2491* వ రోజు......           26-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

మరొక మారు – 2491* వ నాడు కార్యకర్తల రెస్క్యూ చర్యలు.

            మంగళవారం – (26.07.2022) బాగా చల్లని వేళ- మళ్ళీ గ్రామ రక్షకదళం పనిలోకి దిగనే దిగింది -  సాగర్ టాకీస్ మార్గంలోనూ, బెజవాడ బాట ప్రక్కనా! కావడానికి గ్రామ జనాభాతో పోలిస్తే ఈ ఆరుగురు బొత్తిగా అల్ప సంఖ్యాకులే! వీళ్ళ ఆర్ధిక - అంగబలాలు పంచాయతీతోనో, కొందరు గ్రామ పెద్దలతోనో పోలిస్తే ఏపాటివి?

            ఐతే వీళ్ల వెనుక మనకోసం మనంఅనే సార్థక నామం కల - సదాశయ సంపన్నమైన ఒకానొక ధార్మిక సంస్థ! మళ్ళీ దాని వెనుక, గ్రామ - రాష్ట్ర దేశ - ప్రపంచ వాప్తంగా కొందరు ఉదారుల ఆర్థిక - నైతిక బలం! సమాజానికి అక్కరకు రాగల తాత్త్విక బలం ఉంటే -ఇంత పెద్ద గ్రామానికి ఈ చిన్న దళమే ఎంతగా మేలు చేయగలదో పదేపదే ఏడెనిమిదేళ్లుగా ఋజువౌతూనే ఉన్నది గదా!

            అసలు గ్రామ పౌరుడికుండవలసిన మౌలిక భావనలేవి? ‘తమ ఊరు పరస్పర సహకార - సమన్వయంతో సాగే ఒక సమూహమనీ, ఊరు మొత్తాన్నీ దెబ్బతీయగల కాలుష్యానికి తాను కారణం కూడదనీ, సుదీర్ఘకాలంగా తన ఊళ్ళో జరిగే శ్రమదానోద్యమానికి ఏకాస్తో తానుసైతం తోడ్పడాలని....

            అలాంటి ఆలోచనల్తో మొదలైనదే గదా ఈ చల్లపల్లి స్వచ్చోద్యమం! అందులో అంతర్భాగమైన ఈ రెస్క్యూదళం! కేవలం ఆరుగురు దృఢ మనస్కులు ఈ వేకువ రెండు రోడ్లలో 3 రకాల పనులు సాధించారు;

            - రాదారి పూల తోటలకు పాతిన స్తంభాల కాంక్రీటును మలాటుల్తో బాది విడగొట్టడం;

            - దాన్ని ట్రక్కులో కెక్కించి, పాత కస్తూర్భాయి ప్రభుత్వాసుపత్రి దగ్గర పడిన రోడ్డు మార్జిన్ గుంటను పూడ్చడం;

            - మండల కార్యాలయం ఎదుట వర్షాలకు పడిన మరొక పెద్ద పల్లాన్ని కూడ పూడ్చి, సరిజేయడం.....

            స్వచ్చ కార్యకర్తల ఈ కార్యక్రమం ఏదో ఒక నాటిదో - ఒక పూటదో కాదు - ఏడెనిమిదేళ్ల శ్రమదాన ప్రస్థానం!

            6:20 వేళ - తమ స్వయం నిర్దేశిత బాధ్యతలు ముగిశాక తూములూరి లక్ష్మణరావు గట్టిగా ముమ్మార్లు నినదించిన చల్లపల్లి స్వచ్చోద్యమ లక్ష్యాలతో నేటి కొక సంతృప్తికర ముగింపు!

            రేపటి వేకువ మన వీధి బాధ్యతల కోసం మనం కలువదగినది బెజవాడ బాటలోని చిన్న కార్ల షెడ్డు దగ్గరే!

 

           విజన్ వలదా? సృజన వలదా?

గ్రామమే ఒక కుటుంబంగా - రహదార్లు ఉమ్మడి బాధ్యతలుగా

ఐకమత్యం పెను బలంగా - అందరొకటిగ అడుగులేసే -

కశ్మలాలను తరిమి కొట్టే గ్రామ సౌఖ్యం తీర్చి దిద్దే

విజన్ వలదా? సృజన వలదా? స్వచ్ఛ సంస్కృతి రాక వలదా?

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  26.07.2022.