2501* వ రోజు....           06-Aug-2022

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

చల్లపల్లి స్వచ్చ వ్యసన పరుల (ఎందుకోగాని)2501* వ రోజు

          కావడానికి ఇది శనివారమే  - స్వచ్చ కార్యకర్తల దృష్టిలో ఇదొక ఉత్సుకతను కల్గించే 2500* రోజుల మాంత్రిక సంఖ్యే- ఐనా, నా అంచనాలకు భిన్నంగా నేటి కర్మ వీరుల సంఖ్య నిన్నటి లాగే 22 మాత్రమే! లారీ కాటాల  దగ్గరే! పని చేసింది తడి- పొడీ  బురద నేలల్లోనే ! నేటి కృషి ఫలితంగా పుట్టుకొచ్చిన వ్యర్థాలు కూడ ట్రాక్టరు నిండుగానే!

          రోడ్లు, డ్రైన్లు , ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు చేతిలోని కశ్మలాలు విసరాలనిపించే  గ్రామస్తుల, ప్రయాణికుల  అలవాట్లు ఇన్ని వేల రోజులుగా గ్రహిస్తున్న కార్యకర్తలకే ఆశ్చర్యమనిపిస్తుందే  - నిన్నటి శుచీ – శుభ్రతలు సాధించిన చోట్లనే నేటి వేకువ కూడ ట్రక్కు నిండే వ్యర్థాలు  దొరికాయంటే – ఈ స్వచ్చోద్యమం తెలియని వాళ్లసలు నమ్మగలరా?

          సదరు సందేహ జీవులు నేటి ‘జై స్వచ్చ చల్లపల్లి సైన్యం’  సామాజిక మాధ్యమాన్నొక మారు చూడాలని మనవి!

          ఈ కొద్ది మంది కార్యకర్తలే 3-4 చోట్ల ఏక కాలంలో 1 ) డ్రైను నుండి ఏమేమి బైటకు  లాగారో 2) చెట్ల నెలా సుందరీకరించారో  3) కాటాల పిట్ట గోడల ప్రక్క పడి  ఉన్న మోపుల కొద్దీ వ్యర్థాల నెంత కష్టపడి ట్రాక్టరులోకి చేర్చారో  4) నీళ్ల  గుంటల్నేమాత్రం  పూడ్చారో – 5) అన్నిటి కన్నా మరీ ముఖ్యంగా 2 పెద్ద ఎర్ర గోతాల  నిండా వాడేసిన సిరంజీలను  ఇద్దరు ఎంత భారంగా మోసుకు పోతున్నారో గమనించి నేను వ్రాసేవి యదార్థాలని ఒప్పుకోగలరు!

          ఇన్ని పారిశుద్ధ్య పనులు ఈ కార్యకర్తలు వేల దినాల తరబడీ చేయడమంటే  - అది కేవలం అంతరాత్మల ప్రేరణగా కాక, తాత్త్విక నిబద్ధతతో గాక ఒక రకమైన స్థిత  ప్రజ్ఞతతో గాక- ఇంకేదో కారణంగా – ఏ DRK డాక్టరు బ్రతిమాలితేనో జరగనే జరగవని కూడ ఆలోచనా పరులు అంగీకరించాలి!

          ఇందుకే దేశంలోని ఇతర సవ్య, అపసవ్య ఉద్యమాలలా కాక ఈ చల్లపల్లి గ్రామ స్వచ్చ-సుందరోద్యమం పూర్తిగా భిన్నం – అపురూపం – ఆవశ్యకం అని  ఎక్కడెక్కడి సామాజిక పరిశీలకులు భావిస్తుంటారు మరి! తీర్థ యాత్రికుల్లా వచ్చి-చూసి-పాల్గొని – వాళ్ల గ్రామాల్లోనూ ఇలాంటివి ప్రారంభిస్తుంటారు!

          నేటి సర్వ సభ్య సమీక్షా సమావేశంలో కార్యకర్తలందర్లోనూ రేపు 1 వ వార్డు దగ్గర హిందూ శ్మశాన వాటికను శుభ్ర-సుందరీకరించడం పట్ల ఉత్సుకత కనిపించింది! సర్పంచి, వార్డు సభ్యులు , సామాజిక బాధ్యత నెరిగిన చాలామంది గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే రేపటి శ్రమదాన సందడిని ఇప్పుడే కొందరనుభవిస్తున్నట్లనిపించింది!

          నేటికి  స్వచ్చోద్యమ సారాంశాన్ని 3 మార్లు నినదించింది విలువైన నెత్తురుకు చెందిన D.V. S. కర్ణుడు ! (= రక్తదాన- వీర-శూర – కర్ణ!)

          రేపటి వేకువ – వర్షం ఉన్నా సరే- మనం కలిసి శ్రమించి, తీర్చిదిద్దవలసినది – 1 వ వార్డులోని శ్మశాన వాటిక అనేది స్పష్టం!

       *మహోన్నతమగు మలి ప్రయత్నం!*    

ఒక శ్మశానం శుభ్ర-సుందర హరిత దృశ్యం-పుష్ప భరితం

సర్వ లక్షణ సమాహారం –మృతుల గౌరవ సమారోహం

మరో హైందవ రుద్రభూమికి మహత్తరమగు అంకురార్పణ

మంచి మనుషుల- మంచి మనసుల-మహోన్నతమగు మలి ప్రయత్నం!    

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  06.08.2022.