2495* వ రోజు ....           30-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం!

     నేటికి శ్రమదాన పని దినాల సంఖ్య అక్షరాలా-@2495*

శనివారం (30.07.2022) వేకువ కూడ 23 మంది స్వచ్చ కార్యకర్తల మొత్తం 35 పని గంటల రహదారి పారిశుద్ధ్య సుందరీకరణం ఆహ్లాదకరంగా సాగిపోయింది. బాలాజీ  భవన విభాగం దగ్గర ఆగి కలుసుకొన్న కార్యకర్తలు కొందరు ½

కిలోమీటరు వెనక్కి వెళ్లి, కొందరు ఆటో నగర్ వైపు రోడ్డును కేంద్రీకరించీ, చాలా వరకూ తామనుకొన్న  వీధి మెరుగుదలను సాధించారు!

మొదటగా ప్రస్తావించదగింది-12 మంది కార్యకర్తలు అపార్ట్ మెంట్లు  ఉత్తర రోడ్డునూ, మార్జిన్నూ, అక్కడి రెండు చెట్లనూ శుభ్రపరచిన సుందరీకరించిన -డిప్పల కొద్దీ రకరకాల దుష్ట కశ్మలాలను తొలగించిన సంగతే!  విద్యుత్తీగల దాక అల్లుకొన్న పిచ్చి దొండ తీగల్ని, ఏపుగా పెరిగిన గుబురు చెట్టు కొమ్మల్నీ తొలగించిన నేర్పే, ఓర్పే ఎవరైనా చూసి, మెచ్చదగిన విశేషం!

పిచ్చి మొక్కల్ని నరికో-పీకో, ప్లాస్టిక్ సీసాల్ని సంచుల్ని, గ్లాసుల్ని ఏరి,ఊడ్చి అరగంటలోనే ఆ జాగా తమ ఇంటి ముందే అన్నంతగా పట్టిపట్టి స్వచ్ఛ తరం చేసిన మహిళా కార్యకర్తల్ని- అపార్ట్ మెంట్ల పైనుండి చూసిన వాళ్లు కాకున్నా నేను అభినందిస్తాను.

            ఈ 30-40 గజాల రహదారి నుండే సగం ట్రాక్టరు వ్యర్థాల సేకరణ జరిగిందంటే- వస్తు వినియోగమూ, బాధ్యతా రాహిత్యమూ ఎంతగా పెరిగిపోతున్నదో అంచనా వేయవచ్చు! ఇక ఈ పెద్ద ఊరి సౌకర్యాలకూ, ఆహ్లాదాలకూ,ఎవరు- ఎంతకాలం పూచీ పడాలి?

ఈ హరిత సంపదల - వీధి పూదోటల - నిర్వహణమంతా ఎంత కాలమైనా మనకోసంమనం  ట్రస్టో, స్వచ్చ కార్యకర్తలో చూచుకోదగినదేనా?

తమ ఊరి ఎనిమిదేళ్ల స్వచ్చ- సుందరోద్యమాన్ని అసలే పట్టించుకోని, చూసీ చూడని, చాలామంది సోదర గ్రామస్తులకు ఒక సవినయ సూచనేమంటే మీరు స్వయంగా పాల్గొనే వీలు లేకపోతున్నా, దయచేసి ఏ రోజు కారోజు కార్యకర్తలు కష్టించి సాధిస్తున్న పరిశుభ్ర వీధుల్ని గమనించండి- ఎవరి ఆహ్లాదానికింత శ్రమదానం జరుగుతున్నదో కాస్త పట్టించుకోండి...! మీలాంటి వ్యక్తులే- మీ మధ్య తిరిగే ఈ కొద్ది మంది కార్యకర్తలే ఎన్నెన్ని బాధ్యతల్ని పూర్తి చేస్తున్నదీ వివేచించండి!

6.25 వేళ ఈ పాతిక మంది తాము చేస్తున్న ఈ కొద్దిపాటి మంచి పనితో సంతృప్తి పడుతూ- కబుర్లు చెప్పుకొంటూ- ఆ చెమటలతోనే మట్టి కొట్టుకున్న ఆ బట్టల్తోనే కాఫీ సేవించడం కూడ ఒక మధురానుభూతి ఘట్టమే!

ఈనాటి సమీక్షా కాలంలో పల్నాటి అన్నపూర్ణ మూడు మార్లు వినిపించిన తన ఊరి స్వచ్చ-శుభ్ర-సౌందర్య ప్రపూర్ణ నినాదాలూ, బ్యాంకాక్ కు బదులు కేరళ దిశగా 3 రోజుల విహార యాత్రను శ్రీమతి తరిగోపుల పద్మావతి  ప్రతిపాదించడమూ విశేషాలు!

రేపటి స్వచ్చ- సుందరీకరణ కృషి కూడ బాలాజీ అపార్ట్ మెంట్ల వద్ద నుండే ప్రారంభిద్దాం !

         శ్రమల చెమటల ఫలితమే ఇది

ఆ ఒకప్పటి అస్తవ్యస్తపు అయోమయ చల్లపల్లా ఇది?

ఎవరి సుకృతమో ఇంత స్వచ్ఛత ఎవరి భిక్షో ఇంత శుభ్రత!

ఎవరు పంచిన స్ఫూర్తిరా ఇది- ఎవరు పెంచిన శోభరా ఇది?

చల్లపల్లి స్వచ్చ సైన్యం శ్రమల- చెమటల ఫలితమే ఇది!

 

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

 30.07.2022.