2506* వ రోజు....           13-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే అనివార్యంగా మానేద్దాం!

విసుగు చెందని విక్రమార్కం - చల్లపల్లి సుందరోద్యమం - @2506*

          ఇది ఆగస్టు మాసంలో 13 వ రోజే! అది బెజవాడ మార్గంలో కాటా – చిల్లలవాగు నడిమి భాగమే! శనివారం వేకువ 4.23 నుండి 6.10 దాక సామాజిక శ్రమానంద భరితులు – విసుగు చెందని విక్రమార్కులు 28 మందే! శుభ్ర – సుందరీకృత రహదారి నిడివి 100 గజాలే కావచ్చు గాని, దాని వెనకున్న నిస్వార్థతను బట్టి - అందించే సామాజిక స్పృహను బట్టి - ఆ కృషి అమూల్యమే! మన కాలానికి అవశ్యక ఆదర్శమే!

          గత చరిత్రల సంగతలా ఉంచి, మన సమకాలంలో – పెడధోరణిలో పడి - నానాటికీ కుంచించుకుపోతున్న సమాజంలో - ఈ సువిశాల - సుపవిత్ర దేశంలో - ఇన్ని వేల రోజులుగా - ఇంత సంఘటితంగా - ఒక గ్రామ సామాజిక ప్రయోజనకరంగా - నిష్ఠగా సాగుతున్న శ్రమదానం ఇంకెక్కడైనా ఉందేమో గాలించి తేల్చి చెప్పండి! అలాంటిది లేనేలేదని తేలితే - మిగిలిన గ్రామస్తులు సైతం వీలు చూసుకొని వచ్చి చేతులు కలపండి! దయచేసి - ప్రభుత్వమో - అధికారులో రావాలనీ - ఏ దేవతలో కరుణిస్తారనీ ఎదురు చూడకండి! స్వయం శ్రమ శక్తినే నమ్మండి!

          ఎనిమిదేళ్లనాడు - చల్లపల్లి జనవిజ్ఞాన వేదికకు చెందిన ఒక స్వచ్ఛ వైద్యుడు - ఈ ఊరి మెరుగుదల కోసం వందలాది మందితో జరిగిన విస్తృత సన్నాహక సమావేశంలో - “మా సామాజిక సంస్థ తరపున కొందరం సంవత్సరం పాటు ప్రతి రోజూ ఊరి స్వచ్ఛతను కాపాడే ప్రయత్నం చేస్తాం...అని ప్రకటిస్తే - నమ్మిన వాళ్లు తక్కువ! (లోలోపల నవ్వుకున్న వాళ్లు ఎక్కువ!)

          మరి అలాంటిది - 2506* రోజులుగా - తాము తొలుత అనుకొన్న దానికన్నా మిన్నగా - ఇంత పెద్ద గ్రామ పరిశుభ్ర - సుందరీకరణను సగం వరకైనా నెట్టుకొచ్చారంటే - సదరు శ్రమదాన వీరుల్ని - వాళ్ళను ప్రోత్సహిస్తున్న సుజ్ఞాత - అజ్ఞాత దాతల్ని - పెద్దల్ని ప్రముఖంగా ప్రస్తావించుకొంటే తప్పేమిటి?

కనుక సోదర గ్రామస్తులకు మా పునఃపునః విన్నపమేమంటే:  

మీ గ్రామంలో సంభవిస్తున్న ఈ నిరాడంబర స్వచ్ఛ - సుందరోద్యమం అతి పవిత్రం! పర్యావరణ విధ్వంసకర వీధి కల్మషాల మీద ఇదొక పదునైన లవిత్రం! “అతిఅని భావించకుంటే - ఈ శుభోదయ శ్రమదానం ఉమ్మడి ప్రయోజనకరం గనుక - ఇది ఇంచుమించు శ్రావణ శుక్రవారపు వరలక్ష్మీ వ్రతాలంతటి విశిష్టం! టీవీల నిత్య ధారా వాహికలకన్న - శారీరక సౌష్టాన్నిచ్చే - మన ఊరంతటి మేలును లక్ష్యించే ఈ శ్రమదానం ఎలా తక్కువౌతుంది?

          పురాణ కాలక్షేపాలకంటే - టీవీ చర్చల్లో బి.పి ని పెంచే బూతుపురాణాలకంటే - కొందరు రాజకీయుల నీచ - నికృష్ట - దుష్ట - భ్రష్ట చర్చల కంటే – మన ఊరి స్వచ్ఛ – సుందర - శ్రమదాన కార్యక్రమం నిస్సందేహంగా ఉత్తమోత్తమం కాదా? ఏ 50 ఏళ్ల నాటిదో పౌరాణిక (శ్రీకృష్ణ పాండవీయం) చిత్రంలో కొసరాజు వ్రాసి, కృష్ణ పాత్రధారి NTR తరపున ఘంటశాల పాడిన

మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా! ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తౌదువురా” అనే గొప్ప ప్రబోధగేయం నాతో సహా చాల మందిమి గుర్తు చేసుకోవాలి

          నేటి చల్లపల్లి స్వచ్చోద్యమ సందేశ నినాదాల్ని ఎంతో తెగించి, ధైర్యం చేసి ప్రకటించినది గంధం బృందావనుడు!

          రేపటి వేకువ మనం కలిసి శ్రమించే చోటు హిందూ శ్మశాన వాటికగా నిర్ణయింపబడింది!

 

          *మన స్వచ్ఛ సుందరోద్యమం*

అనారోగ్య ధ్వంసకంగా - అమందానంద ప్రదంగా

అమేయ స్ఫూర్తి ప్రదంగా - అఖిల జన సమ్మతంగానూ

స్వార్థమునకొక జెల్లగానూ - సహనముల సరిహద్దు గానూ

స్వచ్ఛ - సుందర నిదర్శనముగ - పట్టుదలకే పరాకాష్టగ....

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  13.08.2022.