2504* వ రోజు....           11-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

రహదారి పరిశుభ్రతల శ్రమలో 2504* వ నాడు.

            గురువారం చీకటి వేళ ఆటోనగర్ సమీసాన - బెజవాడ బాటలోనే స్వచ్చ సుందరీకరణ జరిగింది. జరిపిన వారు 24 మంది! ఎవరెవరు విరజిమ్మిన కశ్మలాలు గానీ, ఏరిన ఊడ్చినంత మేర దొరికిన రకరకాల చెత్త బండెడు! గంటన్నర పాటు శ్రమదాన సంబంధిత మాటలు - పాటల సందడిని చూస్తూ, పట్టించుకోని వారు వందలమంది!

            రోడ్డు మార్జిన్లలో - చెట్ల మధ్యలో ఏ కొంచెం ఖాళీ దొరికినా, ముందుగా శుభ్రపరచడం, చదును చేయడం, పూలమొక్కలు నాటే - అలవాటును సుందరీకర్తల బృందం కొనసాగించింది.

            రహదారికి పడమరగా నరికి పడేసిన ఒక అతి భారీ తాళవృక్షం మొదల్ను చూశారా? ముగ్గుర్నలుగురు పలుగు - పార - నక్కులు వాడి, దాన్నుండి సగం బండెడు మట్టినీ, వేళ్ళనూ త్రవ్వి, నరికి ఒక మొండి శిల్పంగా, మారుస్తున్న శ్రమ సౌందర్యాన్ని వాట్సప్ లో చూడండి. ఆ మట్టి, చెమటల సుగంధాన్ని నేను బాగా దగ్గరగా చూడగలిగాను!

            2500* రోజులుగా - మూడు నాలుగు లక్షల పని గంటలుగా - ఈ శుభ్ర సుందర వేకువ బ్రహ్మముహుర్తాన - ఇందరు కార్యకర్తలు - తమ లబ్ది కోసం కాక గ్రామ సమాజ మంతటి ప్రయోజనాన్నీ లక్ష్యించి చేస్తున్న శ్రమదానాన్ని ఏ సామాజిక స్పృహ ఉన్న భావుకులైనా ప్రత్యక్షంగా చూస్తే - ఇక వాళ్ల మనసులెలా ప్రకంపిస్తాయో అనివార్యంగా కవిత్వలెలా పుట్టుకొస్తాయో ఊహించండి!

            చల్లపల్లి స్వచ్చోదమం పట్ల సహానుభూతి కల సహృదయులీ గ్రామంలోనూ, బైటా వేల సంఖ్యలో ఉన్నారు! అసంపూర్ణమైన ఈ ఊరి ప్రజల స్పందనని తలచుకొని - స్వచ్ఛ కార్యకర్తల, ట్రస్టు ఉద్యోగుల ఈ శరీర కష్టం చవిటి నేల వ్యవసాయమనీ, అపాత్రదానమనీ కలత చెందే సహృదయ మిత్రులూ ఉన్నారు! తెల్లారి 6 గంటలు దాటాక - 24 మంది శ్రమను జీర్నించుకొని పరమ శుభ్ర - సుందరంగా (వాట్సప్ మాద్యమంలో) కనిపిస్తున్న నేటి విజయవాడ రహదారి నొక్కమారు చూడమనవి!

            కాఫీల పిదప జరిగిన సమీక్షా సమయంలో ముమ్మారు చల్లపల్లి స్వచ్చ శుభ్ర సౌందర్య సంపాదనా సంకల్పాన్ని నినదించినది వక్కలగడ్డ రామకృష్ణ కాదు - పసుపులేటి సత్యమే!

            సర్వామోదమైన సకల జనాకర్షకమైన చిల్లలవాగు గట్టు శ్మశానాన్నీ, దానికి మరిన్ని (బెంచీల వంటి) సౌకర్యాలు కల్పించదలచిన దాతల్నీ DRK గారు, శాస్త్రి గారు ప్రస్తావించారు!

            రేపటి మన వీధి సౌందర్య ప్రయత్నం కూడ ఇదే కాటాల ఆవరణలోనే ఆగి, చేయవలసి ఉన్నది!

 

            ఊరు నాదని చెప్పుకొందుకు

ఊరు నాదని చెప్పుకొందుకు ఉద్యమించాలనుకొనేందుకు

ప్రజా స్వస్తత ప్రోది చేసే పనులు తలపెట్టేందుకైనా

ఒక నిబద్ధత, ఒక్క త్యాగం ఒక్క చేతన కలుగవలదా?

డప్పు కొట్టీ చాటి చెప్పే దండగల మారి పనులెందుకు?   

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  11.08.2022.