2496* వ రోజు....           31-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం!

2496* (అదివారం) నాటి వీధి పారిశుద్ధ్య శ్రమ విశేషాలు!

            31-7-22- ఈ జులై మాసాంతపు రోజున కూడ బెజవాడ బాటలోని ఆటోనగర్ అనబడే ప్రాంతాన కూడ వేకువ 4.18 నుండీ మళ్ళీ అవే శ్రమదాన సౌందర్యాలు! ఐతే - 34 మంది కార్యకర్తల కృషితోనూ 40 గజాల కన్న మించని పురోగతి! ఏ వీధి - ఎన్ని గజాలు శుభ్రపడిందని కాదు తమ ఊరి బాగు కోసం జరిగే ఒక సుదీర్ఘ విశిష్ట యజ్ఞంలో ఎందరు కార్యకర్తలు - ముఖ్యంగా క్రొత్త వారు -  పాల్గొన్నారనేదే ప్రధానం!

            ఒక్కటి మాత్రం అందరూ ఒప్పుకొంటారు – “ఏ మంచి, క్రొత్త పనైనా తలపెట్టడమూ, అడ్డు పడిన విఘ్నాలను దాటుకొని సాధించడమూ ఎంత కష్టమో ఆ స్వచ్ఛ - సుందర వీధుల్ని నిలువునా కశ్మలాలతో నింపడమూ, వ్యర్ధాలను డ్రైన్లలోకి విసరడమూ, సదరు రహదారి అందాల్ని ఖూనీ చేయడమూ... అంత తేలికఅని! ఐతే ఇక్కడ నిర్మాణాత్మక కృషితో ఊరి అందాలను పెంచజూసేది రోజుకు పాతిక ముప్పై - నలభై మందైతే - ఆ సౌందర్య - సౌకర్య విధ్వంసకారులేమో అత్యధిక సంఖ్యాకులు!

            ఇదేమీ అసంబద్ధ ఆరోపణ కాదు - 40 రోజులుగా బెజవాడ రోడ్డు అందచందాలు మెరుగుపడుతూ ఉంటే - ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు మళ్ళీ వెనక్కి వెళ్లి ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలను ఏరవలసివస్తున్నది! అందమైన పూల మొక్కల సుమ సుందర దృశ్యం మధ్య ఎవరెవరో విసిరిన చెత్త కనిపిస్తే కలిగే బాధ సుమా! చుట్టూ నివాస గృహాల వారు కార్యకర్తల శ్రమదానాన్నొక వినోద దృశ్యంగా మాత్రమే చూస్తుంటే కొందరైనా వచ్చి సహకరించకుంటే కలిగిన సందిగ్ధం తప్ప నిరాధార ఆరోపణ కాదు!

            సరే - ఎవరి మనఃస్థితి వాళ్లది! ఎవరి బిడియాలు వారివి! స్వచ్ఛ సైనికుల ప్రయత్నం మాత్రం ఒక అంతులేని కథలా ఈ ఆదివారం కూడ జరిగిపోయింది! చెట్ల సుందరీకరణం, అంగుళమంగుళాన్ని ఊడ్చి శుభ్రపరచడం, గడ్డిని వదలి, పిచ్చి మొక్కల పనిబట్టడం, ప్లాస్టిక్ భూతాన్ని పట్టి - డిప్పల్లో బంధించడం, ఆఖరికి - ఎరువుగా మారిన అశుద్ధాల్ని పూల మొక్కలకు వడ్డించడం వంటివన్నీ యధాతథంగా జరిగాయి!

            అక్కడ ఇవాళ కూడ ప్రోగులు పడి, ట్రాక్టర్ లోకెక్కి, చెత్త కేంద్రానికి చేరిన వ్యర్ధాలొక బండెడు! కశ్మలాల మీద తిరగబడి, విజయం సాధించిన కార్యకర్తల మొండి పట్టుదల రెండు బళ్లు!

            6.30 సమయంలో నేటి శ్రమదానంతో బాగైన రహదారి భాగాన్ని చూసి, స్వచ్ఛ వైద్యుడు పొందిన ఆనందం బోలెడు! స్వచ్ఛ కార్యకర్తలు నిర్వహిస్తున్న స్వచ్ఛ యజ్ఞ సారాంశాన్ని మామ్మారు గట్టిగా నినదించినది ఆత్మ పరబ్రహ్మం గారు! నిన్న గంగులవారిపాలెం వీధిలోని ముచ్చట్ల కొలువులో విజయవంతమైన హిందూ శ్మశాన వాటికపునరుత్తేజ ప్రయత్నాన్ని సమీక్షించినది డాక్టరు DRK! అమోదించి, హర్షించినది అందరూ!

            బుధవారం నాటి వేకువ సైతం బెజవాడ బాటనే సంస్కరించాలనే నిర్ణయం కూడ అందరిదీ!

 

            కర్మశూరులు ధర్మవీరులు

పరుల బాధ్యత మోసి తృప్తిగ - మనః తృప్తిని పొంది పూర్తిగ

ఉన్న ఊరి స్థితిని గతినీ ఒక సమున్నత స్థాయి చేర్చిన

కర్మశూరులు - ధర్మవీరులు - కార్యకర్తలు చల్లపల్లికి

దొరకుటన్నది పెను విశేషం! మరొక మారు స్వతంత్ర సమరం!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  31.07.2022.