1914 * వ రోజు....           07-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1914* వ నాటి సామాజిక కృషి.

ఈ ఉషోదయాత్పూర్వం-4.05 కే మొదలైన 30 మంది. (కార్యకర్తలు 25, ఉద్యోగులు 5 మంది)  గ్రామ సమాజ బాధ్యతలు 6.16 నిముషాల దాక కొనసాగినవి. మూడు విధాల ఈ ఊరి మెరుగుదల కృషి మూడు చోట్ల విస్తరించింది.

 

- నిన్నటి నిర్ణయానుసారం సాగర్ టాకీసు సమీపంలో తమ పనిముట్ల వాహనాలు నిలిపి, యడ్ల వారి వీధి నుండి సినిమా హాలు పర్యంతం 20 మంది రెండు గంటల పాటు శ్రమించి 150 గజాల నిడివి దారిని క్షుణ్ణంగా శుభ్ర-సుందరీకరించారు. దారి ప్రక్క చెట్ల కొమ్మల్ని సవరిస్తూ- దుమ్ము-చెత్త-వ్యర్దాలను ఊడ్చి సేకరిస్తూ-గుంటల్ని సమం చేస్తూ-ట్రాక్టర్ మెకానిజం షెడ్డు దగ్గరి భరింపరాని అపరిశుభ్రతను, అస్తవ్యస్తతను అందంగా రూపొందిస్తూ-ఇదంతా తమ సొంత ఇంటి పనికాదు సుమా- తమ గ్రామం మేలు కోసమని నమ్ముతూ-25 వేల మంది సౌకర్యం కోసం ఈ 25 మంది శ్రమ దాతల శక్తి వంచన లేని కృషిని గుర్తింపక-కీర్తింపక ఎలా ఉండగలను?

 

- రెండవ బృందం-గ్రామ సుందరీకర్తలు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రాంగణ సుందరీకరణలోనే ఈ రోజు కూడా నిమగ్నులయ్యారు. మంచి నీరు తప్ప కాఫీ-టీ పానీయాలైన పట్టక ట్రక్కు పై నిలబడి 3 గంటల పాటు అలా తదేక దీక్షతో వీరి వారం రోజుల కృషిని బస్ ప్రాంగణ ప్రయాణికులు వందలాది మంది అప్రయత్నంగా నైనా  చూస్తున్నారు గాని, స్పందించినదెందరు?

 

- ట్రస్టుకు చెందిన తోట పనిమంతులు రహదారి వనాల పచ్చదనాల-అందచందాలకు మెరుగులు దిద్దుతుంటే నీళ్ల టాంకర్ తో గ్రామ మంతా తిరుగుతూ మొక్కలకు నీరందించే పనిలో మరికొందరు ఉన్నారు!

 

ఒక ఆసక్తికర –ప్రయోజనకర-స్ఫూర్తిదాయకమైన చిన్న కథ! 1988 లో ఈ సాగర్ టాకీసు దగ్గరే ఆస్పత్రి ప్రారంభించిన ఇద్దరు యువ డాక్టర్లు తమ ఆస్పత్రి రోడ్డును, పంచాయతీ వారు శుభ్రం చేయడం లేదనే చిన్న అసంతృప్తితో ఉండేవారు. ఒకనాడు అందులో ఒకరి మేనమామ ఆ యువ వైద్యునితో “ఎవరో వచ్చి మనకు ఏదో చేస్తారని చూస్తూనే ఉంటావంట్రా? నీవే శుభ్రం చేసుకోలేవా... “ అని యాదాలాపంగ అన్న మాటలతో కనువిప్పె- అప్పటి యువ వైద్యుడు- ఈనాటి స్వచ్చోద్యమ సంచాలకుడు-దాసరి రామకృష్ణ ప్రసాదు గారు- తనలాంటి కొందరితో కలిసి ఇంత పెద్ద ఊరి స్వచ్చ-శుభ్ర-స్వస్తతా బాధ్యతలను తలకెత్తుకున్నారు!

 

6.40 నిముషాలకు మైకు అక్కర లేకుండా కోడూరు వేంకటేశ్వర రావు గళం దిక్కులు పిక్కటిల్లి-ముమ్మారు  స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను ప్రకటించడంతో నేటి బాధ్యతలకు తెర!

 

డాక్టర్ మాలెంపాటి గోపాల కృష్ణయ్య గారి 2100/- విరాళానికి ధన్యవాదాలు. రేపటి మన కర్తవ్యం విజయ కాన్వెంట్ పరిసరాల వద్ద.

 

     ప్రతి దినం ఒక గంట ఊరికి...

ప్రజామోదం లభించేటట్లుగ-భాగస్వామ్యం వహించేంతగా

కుల మతమ్ముల బురదలంటక-కుటుంబంగా సాగునట్లుగ

ప్రతి దినం ఒక గంట ఊరికి బాధ్యులౌతూ శ్రమించేటట్లుగ

స్వచ్చ సైన్యం నిజంగానే చల్లపల్లిని మార్చుకోగలదా!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 07/02/2020

చల్లపల్లి.