2493* వ రోజు....           28-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వద్దు?

చల్లపల్లి స్వచ్ఛ సుందరీకరణ ప్రక్రియ- @ 2493*

            ఈ గురువారం (28.07.2022) వేకువ 4.17 కే డజను మందీ, కొద్ది వ్యవధిలో 9మందీ - వెరసి ఇరువదిన్నొక్కరు శ్రమ దాతల పూనికతో బాగైనది 60 - 70 గజాల మేర బెజవాడ రహదారి- క్రొత్త అపార్ట్ మెంట్లు దాటి ప్రాత (బాలాజీ ) అపార్ట్ మెంట్ల దాక!

            30-40 రోజులుగా ఇదే బాటను ఊడుస్తుంటే- డ్రైను బాగు చేస్తుంటే- ప్లాస్టిక్ దరిద్రాలను ఏరుతుంటే...మళ్ళీ తెల్లారక ముందే ఇంతగా కశ్మలాలెలా పుట్టు కొస్తాయో- వాటిని చూస్తూ ఉపేక్షిస్తూ- తప్పించుకొంటూ- భరిస్తూ-ఇక్కడి ఇందరు సంస్కారులు ఎలా రాకపోకలు సాగిస్తారో అనేదొక ఆశ్చర్యం!

            రోడ్ల మీద వాహనాల రద్దీతో ఇసుక-దుమ్మూ చేరితే అర్థం చేసుకోవచ్చు! కొంతమంది అవసరార్థం నరికిన చెట్ల కొమ్మల్నీ, గృహస్థ – విద్యాధిక - ప్రయాణికుల చేతుల్లోని ప్లాస్టిక్ సంచుల్ని, సీసాల్ని... డ్రైన్లోకి విసిరితే ఏమని అర్థం చేసుకోవాలి? ఎలా నచ్చ చెప్పాలి? తెలిసిన పెద్దలూ, తెలియని సామాన్యులూ పౌర హక్కుల్నే తప్ప, రాజ్యాంగ బాధ్యతల్ని తలవనే తలవకపోతే ఎవరికీ మొరపెట్టు కోవాలి?

            ఇదేదో నిన్నా - మొన్నటి స్వచ్చోద్యమం కాదే!.. 2493* నాళ్లుగా రోజంతా ఏదోక చోట కార్యకర్తలో ట్రస్టు ఉద్యోగులో వ్యయ ప్రయాసలకోర్చి మెరుగు పరచే ప్రయత్నం చేస్తున్న గ్రామమే ఇది!

            - ఈ వేకువ కూడ ఏడెనిమిది మంది ధృఢ మనస్కులు మురుగు కాల్వలో దిగి, ఎండు - పచ్చి కొమ్మల్నీ, పిచ్చి - ముళ్ళ మొక్కల్నీ - దురద జాతి మొక్కల్తో సహా తొలగించి, బైటకు లాగారు గాని, డంపింగ్ యార్డుకు చేర్చలేదు. ముఖ్యంగా ఎండు మొద్దుల్నీ , పుల్లల్నీ నారాయణరావు నగర్ నివాసులెవరో గాని వంట చెరకు పనికై పట్టు కెళ్ళారు!

- రోడ్లు ఊడ్చిన వాళ్లు గంటన్నర పైగా ఊడుస్తూనే ఉన్నారు,

- పోగుల్ని డిప్పలకెత్తి, ట్రక్కులో నింపి, చెత్త కేంద్రానికి తరలించే పనీ ఆగలేదు!

మూడు రకాల అదృష్టం గురించి నాకెప్పుడూ సందేహమే!

1) ఇందరు శ్రమదాతలు తమ ఊరి బాధ్యత గుర్తించి నెరవేర్చడం వాళ్ల అదృష్టమా?

2) నిమ్మకు నీరెత్తి నట్లు జీవిస్తూ - కార్యకర్తల సేవలందుకొంటున్న కొందరు గ్రామస్తులదా?

3)మూడోది నిశ్చయమే - ఇంతకాలం - ఇందరు కర్తవ్య పరాయణుల నడుమ గడపడమూ, కలిసి పని చేయడమూ నాకొక అదృష్టమే!

            6.25 వేళ ఒక పాఠశాల ఉపాధ్యాయ - స్వచ్ఛ కార్యకర్త భోగాది వాసు స్పష్టీకరించిన గ్రామ స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలతో నేటి శ్రమదాన బాధ్యతకు ముగింపు!

            రేపటి మన కృషి కొనసాగింపు సైతం బెజవాడ బాటలోని అపార్ట్ మెంట్ల దగ్గరే!

 

       స్వచ్ఛ సుందర కార్మికులదే అసలు విజయం!

ఇది శుభంకర- మిది జయప్రద- మిదె సమాజ శ్రేయకరమని -

ఇది వినా సమకాలమున కిక వేఱు ప్రత్యామ్నాయ మేదని -

దిన దినం ఒక గంట శ్రమతో ఊరి మేలుకు పాటు బడుతూ

ఋజువు చేసిన స్వచ్ఛ సుందర కార్మికులదే అసలు విజయం!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  28.07.2022.