2505* వ రోజు....           12-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

2505* వ పారిశుద్ధ్య పని దినంలో - శ్రమదాన విశేషాలు.

          ఈ శ్రావణ శుక్రవారం శుభోదయానికి ముందే విజయవాడ రహదారికి చెందిన అన్ని రకాల పరిశుభ్ర – సౌందర్యాలను తీర్చిదిద్ద ప్రయత్నించిన గ్రామ పారిశుద్ధ్య పూజారులు (27+3) ముప్పై మంది! చివరి ముగ్గురు వామపక్ష ఆలోచనాపరులు - వీరు కేవలం తాము 14 వ తేదీ సాయంత్రం 75 వ దేశ స్వాతంత్ర్యాన్ని అర్థవంతంగా నిర్వహిస్తూ అందుకాహ్వనించ వచ్చినవారు!

          నెల రోజుల శ్రమదానంతో రోజు రోజుకూ మెరుగులు దిద్దుకొంటూ – “ఓనర్స్ ప్రైడ్ – నైబర్స్ ఎన్వీ” అనేంతగా దట్టమైన హరిత సుందర దృశ్యాన్నా విష్కరిస్తున్న రహదారి బాలాజీ అపార్ట్మెంట్ల – చిల్లలవాగు నడిమి భాగం! చల్లపల్లిలో సగం జనాభాకు తప్ప శుభ్ర – సౌందర్య దిదృక్షాభిలాషులెవరికైనా ఈ రహదారి గర్వ కారణమే! తమ అమూల్య శ్రమ – సమయ దానాలతో ఇంతటి అద్భుత దృశాన్నావిష్కరించిన స్వచ్చ కార్యకర్తలకైతే సంతృప్తి దాయకమే!

          మనిషై పుట్టిన ప్రతి ఒక్కరిదీ శ్రమే! శ్రమ మూల మిదంజగత్అనేదెక్కడైనా ఎప్పుడైనా అక్షర సత్యమే! కబ్జాకోరుల్దీ – నయవంచకుల్దీ - దోపిడీ దారుల్దీ శ్రమే – తమతో బాటు తమ ఊరంతా మరింత బాగుపడాలి అనుకొనే స్వచ్చంద శ్రమదాతలదీ కష్టమే! ఐతే ఏది సార్థకం? ఏది గర్హనీయం? ఏది అనుసరణీయం?

          అసలిలాంటి ఆలోచనలు సంఘర్షించవలసింది స్వచ్చ కార్యకర్తల్లోనా? తామరాకు మీద బొట్టులా అంటీ ముట్టక బ్రతికే సగం మంది గ్రామస్తుల్లోనా?

          నేటి వేకువ కాయకష్టమే కాదు – చల్లపల్లి శ్రమదాతలదేరోజైనా ఒకటే తత్త్వం! వాళ్ళు ఊళ్ళో దుర్గంధాలు సహించరు – రోడ్లు గుంటలు పడితే – రహదార్లు పచ్చదనం లోపిస్తే – శ్మశానాలైనా సరే అశుద్ధంగా – అశుభ్రంగా ఉంటే – బస్టాండ్లు, కాలువ గట్లు పూల మొక్కలు లేక బోసిపోతే....వాళ్ళకి నిద్ర పట్టదు – రోడ్లు ఊడ్వడమో, మురుగు కాల్వల్లో చెత్త దరిద్రాల్ని శోధించి సాధించడమో, రహదార్ల ప్రక్క ఏ చిన్న చోటు మిగిలినా ఉద్యానాల్ని సృష్టించడమో... ఈ 2505* దినాలుగా వాళ్ళ కవే నిత్య కృత్యాలు!

          ఇక వాళ్ళకి ప్రతిఫలమేమిటి? ఏ నాటి కానాడు నిస్వార్ధంగా శ్రమించి, సాధించుకొన్న గ్రామ మెరుగుదలను చూస్తూ తలా కప్పు కాఫీనాస్వాదిస్తూ పొందే సంతృప్తి!

          ఇలాంటి అల్ప సంతృప్తిపరుల - విలక్షణ కష్టజీవుల - అరుదైన వ్యసనపరుల గురించి - ఇందులో ఏ ఒక్కరి గురించైనా పేజీలకు పేజీలు వ్రాయగలను – కానీ.....

దైనందిన శ్రమ శక్తి సమీక్షా సమయంలో:  

1) నారాయణరావు నగర్ లో నిర్వహించనున్న 75 వ స్వాతంత్ర్య దినోత్సవ కరపత్రాల పంపకమూ,

2) అమెరికా ప్రయాణించనున్న విజయవాడ నివాసినీ, చలపల్లి స్వచ్చోద్యమ వీరాభిమానీ – అనన్య కార్యకర్తలకు మిఠాయిలు పంపకమూ, ట్రస్టు ఖర్చులకు 3000/- విరాళమూ

3) ఇకపై మరింత మంది పాల్గొని స్వచ్ఛంద శ్రమదానాన్ని విజయవంతం చేయవలసిన అవసరాన్ని గుర్తు చేసిన ఈ ఉద్యమ సంచాలకుడూ...

          రేపటి శ్రమ వేడుక కోసం మనం కలిసి సాగదగిన చోటు మళ్ళీ ఈ కాటా ప్రాంతమే!

 

      స్వచ్ఛ - సుందర చల్లపల్లిగ మారినట్లే

ఒక సమంజస హేతువుంటే - ఊరికై చిరు త్యాగముంటే -  

ఇరుగు పొరుగుల మేలు కోసం ఎంతో కొంతగ కోరికుంటే -  

శ్రమించగలిగే ఓపికుంటే – సదవగాహన సైతముంటే

అన్ని ఊళ్లూ స్వచ్ఛ - సుందర చల్లపల్లిగ మారినట్లే!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  12.08.2022.