2498* వ రోజు..........           04-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

ఊరి స్వచ్చ సుందరోద్యమంలో 2498* వ నాడు.

            4.8.22 - గురువారం వేకువ కూడ గ్రామ శ్రమదాతలది - అదే సన్ముహుర్తం - 4.17 నుండి 6.05 దాక! ఈ 22 మందిది ఆ 105 నిముషాలు ఏ రోజైనా అదే సందడి తమ ఊరి ఉమ్మడి ప్రయోజనార్థం అదే కర్తవ్య దీక్ష! ఏ నాటి కానాడు ముందస్తుగా అదే ప్రణాళికాబద్ధమైన పురోగమనం!

            ఋతువులు మారవచ్చు - అవసరాన్ని బట్టి, వార్డూ, వీధి మారవచ్చు గాని, లక్ష్యం దిశగా కార్యకర్తల అడుగులు ఆగలేదు. అవి 2500* రోజులుగా - సుమారు 4 లక్షల పని గంటలుగా - పాతిక వేల మంది గ్రామస్తుల సుఖ సౌకర్యాలు కోరి విసుగూ విరామం లేక తడబడక - పడుతున్న అడుగులు మరి!

            అలా నేటి వేకువ కూడ 20 మంది అడుగులు విజయవాడ దారిలోని కాటాల దగ్గరగా వెళ్ళిమళ్లీ మురుగు కాల్వనూ, గట్లనూ, రోడ్డునూ, మార్జిన్ నూ, మరొక 30 గజాలు శుభ్రంచేశాయి? వాళ్ల చేతులు చెట్లను సుందరీకరించాయి! పూల మొక్కల పాదుల్ని చక్కదిద్దాయి! క్రొత్తగా పడిన ప్లాస్టిక్ దరిద్రాన్ని తగ్గించడం కోసం సీసాలు - గ్లాసులు కప్పులు - సంచుల్ని ఏరాయి!

            ఊడ్వడానికి బాగా అలవాటు పడిన వాళ్ళ చేతులు నిర్విరామంగా గంటన్నరకు పైగా రోడ్డుకు పరిశుభ్రతను తెచ్చాయి! ఐదారుగురి చేతి కత్తులు పనికి మాలిన పిచ్చి చెట్లనూ, హద్దులు మీరి పెరిగిన చెట్ల కొమ్మల్నీ నిర్దాక్షిణ్యంగా నరికి, విద్యుత్ కార్మికుల శ్రమను తగ్గించాయి!

            ఈ క్రమంలోనే ఒక మొక్కల పంపకందారుడు ట్రాక్టర్ లోకెక్కి ఐదుగురు మోసి, అందిస్తున్న అన్ని రకాల వ్యర్ధాల్ని అందుకొని, అవలీలగా సర్ది, త్రొక్కి, చిద్విలాసంగా పైనే కూర్చొన్న భంగిమను చూడండి! పనిలో పనిగా ఏ పుణ్యాత్ములో విసరిన వందల కొద్దీ సిరంజీలను డ్రైను నుండి లాగి, పోసిన గుట్టను కూడ వాట్సప్ మాధ్యమంలో గమనించండి!

            ఒక ముసలాయన భుజాల మీద వరుసగా మరో నలుగురు చేతులు వేసి, పని ముగింపు వేళ సరదాగా నడుస్తున్న దృశ్యాన్నీ, ఏడెనిమిది మంది కబుర్లతో కాఫీలు సేవిస్తున్న సన్నివేశాన్ని, ఆయా కార్యకర్తల ముఖాల్లో తమ ఈ నాటి పనితో పొందిన సంతృప్తినీ చూస్తేనే - స్వచ్ఛ చల్లపల్లి శ్రమదానోద్యమం ఇంత అవలీలగా 2500* రోజులెలా నడిచిందో తెలిసిపోతుంది!

            నేటి సమీక్షా కాలంలో మళ్లీ 2500 వ రోజున - ఆదివారం నాడు వందలాది గ్రామస్తులతో కలిసి, స్వచ్ఛ కార్యకర్తలు శుభ్ర సుందరీకరించబోయే హిందూ శ్మశానవాటిక గురించే చర్చ నడిచింది.

            రేపటి వేకువ మనం మరొక మారు కలసి, శ్రమించవలసిన స్థలం బెజవాడ బాటలోని కాటాల ఆవరణే!

 

            సందేహ వలయం

వేల దినముల గ్రామ సేవల వినుత భావన గెలుస్తుందా!

శ్రమవినోదం రహిస్తుందా! స్వచ్ఛ ఒరవడి నిలుస్తుందా?

యువతరం దాన్నందుకొని అత్యున్నత స్థితి చేరనుందా!

గ్రామ మందీ క్రొత్త సంస్కృతి గత చరిత్రగ మిగులనుందా!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  04.08.2022.