2499* వ రోజు....           05-Aug-2022

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

అరుదైన - విలక్షణమైన సేవాదిన సంఖ్య (2499*) కు చేరువగా స్వచ్చోద్యమం!

            ఆగష్టు మాసం ప్రత్యేకత దేశ స్వాతంత్రోద్యమమైతే ఈ నెల 5 వ తేదీ - శుక్రవారం మన ఊరి శ్రమదానం విశిష్టత ఎనిమిదేళ్ళ 2499* నాళ్ళ స్వచ్చ కార్యకర్తల మొండి పట్టుదల! ఒకటి 75 ఏళ్లకు సమీపంగా, మరొకటి 2500* పని దినాల సంఖ్యకు చేరువగా! అది అప్పటి ఒకానొక పెద్ద పేద దేశ స్వేచ్చనుద్దేశించిందైతే - ఇదేమో ఒక తెలివైనఊరిని కశ్మల బానిసత్వం నుండి - కాలుష్య భూతం నుండి - అంతకన్న ప్రామాదికమైన ఎవరో వచ్చి, నన్నూ- నా ఊరిని ఉద్ధరించాలిఅనే భావ దారిద్ర్యం నుండి విముక్తికై నడిచే కొంగ్రొత్త విలక్షణ స్వాతంత్ర పోరాటం! మొదటి దానికి మనం ప్రత్యక్ష సాక్షులం కాము రెండో దాన్ని చూసి, మనం పాల్గొనే ఆసక్తిని చూపం! 

            బెజవాడ రోడ్డులో చిల్లలవాగు వంతెన దగ్గర్లో - లారీల కాటా దగ్గర ఆగిన స్వచ్చ కార్యకర్తలు అక్కడి నుండి వెనుకకూ ముందుకూ, ఎక్కడ అవసరం తమను ఆహ్వానిస్తే అక్కడ కాలుష్య సాంద్రతని బట్టి ఐదుగురో - ఆరుగురో వెళ్లడమూ, వెళ్ళిన  ప్రతిచోటా తమ ముద్ర వేసి, పరిశుభ్ర సౌందర్యాలు మప్పడమూ - ఇదే నేటి పాతిక మంది శ్రమదాతల ఘనత!

            ఈ రోజుల్లో - ఈ గ్రామంలో ఎవరైనా వేకువ 3.30 కే లేవడం, అదీ సొంత పనికి కాక మురుగు కంపుల్లో చెమట కంపుల్తో ఊరి రోడ్ల అందాలకు నగిషీలు చెక్కడమూ స్వచ్చ కార్యకర్తలు కాక ఎవరు చేస్తారు? ఇందరు శ్రమించి, పచ్చదనాన్ని, పూల పరిమళాన్ని అద్దిన పొందికైన రహదారిని ప్లాస్టిక్ కవర్ల మూటలు వేసి, విలాసంగా మురుగు కాల్వల్లో పాత గుడ్డల్నీ, మద్యం సీసాల్ని విసరే గ్రామస్తులో ప్రయాణికులో ఉన్నారంటే నమ్మక తప్పదు!

            సరే! ఆ ఉభయ జీవుల్లో ఎవరి కర్మవాళ్లది! ఈ శ్రమదాతలే పూనుకోని నాడు ఈ చల్లపల్లి ఖర్మదానిది! ఐతే - సూర్యచంద్రుల విధులు మారనట్లు, గాలి కదలికలు కొనసాగినట్లు ఈ ఊరికి అంకితులైన కార్యకర్తల  ఉషోదయ జీవన శైలి ఎనిమిదేళ్లు కాదు పద్దెనిమిదేళ్లైనా ఇలాగే ఉండనుంది!

            శ్రమదానం ముగిసిన తర్వాత సమావేశపు వివరాలిలా ఉన్నవి :

దేసు ప్రభాకర్ గారి గ్రామ సంస్కరణ సంబంధ నినాదాలూ;

కేంద్ర ప్రభుత్యోగి ఐన మెండు వారి మువ్వన్నెల జెండా వితరణలూ; దేసు మాధురి జన్మదినాన ప్రభాకర్ నామధేయుని 1000/- మనకోసం మనం ట్రస్టుకున్నూ, కార్యకర్తలందరికి తినుబండార పందేరాలూ; ట్రస్టు ఉద్యోగులు చిల్లలవాగు గట్టున కాయించిన వాక్కాయల పంపకాలూ ;

అన్నిటి కన్నా ముఖ్యంగా తమ శ్రమదమార్జితమైన ఈ రహదారి మీద కనువిందు చేస్తున్న దట్టమైన హరితవైభవాన్ని ఫోటోలు తీసి, చూసి సంతోషించడాలూ....

            మన రేపటి కలయిక, వీధి సౌందర్య కృషీ ఇదే బెజవాడ బాటలో- కాటాల వద్దే ఉండునని ఇందుమూలంగా తెలియ జేయడమైనది!

 

               ఇదేమైనా పిల్లలాటా ?

  ఇదేమైనా పిల్లలాటా? కథేమైనా కొత్త పాటా?

 చల్లపల్లి చరిత్ర ఎరుగని చలవ మాటిది- మంచి బాటిది!

 స్వచ్ఛ సైన్యపు నిత్యయత్నం- వేల పల్లెల ప్రగతి మంత్రం !

 అందువలనే నా కవిత్వం అనుసరిస్తుందా చరిత్రం!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  05.08.2022.

దేసు మాధురి జన్మదినాన ప్రభాకర్ నామధేయుని 1000/- విరాళం