2489* వ రోజు.......           22-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

ఆ బెజవాడ రోడ్డులోనే - 24 మంది నెరవేర్చిన ఊరి బాధ్యతలు - 2489*

          22-7-22 - శుక్రవారం వేకువ సైతం చలివేస్తున్న వానపడబోతున్న వాతావరణంలోనూ స్వచ్ఛ కార్యకర్తలు మాత్రం తమ చిరకాల దైనందిన శ్రమదానాన్ని నిర్విఘ్నంగా ముగించారు. ఒకటి - రెండు మార్లు వరుణుడు కార్యకర్తల్ని పరామర్శించినా -  ఇబ్బంది పెట్టలేదు!

          నేటి స్వచ్చ కార్యకర్తల పర్యావరణ పరిరక్షణాత్మక చర్యలు కొంచెం అటూ ఇటూగా నిన్నటి చోటనే! నిన్న రోడ్డు సంగతిని, మురుగు కాల్వల కశ్మల దౌర్భాగ్యాన్ని పట్టించుకొన్న సుందరీకర్తల బృందం నేడు ప్రధానంగా ఏ వందేళ్ల నాటిదో అనిపించే చిన్న కార్ల షెడ్డు దగ్గరే తమ శ్రద్ధను కేంద్రీకరించారు.

          అంటేనేమో విమర్శించినట్లు, తప్పుపట్టినట్లూ అనిపిస్తుందేమో గాని, అంతమంది అన్ని కార్లు తెచ్చి కడిగించుకొనే - మరామత్తులు చేయించుకొందుకు కూర్చొనే చోటు ఇంత కాలుష్య కేంద్రంగా - దుర్భరంగా అసహ్యంగా ఉండాలా? వికృతంగా ఆయిల్ మరకలు, ఖాళీ ఆయిల్ డబ్బాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు, గుడ్డ పేలికలు, విరిగిన తుప్పు పట్టిన ఇనుప ముక్కలు .... ఈ ఆరేడు సెంట్ల స్థలాన్ని శుభ్రం చేసి, మెరక పల్లాలు సరిదిద్ది, పూల మొక్కలు నాటి, ఐదారుగురు పడిన కష్టాన్ని సదరు యాజమాన్యమో - కష్టమర్లో అసలు గుర్తిస్తారా అని!

          వాననక ఎండనక - దుమ్మూ ధూళీ, అవసరమైతే మురుగునీ, కొండొకచో అశుద్ధాన్ని తొలగించే రహదార్ల మీద పచ్చదనాల వ్యవసాయం చేసే తమ ఆహ్లాదం కోరి పూల తోటల్ని సృష్టించే రోడ్ల మార్జిన్లను కబ్జాల నుండి కొంత వరకైనా రక్షించే ఈ నిత్య శ్రామికుల్ని సగానికి పైగా గ్రామస్తులు 8 ఏళ్ల తరువాతైనా ఎందుకర్ధం చేసుకోరు?

          ఏదోకచోట కార్యకర్తలు శుభ్రపరచిన రోడ్ల మీద నడిచేప్పుడూ, ఒకానొక అత్యంత సీనియర్ స్వచ్చంద సేవకుని (విశ్రాంత వ్యాయామోపాధ్యాయుడు - @91* ఏళ్ళు!) భూరి – 2 లక్షల విరాళంతో గుంటలు బాగుపడితే చూస్తూ నడుస్తున్నప్పుడు లక్షలో కోట్లో ఖర్చుతో – ‘మనకోసం మనంట్రస్టు వల్ల నానాటికీ తమ ఊరి సకల సౌకర్య సౌందర్యపరంగా మెరుగౌతున్నప్పుడూ నా వంటి సగటు మనిషి ఈ చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమం పట్ల చూపిస్తున్న కృతజ్ఞతే ప్రతి ఒక్క గ్రామ పౌరుడిలోనూ ఉండాలి గదా!

          మరొక మారు వర్షం సిద్ధమౌతున్న 6.30 సమయంలో నాలాగే  పాక్షిక సమయ కార్యకర్త ఒక యువ మెకానిక్ ముమ్మారు పునరుద్ఘాటించిన గ్రామ స్వచ్చ శుభ్ర సుందరీకరణోద్యమం నినాదాలతోను, కార్యకర్తల కృషితో అందాలు దిద్దుకున్న బెజవాడ రోడ్డును సంతృప్తిగా సహర్షంగా ఫోటోలు తీసుకొని ఆనందిస్తున్న డాక్టరు DRK గారి సమీక్షతోను నేటి శ్రమదానం వేడుకకు ముగింపు!

          వీధి సుందరీకరణ కొనసాగింపు కోసం రేపటి వేకువ మనం కలిసి శ్రమించదగిన చోటూ, పూల మొక్కలు నాటవలసిన స్థలమూ 6 వ నంబరు పంట కాలువ వంతెనే దగ్గరే!

 

          ఊహకందని అద్భుతం

ఒక సకాలపు మంచి నిర్ణయ, మొక సమంచిత శ్రమ వినోదం

కొద్ది మందే వీధి వీధిన కొసరి చేసే పారిశుద్ధ్యం

అదే తమకు అదృష్టమనుకొని అనుసరించే చిన్న బృందం

ఊరినింతగ మార్చగలుగుట ఊహకందని అద్భుతం!

 

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  22.07.2022.