2494* వ రోజు....           29-Jul-2022

 

 

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం

2494*(శుక్రవారం) నాటి ప్రయత్నం కూడ విజయవాడ మార్గంలోనే!

        29.07.2022 వ వేకువ సైతం అదే సమయం-25 మంది స్వచ్చ కార్యకర్తలది అదే స్ఫూర్తి- అదే కార్యోత్సాహం- అవే 105 నిముషాల సమయ త్యాగం- ఇంకా అదే సహనం...! ఎనిమిదేళ్లుగా ఒక సముచితాశయంతో ప్రస్థానించే కర్మ వీరులలో ఏ పునరాలోచనా లేదు! యథా ప్రకారమే క్రొత్త అపార్ట్ మెంట్ల దగ్గర మొదలైన గృహిణుల – పెద్దల- రైతుల- 3 గ్రామాలకు చెందిన ఈ సామాజిక- చైతన్య వంతుల శ్రమదానం మరో 100 గజాలకు విస్తరించింది!

        నానాటికీ రహదార్ల మీద వాహనాల రద్దీ పెరిగిపోతూ అక్కడ కార్యకర్తలు చేసే కృషికి  కాస్త ఆటంకంగానే ఉంటున్నది. ఆ అపరిమిత వేగాల్ని కాచుకుంటూ తమ పని చేసుకోవలసి వస్తున్నది. కాలి నడక వాళ్ళూ, సైకిలు వాడే వాళ్లూ తగ్గిపోయి, మోటారు వాహన వినిమయం జాస్తిగా ఉంటున్నది!

        ఎంతో జాగరూకతతో తమ పనులు కానిచ్చే సుందరీకరణ బృందానికి కూడ ఈ వేకువ చిన్న అపశృతి! కరెంటు తీగల నడుమ పెరిగిన కొమ్మల్ని కోసేప్పుడు రెండు తీగలంటుకొని వచ్చిన చిన్నపాటి మంట!

        ఉన్న ఈ పాతిక మందే నాలుగు బృందాలుగా విడిపోయి బెజవాడ బాటనూ, మురుగు కాల్వనూ, రోడ్ల మార్జిన్ల నూ బాగు చేశారు. “కాదేదీ కవిత కనర్హం” అని శ్రీ శ్రీ ఏనాడో చెప్పినట్లు- స్వచ్చ కార్యకర్తలు పట్టించుకోని, తొలగించని వీధి కశ్మలాలేమున్నవి? రహదారి మీద దుమ్మూ, ధూళీ, ఇసుకా, ప్లాస్టిక్ చెత్తలూ, ఎంగిలాకులూ, డ్రైన్లలో ఎండుకొమ్మలూ, ఆకులూ ఏవీ వదల్లేదు!

        గంటన్నర పాటు నడచిన ఈ ప్రయత్నంలో ఏ ఒక్కరి స్ఫూర్తి నీ, కార్య దీక్షనూ పేర్కొనాలన్నా స్థలా భావం వల్ల కుదరడం లేదు! ఒక వేళ ఎక్కువగా వర్ణించినా ఆ నిష్కామ కర్ములు పెద్దగా సంతోషించేదీ లేదు! ఎంత బాగా వ్రాసినా సగానికి పైగా గ్రామస్తులు సానుకూలంగా స్పందిస్తారు గనుకనా!

        చివరి పావు గంటలో కార్యకర్తలు వ్యర్థాలను ట్రాక్టరులోకి ఎత్తే చాక చక్యాన్నీ, వేగాన్నీ, ఒడుపునూ చూసి తీరాల్సిందే!

        6.25 సమయానికి అడపా గురవయ్య గురువు  ప్రకటించిన గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సాధనా కాంక్షా పూరిత నినాదాలూ, వల్లించిన పెద్దల ప్రవచనాలూ కాక పద్మావతి డాక్టరు గారు సెప్టెంబరు – అక్టోబరు నెలల్లో తలపెట్టిన ‘ బ్యాంకాక్ పర్యటన’ వివరాలు నేటి ముఖ్య విశేషం!

        రేపటి వేకువ సైతం మనం కలుసుకొని విజయవాడ బాటలో చేయబోయే కృషిలో అపార్ట్ మెంట్ నివాసులో – సమీప గృహస్తులో సహకరిస్తారేమో చూద్దాం!

                        ఆశంస   

స్వచ్చ ఊహల మెలుకొలిపీ – ఊరి స్థితి నాశీర్వదించీ

సకల సౌకర్యాలు నిలిపే- శ్రమల సంస్కృతి పాదుకొలిపీ

స్వార్థమును దరిజేరనీయని స్వచ్చ సుందర ఉద్యమం ఇది

ముందు ముందుకె సాగ గలదని- దిగ్విజయముగ ముగియగలదని... 

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  29.07.2022.

బాలాజీ అపార్ట్మెంట్స్ వద్ద