2509* వ రోజు....           17-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం!

స్వచ్ఛ కార్యకర్తల పునఃపునరంకితం 2509* వ నాటిది!

          అదేమో ఈ బుధవారం వేకువ 4.19 - 6.07 సమయాల మధ్య ప్రవర్తిల్లినది! సదరు గ్రామ సేవా నిరతులు 27 మంది! ఈ విలక్షణ కార్యక్షేత్రం మళ్లీ బెజవాడ రహదారిలోని జాతిపిత స్మృతి వనమే! అదీ అతని పాదపీఠి ఎదురుగా కుడి ఎడమలుగా పరిమిత ప్రదేశమే! పని చోటు పరిమితమే గాని, అక్కడి కార్యకర్తల శ్రమ, పుట్టుకొచ్చిన వ్యర్ధాలు మాత్రం అపరిమితాలే!

          నా వ్రాతలు వట్టి భాషాభేషజం అనిపిస్తే ఏ విజ్ఞులైనా దయచేసి ఐదారు నిముషాలు జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” సామాజిక మాధ్యమ ఛాయా చిత్రాలను పరిశీలించగలరు! వ్యర్ధాల నిండుకుండగా ఉన్న ట్రాక్టరు ట్రక్కును తొలుత వీక్షించవచ్చు.

          తర – తమ – కులమత - భేదాలు గుర్తుకే రాని ఒక డాక్టరమ్మనీ, సర్పంచమ్మనీ, ఆస్పత్రి నర్సమ్మల్నీ, చల్లగా ఉండి కూడ ఉక్కపోస్తున్న విచిత్ర వాతావరణంలో సదరు మహిళామతల్లుల స్వేద స్రవంతుల్నీ కొంచెం నిదానిస్తే మీరు చూడగలరు!

          గునపాలతో, గొడ్డళ్లతో, పారల్తో, రైల్వే పారల్తో, నక్కుల్తో పని చేసిచేసి, నేలలోని గడ్డిని ఏరిఏరి, చెమట చుక్కల మోహాల్తోనూ, చెమట – దుమ్ముల బట్టల్తోను ఉన్న కార్యకర్తల్నీ పరిశీలించాక – అరె! ఇదేదో పాత కాలం నాటి గ్రామాల్లో – ఏ శుభకార్యానికి ముందో కొందరు కలివిడిగా చేస్తున్న శుభ్ర – సుందరీకరణ లాగుందే... అనిపిస్తుందా?

          100 నిముషాలకు పైగా జరిగిన సామూహిక శ్రమదానం తరువాత అందరూ కాఫీ – సరదా కబుర్ల 10 నిముషాల కాలక్షేపం పిదప - ఆనవాయితీగా 10 నిముషాలు దైనందిన కృషి పూర్వాపరాల సమీక్షా సమావేశం కూడ వాట్సప్ మాధ్యమంలో ఉన్నది.

          ఏ రోజుకారోజు - ఏదో నా సంతోషం కొద్దీ చల్లపల్లి స్వచ్చోద్యమ వర్తమాన చరిత్రను కొంచెం వివరిస్తుంటే - ఇంత పెద్ద గ్రామంలోని ఏ 100 మందో చదివితే చదవవచ్చు! వారిలో సగం మందికైనా ఇంత మంచి శ్రమదానం నచ్చి కూడ ఉండవచ్చు - ఫొటోల్లో చూస్తేనో, ఇలా వ్రాస్తున్నది చదువుతుంటేనో ఆశ్చర్యం కలిగితే - ఇక ప్రతి రోజూ కార్యకర్తల్ని అనుసరిస్తూ – ప్రత్యక్షంగా పరిశీలిస్తూ - మాటాడుతూ ఉండే నాకెంత అద్భుతమనిపిస్తుంది?

          6.20 సమయంలో ఒక గట్టి కార్యకర్త - వక్కలగడ్డ రామకృష్ణ (ఎంత హోమ్ వర్క్ చేశాడోగాని) సుస్థిరంగా ముమ్మారు చెప్పిన చల్లపల్లి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యసాధనా సంకల్ప నినాదాలు అందర్నీ ఆకర్షించాయి!

          రేపటి వేకువ మన శ్రమదాన ప్రదేశాన్ని రైతు బజారు రోడ్డులోని C.I. గారి ఆఫీసులో నిర్ణయించడమైనది.

 

          ఈ ధన్యత – ఈ మాన్యత

ఎవరి పుణ్యమీ శుభ్రత – ఎవరి చలువ ఈ స్వస్తత

ఇంత హరిత సంపద ఈ వింతల వీధి మనోజ్ఞత

ఎంత శ్రమకు ఈ సఫలత - ఎవ్వరిదీ స్థిత ప్రజ్ఞత

ఈ ధన్యత – ఈ మాన్యత - స్వచ్ఛ కార్యకర్త ఘనత!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  17.08.2022.