిన గద్ద గోరు మొక్కల రెమ్మల్ని ట్రాక్టరులో ఎక్కిస్తుంటే – అవి కరివేపాకు కొమ్మలనుకొని దారినపోయే ఒకామె లాక్కొనే ప్రయత్నంలో పేచీ పడిన సన్నివేశం మరొకటి!  

          ఇప్పటికే స్వచ్ఛ భారత్ చరిత్ర తొలి పుటల్లోకెక్కిన చల్లపల్లి కార్యకర్తల శ్రమదానోద్యమంలో ఇలాంటి సంఘటన లెన్నో! చరిత్ర నిర్మాతలందరూ దాని నిర్మాణక్రమాన్నీ, తత్ఫలితాన్నీ శ్రద్ధగా పట్టించుకోక పోవచ్చు గానీ, ఈ క్రొత్త చరిత్ర గమనమైతే ఏడెనిమిదేళ్లుగా నిరాఘాటంగా నడిచి పోతున్నది! ఎవరి మెప్పులకో – గొప్పలకో జరిగేదైతే గదా - కుంటుపడడానికి!

          ఇతరుల సంగతెందుకు గాని, నాకైతే – మా చల్లపల్లి స్వచ్చంద శ్రమదానోద్యమమూ, అందలి ఒక్కో ఘట్టమూ ఎన్నాళ్ళు – ఎన్నేళ్ళు పరిశీలించినో విసుగు పుట్టదు – తనివి తీరదు సరిగదా – ఏరోజు కారోజు క్రొత్తగానే, ఆశ్చర్యకరం గానే, అభివందనీయంగానే ఉంటుంది! పేజీలు పేజీలు నిండుతున్నా – లేఖినిలో మషీరసం ఇంకుతున్నా ఇంకా వ్రాయాలనే ఉంటుంది!

          నేటి శ్రమ సమర్పణ కార్యక్రమం ముగింపుకు ముందు శక్తిమంతంగా చల్లపల్లి స్వచ్చోద్యమ ఉద్దేశాన్ని ముమ్మారు నినదించినది పోస్టల్ మెండు శ్రీనివాసు. సమీక్షించిన దార్శనికత దాసరి రామకృష్ణ ప్రసాదునిది! విజయవంతంగా గ్రామ బాధ్యతలు నిర్వహించిన కార్యకర్తలకు వీడ్కోలు పలికినది ఆహ్లాదకరమైన ఒక చిరుజల్లు!

          రేపటి బాధ్యతల కోసం మనం కలుసుకోదగినది కూడ బెజవాడ రహదారిలోనే!

 

          కార్యకర్తల చలువ సుమీ!

క్రమం తప్పని సమాలోచన - శ్రమకు వెరవని తత్త్వచింతన

సుదీర్ఘంగా ఒక నిబద్ధత - మిశ్రమంగా జనం స్పందన

ఎక్కడెక్కడి దార్శనికులకు చల్లపల్లే పెద్ద ప్రేరణ

కావడం ఈ స్వచ్ఛ - సుందర కార్యకర్తల కెంత మన్నన!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  21.07.2022.