2490* వ రోజు.......           24-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

2490*(ఆదివారం )నాటి వీధి పారిశుద్ధ్యం         

24.07.2022 వేకువ 4.24 కే ప్రారంభమైన 19 మంది ప్రయత్నం గంటన్నరకు పైగా విజయవంతమైంది. సదరు శ్రమదానం జరిగినది బెజవాడ రోడ్డులో చిన్న కారుల షెడ్డుకు ఉత్తరంగా సుమారు 150 గజాల మేర.

          ఊరిలో చాలా వార్డుల – రోడ్డుల వలెనే ఈ బెజవాడ రోడ్డు గాని, డ్రైన్లు గాని తక్కువేం తినలేదు. ఈ కాస్త భాగం శుభ్రపడేందుకే సుమారు 30 పని గంటల శ్రమ అవసరమైంది. - అదీ ఈ ప్రాంతంలో నివాస గృహాలు తక్కువగా ఉండబట్టి!  

          అసలే  కార్యకర్తల సంఖ్య ఇవాళ కాస్త తగ్గింది. ఇదే రోడ్డు లో విజయా కాన్వెంటు లో  జరుగుతున్న వైద్య శిబిరమే అందుకు కారణం. కార్యకర్తలలో సుమారు 10 మంది ఆ వైద్య శిబిరంలో తమ చిరకాల బాధ్యతల్ని నెరవేర్చేందుకు వెళ్లారు. అక్కడ  తరగతి గదుల్ని, వరండాల్ని, షామియానాలు వేసిన చోటుల్ని ఊడ్చి శుభ్ర పరచడం, మందుల పెట్టెల్ని మోయడం, వంటి కొన్ని  పనులని చూసుకొన్నాక, అందులో కొందరు మళ్ళీ వీధి పారుశుద్ధ్య కర్తవ్యం కోసం తిరిగి వచ్చారు.  

          ఇక షరా మామూలే – వీధుల్లోని, మురుగు కాలవలోని పిచ్చి-ముళ్ల మొక్కల్ని తొలగించడం, ఎండు కొమ్మల్ని, ఆకుల్ని ఊడవడం, అంతకుముందు తామే నాటి పెంచిన మొక్కల్ని, వాటి పాదుల్ని పరామర్శించి బాగు చేయడం, ఊడ్చిన పోగుల్ని డిప్పలతో ఎత్తి ట్రక్కులోకి చేర్చి చెత్త కేంద్రానికి చేరవేయడం – ఇదన్న మాట వాళ్ల బాధ్యత.

          మరి ఎనిమిదేళ్లుగా  తాముంటున్న ఊరి పరిశుభ్ర- సౌందర్య బాధ్యతలు  నెరవేరుస్తున్న ఈ కార్యకర్తలకు ఒరిగిందేమిటి? ఒక జానెడు సంతృప్తీ , ఒక దోసెడు ఆనంద ప్రదమైన మనః స్థితీ!   ఒక మంచి సమాజం కోసం ఒక మంచి ప్రయత్నం చేస్తున్నామనే చిరు సంతోషం !

          6.20 నిముషాల తరువాత చల్లపల్లి స్వచ్చంద శ్రమదానం ముగింపు సమయాన కోడూరు వేంకటేశ్వర మహోదయుడు ప్రవచించిన గ్రామ స్వచ్చ-శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలతో ఉత్సాహపరచగా, బందరు కలెక్టర్ కార్యాలయం నుండి ఈ శ్రమదాన వేడుకను గమనించుటకు వచ్చిన ఒక ఉద్యోగి ఈ కార్యక్రమమంతటికీ సాక్షిగా ఉన్నారు.

బుధవారం వేకువ మన శ్రమ దానం సైతం ఇదే బెజవాడ రోడ్డు లోనే జరగబోతున్నది!

 

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  24.07.2022.

విజయవాడ రోడ్లో చిన్నకార్ల షేడ్ వద్ద
శుభ్రం చేసిన తరువాత