2507* వ రోజు.....           14-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే అనివార్యంగా మానేద్దాం!

41 మంది శ్రమతో మరింత మెరుగైన హిందూ రుద్రభూమి - @2507*

వీరిలో డజను మందైతే 4.19 కే శ్మశానం లో హాజరు! ఆదివారం ఆట విడుపెవరికి? బట్ట నలగకుండా ఐదారు రోజులు ఉద్యోగం చేసే వాళ్లకి! చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలకైతే అది - గంటన్నరకు పైగా ఆత్మసంతృప్తి దాయక శ్రమదాన సందడి! వింతనిపిస్తుంది గాని వీళ్లలో అయ్యో! రేపటి వేకువ భారీ వర్షం పడి మన కార్యక్రమం ఆగిపోతుందేమో! ఇంటి దగ్గరేం తోచదే...అని దిగులు పడేవాళ్లున్న మాట వాస్తవం! - అది మితిమీరిన సామాజిక బాధ్యతనండి - అదృష్టకరమైన వ్యసనమనుకోండి!

          కొందరు సందేహించినట్లే - ఈదురు గాలితో కూడిన వానదేవుడు - ఒకమారు కాదు మూడు నాలుగు మార్లు కార్యకర్తల్ని కుశల ప్రశ్నలడిగే వెళ్లాడు! ఐతే - ఎక్కడా - ఎవ్వరూ పని ఆపలేదు! కొడవళ్లతోనో బరువు కత్తులతోనో ఊరికంతటికీ దోమల్ని పెంచగల మాచర్ల కంపను నరికే వాళ్లు నరుకుతూనే ఉన్నారు! కాస్త బలం చూపి పీకే వాళ్లు పీకుతూనే ఉన్నారు!

          ఈ స్వర్గపురికి పడమటి అంచున పనిచేసిన 10 మందిదైతే కొంత సంక్లిష్ట శ్రమ! అక్కడ ఇతర ముళ్లమొక్కలూ, తీగలూకాక దురద గొండి మొక్కలు సైతం వాళ్లను ఇబ్బంది పెట్టాయి! ఇక చిల్లలవాగు పడమటి గట్టును 20 -30 గజాల మేర సుందరీకరించిన బృందం గురించి చెప్పేదేముంది? ఎగుడు - దిగుళ్లు సరిజేసి, మళ్లీ మళ్లీ చూడక తప్పనట్లు మెరుగులు దిద్దడంలో సిద్ధహస్తులు.

 

          ఇంకో ఉదాహరణను చిత్తగించండి - 5.40 దాక దీక్షగా పనిచేసిన గాయకుడొకాయన చినుకుల్లోనే కాఫీలు తెచ్చే డ్యూటీ మీద వెళుతూ ఇద్దరు ముఖ్యుల్ని పిలిచి, తాను తిరిగొచ్చే సరికి తన వంతు పనిని ఎలా చెయ్యాలో అప్పగింతలు పెట్టి వెళ్లాడు! (పేటియం గాళ్లో, పెయిడ్ ఆర్టిస్టులో ఐతే ఈ నిబద్దత - ఈ ప్రణాళికా - ఇంతటి జాగ్రత్త ఉండదు గాక ఉండదు!)

          ఈ సామూహిక శ్రమదాన శక్తి ఎలాంటిదంటే - ఒక మనిషికి మామూలుగా ఉండే ధైర్యాన్ని 10 తో గుణకారం చేయిస్తుంది (1x10 అన్నమాట)! శవ దహనం జరిగిన తాజా కళ్లం దగ్గర బలిష్ఠమైన ఎముకల్ని లాగి పోగేస్తున్న కార్యకర్తను వాట్సప్ లో గమనించండి!

          ఈ వేకువ గంటకు పైగా వ్యవధిలో నేనిలాంటి సన్నివేశాలెన్నో గమనించాను. ఇంటికి వచ్చాక సైతం తదేక దీక్షగా ఒక్కొక్క చిత్రాన్ని పరిశీలించి జలదరించాను! మన చుట్టూ సమాజంలో క్రౌర్యం మోసం - దౌర్భాగ్యం - దుర్మార్గం ఉన్నట్లే - కొంతమేరకైనా భావ వైశాల్యం - త్యాగం - సామాజిక కర్తవ్యం మిగిలే ఉన్నాయని గ్రహించాను! కనీసం ఒక్క ఊళ్లోనైనా - జరుగుతున్న విశిష్ట సామాజిక కార్యక్రమ సంబంధీకుడినైనందుకు కాస్త గర్వించాను!

          6.25 సమయానికి ఈ 40 మంది కారకర్తల చేత మూడు మార్లు తన ఊరి స్వచ్చ - పరిశుభ్ర సౌందర్య సాధక నినాదాలను పలికించినది ఒక కరుడుగట్టిన స్వచ్ఛ కార్యకర్త - పసుపులేటి సత్యనారాయణ! జులై మాసపు మనకోసం మనంట్రస్టు సంబంధిత భారీ లోటు బడ్జెట్టును వివరించినది డాక్టరు రామకృష్ణ మహోదయుడు!

          ఈ సాయంత్రం 4.00 కు లంకపల్లి కార్యక్రమానికీ, బుధవారం వేకువ విజయవాడ బాటలోని శ్రమదాన నిర్ణయానికీ ఆమోదముద్ర అందరిదీ!

 

          రచ్చ గెలిచి ఇంట గెలుపు

ఊరి ఏడు రహదారులు స్వచ్చోద్యమ గురుతులు

స్వచ్చ మరుగు దొడ్లు బస్సు ప్రయాణికులువరములు

ఇపుడిపుడే ఊరి జనుల కివి తెలిసొస్తున్నవి

రచ్చ గెలిచి ఇంట గెలుపు కివే ఉదాహరణలు!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  14.08.2022.