2492* వ రోజు....           27-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

ఇది 2492* నాటి శ్రమదాన గాధ!

          బుధవారం వేకువ గ్రామ సామాజిక బాధ్యులు ఎన్ని గంటలకు మేల్కొని, ఎప్పుడు బెజవాడ దారి చేరుకొన్నారో గాని, 4.17 కే చిన్న కార్ల షెడ్డు దగ్గర వాళ్ళ ఉనికి తెలుస్తున్నది. తదాదిగా 22 మంది 100 నిముషాలకు పైగా సమయాన్నీ, శ్రమనూ తమ ఊరికి ధారా దత్తం చేస్తే, ప్రణాళికాబద్ధంగా పాటుబడితే మరొక 100 గజాల రహదారి మరింతగా బాగుపడింది!

          ఈ భాగం నిజానికి అదివారం నాడు వీళ్ల కృషితో శుభ్రపడిందే. కాకపోతే ఎవరో - ఎప్పుడో నరికి పడేసిన పెద్దచెట్ల కొమ్మలూ, వాటి మీద అల్లుకున్న తీగలూ, మరో ప్రక్క పైనుండి రాలిన తాటిమట్టలూ, కాయలూ, 3 రోజుల్లోనే మళ్లీ ప్రత్యక్షమైన ఖాళీ మద్యం సీసాలూ, పైన కరెంటు తీగల మధ్యగా పెరిగి, చిక్కుపడిన ఒక పెద్ద చెట్టు కొమ్మ – రెమ్మలే మళ్ళీ ఈ వేకువ అదే చోటికి ఆహ్వానించాయి!

          (షరా! ఈ పిలుపు గ్రామస్తులందరికీ సుమా! అందుకొన్నదీ -  పదే పదే ఒడలు వంచి శ్రమించేదీ ఈ స్వచ్చంద శ్రమదాతలు మాత్రమేనని మనవి! అందుకే ఈ ఊరి స్వచ్చోద్యమం క్షణం కూడ వదలకనన్నాకర్షించేది! ఓపికున్నంత వరకూ నాబోటి వాళ్లు అనివార్యంగా అక్కడకు వెళ్లి, ఈరోజుల్లో మరెక్కడా కనిపించని ఈ వింత దృశ్యాన్ని చూస్తూ - చేస్తూ పరవశించేది!)

          ఒక పెద్ద వైద్యుడు చీపురు పట్టి ఊడవడమే – గ్రామ ప్రప్రధమ మహిళ అంత చీకట్లో కొంగు దోపి, నడుం వంచి గంటల తరబడీ చెమర్చడమూ చూసే గదా - బెజవాడలో సామాజిక బాధ్యుడు M.V. సుబ్బారావు, అమెరికా, స్వీడన్, వంటి చోట్ల మండవ శేషగిరిరావు, నాదెళ్ల సురేష్ వంటి వాళ్ళు ఈ చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని ప్రశంసించేది!

ఈ వేకువ సమయంలో:

1) నలుగురు సుందరీకర్తలు విద్యుత్ తీగల నడుమ పెరిగిన చెట్టు కొమ్మల్ని సాహసించి, తొలగించడంలోని మెలకువను, శ్రమను గమనించాను.

2) డ్రైన్లను క్రమ్మేసిన పెద్ద చెట్ల మొద్దుల్ని ఏడుగురు తమ సంకల్ప బలంలో బైటకు లాగి, ట్రాక్టరులోకెక్కిస్తున్న పట్టుదలను దగ్గరగా చూడగలిగాను.

3) ముగ్గురు మహిళలు - వాళ్లకంత తీరిక, ఓపిక ఎలా వచ్చాయో గాని – గంటన్నరకు పైగా రోడ్డును ఊడ్చి, ప్లాస్టిక్ తుక్కును డిప్పల్లోకీ, మద్యం సీసాలను గోతాల్లోకి చేర్చిన సహనానికి సాక్షినయ్యాను!

4) అలవాటైనందు వల్ల పెద్దగా బాధపడలేదు గాని, వ్యర్థాల్ని రోడ్డు పైకో – డ్రైనులోకో అలవోకగా విసరడం తప్ప – అవి తొలగిస్తున్న స్వచ్చ కార్యకర్తలకు సహకరించని గ్రామస్తుల్నీ తలచుకొన్నాను!

          6.20 వేళ ఒక 10 నిముషాలు సేద తీరి – కాఫీ కబుర్లు చెప్పుకొని, పైడిపాముల కృష్ణకుమారి గారు వడివడిగా పలికిన గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యసంకల్ప నినాదాలకు ప్రతిస్పందించి, హిందూ శ్మశాన వాటిక (1 వ వార్డు) పునరుద్ధరణ కోసం 30 వ తేదీన దాతల, కార్యకర్తల సమావేశం తెలుసుకొని, కార్యకర్తలు గృహోన్ముఖులయ్యారు.

          రేపటి వీధి పారిశుద్ధ్య, సుందరీకరణ, సౌకర్య కల్పనా కృషి కూడ ఈ బెజవాడ బాటలోనే ఉండగలదు!

 

          స్వచ్చోద్యమ చల్లపల్లనే.

సీరియస్ గా నడుస్తున్నదొ – బోరుకొడుతూ ముగుస్తున్నదొ

తమాషాగా జరుగుతున్నదొ - సుమోటోగా తీసుకొన్నదొ

స్వార్థ త్యాగం రహిస్తున్నదొ - సెల్ఫ్ మోటివ్ బిగుస్తున్నదొ

భావి కాలం నిర్ణయిస్తది - సవివరంగా చాటి చెపుతది!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  27.07.2022.