2513* వ రోజు.......           22-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం!

మరొకమారు – 2513* వ నాటి రెస్క్యూ టీం గ్రామ బాధ్యతలు.

          సోమవారమంటేనే – స్వచ్చ చల్లపల్లిలో రక్షక దళ కృషి వారమని అర్థం! ఈ 22.8.22 వేకువ సమయంలో ఆ టీం సభ్యులు ఐదుగురు – చివర్లో వాళ్లకు మరో ముగ్గురు తోడయ్యారు.

          ఈ ఊరి స్వచ్చోద్యమ ప్రముఖ దాత – ఒక విశ్రాంత ఉపాధ్యాయుని పెద్ద విరాళంతో ముఖ్య రహదారుల గుంటలు పూడ్చేపని వాన ముసురు వల్ల అర్ధాంతరంగా ఆగి, అందు నిమిత్తం తెచ్చి శ్రీ మంతుల క్లబ్ దగ్గర ఉంచిన రాతి పొడి వానలతో గట్టి పడిపోతే - ఈ వేకువ ఈ కార్యకర్తల పంచకం దాన్ని కష్టం మీద త్రవ్వి, ట్రాక్టరులోకి ఎత్తి, దాని అవసరమున్న గంగులవారిపాలెం బాటలోకి చేర్చడమే ముఖ్య చర్య!

          మన ఊరి సమస్యల్ని అర్థం చేసుకొని, ఊరి జనం సుఖంగా నిద్రించే వేళ తమ చెమటను సార్థకం చేస్తున్న ఈ ఐదుగురు బాధ్యులకూ - వాళ్లకు సంఘీభావం తెల్పిన ముగ్గురు ఇతర కార్యకర్తలకూ మన ధన్యవాదాలు!

          శ్రమ వేడుక ముగిసే సమయాన డాక్టరు పద్మావతి గారు ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్చ – పరిశుభ్ర – సౌందర్య చోదక పలుకులతో రెస్క్యూ టీం వారి శ్రమదానం ముగిసింది.

- నల్లూరి రామారావు,

   22.08.2022.