2502* వ రోజు.......           09-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

2502* వ నాటి శ్రమదానం రెస్క్యూ దళానిది!

            ఈ మంగళవారం (9.08.2022) నాటి  వేకువ మరో మారు 4.30 కు రెస్క్యూ వాలంటీర్ల చతుష్టయం విజయవాడ రహదారిలోని శివాలయం దగ్గర ప్రత్యక్షమయింది! శివభక్తితో కాదు గ్రామ భక్తితో! తమ సామాజిక కర్తవ్యం పట్ల అనురక్తితో!

నేటి స్వచ్చంద శ్రామికుల కృషికి నేపధ్యమేమంటే :

తక్కిన రోడ్ల సంగతలా ఉంచిప్రధాన రహదారి మీద పడిన గుంటలు! ఎడతెగని వాన ముసురుతో అవి పెద్దవై వాహనాలకు తెస్తున్న ముప్పులు! బాధ్యత గల ప్రభుత్వ శాఖలు ఎంతకాలానికీ పట్టించుకోనప్పుడు చూస్తూ ఊరుకోలేక తన కష్టార్జితం 2 లక్షలతో పూనుకొన్న ఒక గౌరవ విశ్రాంత వృద్ధ పౌరుడు! మళ్ళీ వచ్చిన వాన ముసురు ఆ పనిని సగంలో ఆపడం రోడ్డు ప్రక్కన పోసిన రాతి రజను చట్టుగా మారుతుండగా ఈ రెస్క్యూ టీం వాళ్ళు దానిని వేరొక చోటికి తరలించి భద్రపరచడం!

            ఇంతగా సాగ తీసి వ్రాశాడు గాని పని చిన్నదే ఏముంది ఒక ట్రాక్టరులోకి ఆ గుట్టను త్రవ్వి, డిప్పల్తో మోసినింపి డంపింగ్ కేంద్రానికి చేర్చడమే గదా..అని ఎవరికైనా అనిపించవచ్చు! ఈ ఊరి రహదార్ల గుంటల్లో ఎగిరెగిరి పడే  వాహనాలు నడిపేఒళ్లూ బళ్లూ గుల్లయిపోతే ప్రభుత్వాన్ని తిట్టుకొంటూ పోవడం తప్ప సానుకూల దృక్పధంతో ఇలా శ్రమించేది స్వచ్చ కార్యకర్తలు గాక, ఇతరులెందరు?

            గంటన్నరకు పైగా కష్టించినేటికి పని ముగించిన కార్యకర్తలు BSNL నరసింహారావు నాయకత్వంలో తమ ఊరి స్వచ్చ శుభ్ర సౌందర్య సంకల్పాన్ని నినాదాలుగా చాటుకొన్నారు!

            రేపటి వేకువ మన శేష బాధ్యతల కోసం విజయవాడ బాటలోని కాటాల వద్దే మన పునర్దర్శనం!

 

            శ్రమ సమన్విత బృందగానం

ఎందరెందరో కలిసి నడిచే వీధి వీధిని శుభ్రపరిచే

అన్ని వసతులు పెంచి వేసే - ఐకమత్యపు శక్తి చాటే

ఉన్న ఊరిని మనోజ్ఞంగా - స్వస్త సుందర బంధురంగా

శ్రమ సమన్విత బృందగానం జరుపు దృశ్యం చూడలేమా!

- నల్లూరి రామారావు,

   విశ్రాంత ఉపాధ్యాయుడు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

   09.08.2022.