1913* వ రోజు....           06-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1913* వ నాటి కృషి.

          ఈ వేకువ 4.02 నుండి 6.18 నిముషాల దాక నిర్వహించిన గ్రామహిత స్వచ్చంద కృషిలో (27+4+2) 33 మంది పాత్ర ఉన్నది. వీళ్ళ సుదీర్ఘ శ్రమదానం వెనుక ఆదర్శవంతమైన తాత్త్వికత ఉన్నది! తమ ఊరి శ్రేయస్సుకై తమ పరిధిలో తాము చేయగల పూర్తి నిబద్ధత ఉన్నది! కార్యకర్తల నేటి శ్రమదానం నాలుగు రకాలుగా జరిగింది.

 

          డజను మంది విజయనగర్ 1వ, 2వ వీధులను రెండు ప్రక్కలా గడ్డి చెక్కి, పిచ్చి కంపను నరికి, గతంలో తాము నాటి, సాకిన పూల మొక్కలకు మరొక మారు పాదులు సరిజేస్తూ, వాలిన కొమ్మలను కలిపి, నిటారుగా నిలిపి, త్రాళ్లతో కట్టి, డ్రైన్లలో చెత్తను లాగి, బాటలను ఊడ్చి శుభ్రం చేశారు. దోమల కల్పవృక్షాలైన మొక్కల్ని తొలగించడం ఈ రెండు వీధుల వారికి వీరు నేడు చేసిన మేలు!

          ఇద్దరు కరుడుగట్టిన ముదురు కార్యకర్తలు సూరి డాక్టరు గారి వీధిని సొంతం చేసుకుని, ఆ సాంతం సకాలంలో శుభ్రపరిచి, నడుములెత్తారు.

 

          గ్రామ సుందరీకర్తలు RTC ప్రాంగణంలోని గోడల చిత్రలేఖనంలో మునిగి, కాఫీ – టీ లైనా గుర్తులేక – సమీక్షా సమావేశానికైనా రాక, మూడు గంటల పాటు అలా శ్రమిస్తూనే ఉన్నారు.

 

          ఇక నాలుగవ ముఠా – గ్రామ రక్షక దళం పాగోలు గ్రామంలోని యార్లగడ్డ శివప్రసాదు గారి భవన నిర్మాణ రద్దును తెచ్చి RTC ప్రాంగణ బాటల ప్రక్క గుంటలలో సర్ది, మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి ఇంటి మరామత్తుల రద్దును ట్రాక్టర్ లో నింపుతూ కనిపించారు.

 

          ఇందుకు సమాంతరంగా ఊరి వేలాది మొక్కలకు ట్రస్టు కార్మికులు నీరందిస్తున్నారు, రహదారి వనాల నిర్వహణలో నలుగురైదుగురు శ్రమిస్తున్నారు.

          ఈ 33 మంది – ఇంత చలిలో – తమ కోసం కాక – గ్రామం కోసం – 60 గంటలకు పైగా ఎందుకు శ్రమిస్తున్నారనేది తెలుసుకోవడం వారికి గుర్తింపు కాదు – ఊరుమ్మడి శ్రేయస్సుకు నొక్కివక్కాణింపు అవుతుంది!

 

          నేటి స్వచ్చ కృషి సమీక్షాకాలంలో మోహనరావు నాయుడు గారి 38 వ వివాహ వార్షిక సందర్భంగా సమర్పిత 500/- విరాళానికి ధన్యవాదాలు.

          ఈ మధ్యాహ్నం 12.15 కు కార్యకర్తలంతా ఏకరూప దుస్తులతో RTC బస్ ప్రాంగణం వద్ద కలిసి, 12.30 కు పాగోలులో నూతన గృహ ప్రవేశానికి వెళ్లాలని నిర్ణయం.

 

          రేపటి స్వచ్చంద శ్రమదాన వేడుక కూడ సాగర్ టాకీస్ మార్గంలోనే !

 

        అతి పునీతం – మనోల్లాసం

అదొక నిస్వార్ధ ప్రపంచం – అసలు సిసలగు సమయత్యాగం

కార్యకర్తల చెమట ధారలు కారి గ్రామం కడు పునీతం

తమకు లాభం కాని శ్రమతో ధన్యజీవుల మనోల్లాసం

నిజంగానే దీర్ఘకాలం నిలిచి లోకాదర్శమౌతుందా!     

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 06/02/2020

చల్లపల్లి.