2514* వ రోజు.......           23-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం!

రక్షక కార్యకర్తలు సుందరీకర్తలుగా మారిన వేళ - @2514*

            ఔను! ఈ మంగళవారం వేకువ - గంగులవారిపాలెం వీధిలో జరిగిన మార్పు! వారు వీరౌతారు వీరు వారౌతారు...అన్నట్లుగా సావాస దోషం వల్లనేమో గాని, ఐదుగురు రెస్క్యూ టీం కాస్తా - రెండు పొడవైన ఈత చెట్ల సుందరీకరణకు పాల్పడ్డారు!

            బాగా పొడవాటి రెండు చెట్లనూ, అందుకు తగ్గ బారైన నిచ్చెన్లనూ, వాటి మీదకెక్కి మండల్ని నరుకుతున్న 30+ , 60+ ఏళ్ల ముగ్గురినీ వాట్సప్ చిత్రంలో గుర్తించండి! ఆ చెట్లకు వీధికి తగ్గ అందాలు తేవడమూ, క్రింద ఉన్న చామంతి వంటి పూల మొక్కలకు వేడి వెలుతురూ అవకాశమివ్వడమూ ఈ ముఠా ఉద్దేశమై ఉంటుంది!

            ఏక కాలంలో రెస్క్యూ/ సుందరీకరణంగా చెప్పదగిన వీరి గంటన్నర ప్రయత్నానికి చివర్లో ఒక ప్రముఖ వైద్యుడూ, ఒక వృద్ధ విశ్రాంత ఉపాధ్యాయుడూ సాక్షులు!

            ఈ వీధి చెట్ల సుందరీకరణం నేడు ముగియలేదనీ, ముందు ముందు రంగు విద్యుద్దీపాలంకరణ  జరగనుందనీ తెలిసింది! కస్తూరి శ్రీనివాసరావు ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్చ శుభ్ర - సుందరీకరణ భావాలతో వీరి నేటి కృషి ముగిసింది.

            రేపటి వేకువ కాస్త కోలాహలంగా జరిగే శ్రమదాన ప్రదేశం హిందూ శ్మశానవాటిక అని గమనార్హం!

- నల్లూరి రామారావు,

   23.08.2022.