2508* వ రోజు....           15-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం!

స్వాతంత్ర్య దినోత్సవ సార్థక శ్రమదానం - 2508*

          ఈ సోమవారం (15.8.22) వేకువ కూడ 27 మంది కార్యకర్తల శ్రమానందం బెజవాడ దారిలోనే! స్వేచ్ఛా – స్వాతంత్ర్యాలకు, స్వచ్ఛ – శుభ్రతలకూ నిర్వచనం చెప్పిన ఒక మౌన ముని సాక్షిగానే! గతంలో పలుమార్లు శుభ్ర – సుందరీకరించినా - ఎడాపెడా వర్షాలకు కలుపులు బలిసిన గాంధీ స్మృతి వనాన్నే!

          ఇంత చల్లని వేకువ 4.19 - 6.12 నడిమి కాలంలో కార్యకర్తలు కార్చిన చెమట చుక్కలు బోలెడు! అందుకు ఋజువులు వాళ్లు మాటిమాటికీ త్రాగిన నీళ్లు! ఏ సిద్ధాంత విభేదాలకో బలైపోయిన జాతి పిత మౌన సందేశం ఒక వంక! 75 ఏళ్ల దేశ స్వాతంత్ర్యాన్ని పడికట్టు మాటల్తో కాక - ఒక సముచిత శ్రమదానంతో విభిన్నంగా నిర్వహించిన 27 మంది స్వచ్ఛ కార్యకర్తల క్రియాత్మక సందేశం మరో వంక!

          ప్రసార మాధ్యమాల్లో కొందరి స్వాతంత్ర్యోత్సవ సందేశాల్ని వింటుంటే ఏ పాటి పవిత్రులు - ఎందుకు - ఏ అమాయకులను ప్రబోధిస్తున్నారో బొత్తిగా తెలియడంలేదు! వాస్తవ దేశ సామాజిక పరిస్థితులు బేరీజు వేసుకొంటే – 75 ఏళ్ల దేశ ప్రస్థానం ఏ వెలుగులెవ్వరికి పంచిందో తరచి చూసుకొంటే మతిపోతున్నది!

          అందుకనే - ఈ ఎనిమిదేళ్ల చలపల్లి స్వచ్ఛంద శ్రమదాన సంఘటన ప్రస్తావించక తప్పని ఒక రెలవెన్స్! సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే ప్రధానమంత్రి – ఇదే రోజున - దేశంలో ప్రతి మూలా – గాంధీకి ప్రీతి పాత్రమైన స్వచ్ఛ – శుభ్రతల ఆవశ్యకతను ఎర్రకోట నుండి ప్రముఖంగా ప్రస్తావిస్తే - అంతకు ముందు నుండే జనవిజ్ఞాన వేదిక పక్షాన మొదలైన ఈ శ్రమదానోద్యమం దేశంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ అమలు జరుగుతున్నది!

          ఎవర్నడగాలో దిక్కుతోచక - ఈ గాంధీజీనే అడగాలనుంది –

          “ఓమహాత్మా! మహర్షీ! ఓ అహింసాశయ తపస్వీ!

          ఏది శుభ్రత - ఏదశుభ్రత - ఏది సత్యం - ఏదసత్యం.

          ఏవి మాటలు – ఏవి చేతలు - ఏది త్రికరణశుద్ధి – ఎక్కడ!.....

          ఈ ప్రశ్నల పరంపరలో కొన్నిటికైనా మన ఊరి శ్రమదానోద్యమం బదులిస్తుంది. నేటి 110 నిముషాల సామూహిక శ్రమదానంతో

- స్మృతి వనం దక్షిణభాగం బాగుపడింది.

- ప్రముఖ మహిళలు నక్కులతో కలుపు గడ్డిని చెక్కుతూ చెమట చిందించడాన్ని,

- బరువైన గునపాలతో, నక్కుల్తో, పారలతో నేలను త్రవ్వి – చెక్కి - గడ్డిని ఏరి - శ్రమిస్తున్న కార్యకర్తల్నీ

- డిప్పలకెత్తి – మోసి - ట్రాక్టరులో నింపి – వ్యర్ధాలను చెత్త కేంద్రానికి చేరుస్తున్న శ్రమ జీవుల్నీ

- కార్యకర్తలు త్రాగుతున్న కాఫీల కన్న మధురంగా – ఉత్తేజకరంగా - శ్రావ్యంగా దేశ – గ్రామ భక్తి పూరిత గేయాలనాలపించిన మన ఆస్థాన గాయకుడినీ,

- సమీక్షించిన మన శ్రమదాన మార్గదర్శకుడినీ తప్పక గమనిద్దాం!

          బుధవారం వేకువ కూడ మన శ్రమదానం ఇదే విజయవాడ దారిలోని స్మృతి వనం నుండే మొదలు పెడదాం!

 

          “*అతి పరచయాదవజ్ఞః*”

అతి పరచయాదవజ్ఞః అనే సూక్తి నిజం నిజం

చల్లపల్లి అత్యధికులు స్వచ్చోద్యమ మెరుగరు

ఆ ఉద్యమ విజయాలకు అంగీకారం తెలపరు

దేశ - విదేశస్తులేమొ దీన్ని ప్రస్తుతింతురు!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  15.08.2022.