2503* వ రోజు....           10-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

స్వచ్ఛ - సుందర చల్లపల్లి రూపకల్పనలో 2503* వ నాడు.

          10.8.22 వ నాడు విజయవాడ బాటలో కాటాల సమీపంలో తమ ఊరి మెరుగుదల ప్రయత్నంలో కనిపించింది 28 మంది! అందులో కాలుష్యం మీద పోరాట యోధులు 20 మంది! మిగిలిన వారు లంకపల్లి నుండి వచ్చి చల్లపల్లి శుభ్ర - సుందరీకరణను పరిశీలించి, తమ గ్రామంలో ప్రయోగించాలని తలపోసే యువకులు.

          నేటి వీధి పారిశుద్ధ్యం సంగతి కొస్తే దాదాపు గత శనివారం వేకువ కార్యకర్తలు బాగుచేసిన చోటే! ఆదివారం వేకువ హిందూ శ్మశానవాటికలోనికీ, మంగళవారం శివాలయం దగ్గర బరువు పనికీ స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానం వలస పోయింది గదా! ఈ 3 రోజుల వ్యవధి చాలదా - ప్రయాణికులకూ, కొందరు గ్రామస్తులకూ మళ్ళీ ఇక్కడ కశ్మలాలు నింపడానికి!

          ఈ 150 గజాల రహదారిలోనే ఐదారు రోజులకు పైగా శ్రమదానం జరుగుతోందంటే అందుకు మరో కారణం కూడ లేకపోలేదు. అది సుందరీకరణ బృందం పని విధానమే! వాళ్లు పర్ ఫెక్ష నిజాన్ని కాస్త తగ్గించి, ప్రొఫెషనలిజాన్ని కొంచెం పెంచితే మంచిదేమో!

          రహదారిని ఊడ్వడమూ - మార్జిన్లను పట్టిపట్టి శుభ్రపరచడమూ, గడ్డో పిచ్చి ముళ్ల తీగల్నో - మొక్కల్నో ఏరేయడమూ, దుర్మార్గమైన ప్లాస్టిక్ వస్తువుల్ని ప్రోగులు చేయడమూ, వాటిని ట్రాక్టరు సాయంతో డంపింగ్ కేంద్రానికి చేర్చడమూ - ఇవన్నీ కార్యకర్తలు ఎప్పటి నుండో చేసే పనులే! ఇవి గాక నేటి వేకువ ఇక్కడ కనిపించిన క్రొత్త దృశ్యం సందడి చేసింది!

          చల్లపల్లి స్వచ్చోద్యమానికి మూల స్తంభం లాంటి A.V. గురవారెడ్డి (సన్ షైన్ ఆస్పత్రులు) కాకగోపాళం డాక్టరు,  M.V. సుబ్బారావుమండవ శేషగిరిరావునాదెళ్ల సురేష్ .... వంటి వీరాధి వీరాభిమానులున్నారు. వనపర్తికి చెందిన డా. మురళీధర్, డా. శారద వంటి సహృదయుల సౌజన్యం ఉన్నది! వీరి లక్షా 75 వేల దాతృత్వంగా చల్లపల్లికి వచ్చిన  ఒక ష్రెడ్డర్ యంత్రం ఈ ఉదయం చిన్న కొమ్మల్నీ రెమ్మల్ని గడ్డినీ చిన్న చిన్న  తుంపులు చేయడం వచ్చే పోయేవారిని బాగా ఆకర్షించింది.

          6.20 కాలంలో - సమీక్షా సందర్భంలో లంకపల్లి నుండి మన స్వచ్చంద శ్రమదానాన్ని దగ్గరగా చూసేందుకు శొంఠి శ్రీనివాసు ఆధ్వర్యంలో వచ్చిన ఔత్సాహికులు మన  స్వచ్ఛ కార్యకర్తల్ని ఒక్కమారు తమ గ్రామంలోనూ ఇలాంటి శ్రమదానం చేసి, అక్కడ స్ఫూర్తిని పెంచాలని అభ్యర్ధించడమూ - అందుకు మన అర్ధాంగీకారమూ ముఖ్య విశేషాలు! ఈ రోజు స్వగ్రామ పరిశుభ్ర స్వచ్చ సౌందర్య సంకల్పాన్ని నినదించినది వేముల శ్రీనివాస్ గారు!

          అట్లే తమ సమయ – శ్రమ దానాలతో పాటు చల్లపల్లి ఉన్నత స్థితి కోసం 5,000/-, 500/- విరాళాలు సమర్పించిన వారు ప్రాతూరి శంకర శాస్త్రి మరియు కోడూరు వేంకటేశ్వర మహోదయులు.  

          రేపటి వేకువ కూడ శ్రమించదగిన చోటు ఈ కాటాల ప్రాంతమే! 

 

                   ఆ మహోత్తమ తరంగాన్నే

ఇది ఒకంతట తరిగి పోనిది - ఇంత త్వరగా ఆరిపోనిది!

స్థిత ప్రజ్ఞత చూపుచున్నది చిర పురోగమనాన ఉన్నది!

శతం శాతం చల్లపల్లిని సంస్కరించక ఆగనన్నది!

ఆ మహోత్తమ తరంగాన్నే అనుసరిద్దాం! అనుకరిద్దాం!

- నల్లూరి రామారావు,

   విశ్రాంత ఉపాధ్యాయుడు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

   10.08.2022.